నోటు.. దొరికితే ఒట్టు! | currency problems increased in hyderabad | Sakshi
Sakshi News home page

నోటు.. దొరికితే ఒట్టు!

Dec 11 2016 9:51 AM | Updated on Sep 22 2018 7:51 PM

నోటు.. దొరికితే ఒట్టు! - Sakshi

నోటు.. దొరికితే ఒట్టు!

పొద్దున్నే పనులు మానుకొని వచ్చి ఏటీఎం ముందు లైన్లో నిలబడ్డా..

♦ కరెన్సీ కోసం జనం తిప్పలు
♦  నెలరోజులైనా తీరని గోస
♦ రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ సర్వే
♦  పనిచేయని ఏటీఎంలు.. ఎక్కడికెళ్లినా ‘నో క్యాష్‌’ బోర్డులు
♦  జిల్లాల్లో 245 ఏటీఎంల పరిశీలన.. 210 ఏటీఎంలో డబ్బులే లేవు
♦ హైదరాబాద్‌లో 335 ఏటీఎంల్లో.. 324 మూత


సాక్షి, హైదరాబాద్‌:
‘‘పొద్దున్నే పనులు మానుకొని వచ్చి ఏటీఎం ముందు లైన్లో నిలబడ్డా.. నాలుగు గంటలు ఉంటే రూ.2 వేలు వచ్చాయి..’
– వరంగల్‌ జిల్లాలో ఓ సామాన్యుడి గోస
‘‘నేను ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎన్టీఆర్‌నగర్, కొత్తపేట్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, అంబర్‌పేట్, రామంతాపూర్, ఉప్పల్, నాగోల్‌ ప్రాంతాల్లోని ఏటీఎంలన్నీ చూశా. ఎక్కడా క్యాష్‌ లేదు. ఎక్కడికెళ్లినా నో క్యాష్‌ బోర్డులే కనిపించాయి..’’
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆవేదన
...ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే! రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇవే పాట్లు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి నెల దాటినా జనానికి  కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో తగినంత నగదు లేక, ఏటీఎంలలో డబ్బుల్లేక విలవిల్లాడుతున్నారు. రాత్రింబవళ్లు ఇటు బ్యాంకులు, అటు ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వెళ్లినచోటల్లా ‘ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌’, ‘నో క్యాష్‌’ బోర్డులే వెక్కిరి స్తున్నాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి ఏటీఎం కేంద్రాలు మూతబడి ఉన్నాయి. పనిచేస్తున్న చోట డబ్బులు పెట్టిన నిమిషాల వ్యవధిలో నగదు నిల్వలు నిండు కుంటున్నాయి. తర్వాత ఎప్పట్లాగే బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనం కరెన్సీ కష్టాలపై ‘సాక్షి’ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది.

245 ఏటీఎంలు.. 210లో నో క్యాష్‌
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కలిపి 7,548 ఏటీఎం మిషన్లున్నా యి. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2 వేల నోట్లను ఏటీఎం మిషన్ల ద్వారా పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. సాంకేతిక సమస్యలు అధిగమించడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు 4 వేల ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ప్రక్రియ పూర్తయింది. కానీ వీటన్నిటి ద్వారా నగదు పంపిణీ జరగడం లేదు. బ్యాంకుల వద్ద నగదు కొరతతో ఏటీఎం కేంద్రాలు తెరుచుకోవడం లేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఏటీఎంలను పరిశీలించగా.. చాలాచోట్ల ‘నో క్యాష్‌ బోర్డు’లు కనిపించాయి. 245 ఏటీఎంల వద్ద సర్వే చేపట్టగా.. అందులో 210 ఏటీఎంలల్లో నగదు లేదని తేలింది. 35 ఏటీఎంలు పనిచేస్తున్నట్లు కనిపించినా... కాసేపటికే అందులో నగదు అయిపోయింది. మొత్తంగా 87.75 శాతం ఏటీఎంలు పనిచేయలేదు.


సొంత ఖాతాదారులకే నగదు!
నగదు కొరత ఉండడంతో పలు బ్యాంకులు, ఏటీఎంలలో కేవలం సొంత శాఖలకు సంబంధించిన కార్డుల్ని మాత్రమే అంగీకరిస్తున్నాయి. నగదు అందుబాటులో ఉంటే సొంత ఖాతాదారులు మాత్రమే నగదును తీసుకునేలా ఏర్పాట్లు చేశాయి. దీంతో గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా.. తీరా మిషన్‌లో కార్డును స్వైప్‌ చేసి అవాక్కవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక నెలసరి వేతనాలు పొందే చిరుద్యోగులు నగదు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.

నేడు, రేపు మరిన్ని కష్టాలు
బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యా యి. నగదు అందుబాటులో ఉన్న ఏటీఎంల వద్ద శనివారం భారీగా క్యూలైన్లు కనిపించాయి. ఆది, సోమ వారాలు సైతం సెలవు దినాలే కావడం తో ఏటీఎంలు పనిచేసే అవకాశాలు తక్కువే. దీంతో కరెన్సీ కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి.

రాజధానిలో ఎక్కడ చూసినా బారులే..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మొత్తం 335 ఏటీఎంలను పరిశీలించగా వాటిలో 11 ఏటీఎంలు మాత్రమే పనిచేశా యి. మిగతా 324 ఏటీఎంలు మూసి ఉన్నాయి. తెరిచిన ఏటీఎం కేంద్రాలన్నింటిలోనూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకే  డబ్బులు అయిపోయాయి. పనిచేసే ఏటీఎంల ముందు వందలాది మంది బారులు తీరి కనిపించారు. కాసేపటికే నగదు అయిపోవడంతో ఎందరో నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement