ఆర్టీసీలో చందా దందా! | Contribution to cut wages for union workers | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో చందా దందా!

Aug 19 2015 12:48 AM | Updated on Sep 3 2017 7:40 AM

సంఘం సంక్షేమం కోసమంటూ సభ్యుల నుంచి చందాలు వసూలు చేయడం సహజం. ఇది ఆయా సంఘాల్లోని సభ్యుల ...

యూనియన్ కాంట్రిబ్యూషన్ కోసం కార్మికుల వేతనాల్లో కోత
విభజనకు పూర్వం ఆ విధానాన్ని నిషేధించిన ఎండీ
ఏపీఎస్ ఆర్టీసీలో కొనసాగుతున్న నిషేధం... టీఎస్‌ఆర్టీసీలో డోంట్ కేర్
గతంలోనే సంస్థ వసూలు చేయడాన్ని తప్పుపట్టిన కోర్టు
ఈసారి సంవత్సరం చందా ఒకేసారి వసూలుకు సర్క్యులర్ జారీ
కార్మిక నేతల చేతుల్లోకి చందాలు!
భారీ అక్రమాలకు ఊతమిచ్చినట్లేనని కార్మికుల ఆందోళన

 
హైదరాబాద్: సంఘం సంక్షేమం కోసమంటూ సభ్యుల నుంచి చందాలు వసూలు చేయడం సహజం. ఇది ఆయా సంఘాల్లోని సభ్యుల ఇష్టపూర్వకంగా జరుగుతుంది. కానీ, ఆర్టీసీలో వింత విధానం కొనసాగుతోంది. కార్మికుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతడి వేతనంలో నుంచి ఆ మొత్తాన్ని మినహాయించి సంఘం నేతల చేతుల్లో పెడుతోంది. కార్మికులు దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా యాజమాన్యం మాత్రం సంఘం నేతలకు గులాంలా వ్యవహరిస్తోంది. వసూళ్లు సరికాదంటూ కోర్టు చెప్పినా... 2015 సంవత్సరానికి ఒకేసారి 12 నెలల చందా వసూలుకు సర్క్యులర్ జారీ చేసింది. ఇది అక్రమాలకు ఊతమిస్తోందంటూ కార్మికులు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ సంగతి...
ఆర్టీసీ కార్మికులు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్మిక సంఘానికి ప్రతినెలా రూ.30 వరకు చందా చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుల ఆమోదం ప్రకారం దీన్ని నెలకోసారి.. లేదా కొన్ని నెలలకు కలిపి ఓసారి వసూలు చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు అలాగే జరిగేది. కానీ, గుర్తింపు సంఘం సభ్యుల నుంచి తానే ఆ మొత్తాన్ని వసూలు చేసి ఆ యూనియన్‌కు చెల్లిస్తామంటూ 2012లో నిర్ణయించిన ఆర్టీసీ అప్పటి నుంచి అలాగే చేస్తోంది. సంఘం, కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడాల్సిన ఆ చందా మొత్తాన్ని నేరుగా కార్మిక నేతల చేతుల్లో పెట్టడంతో భారీ అక్రమాలకు ఆస్కారం కలుగుతోందని, కొందరు యూనియన్ సభ్యులు ఇష్టం వచ్చినంత మొత్తాన్ని అంగీకార పత్రాల్లో రాసి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని కార్మికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
 
నిషేధించినా అమలు..
 గత మే నెలలో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో... ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎన్‌ఎంయూకు రూ.80 లక్షల చెక్కును అందజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో అసలు ఈ విధానమే సరికాదంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దాన్ని నిషేధించారు. అప్పటికి ఆర్టీసీ విభజన కానందున ఆ నిషేధం రెండు రాష్ట్రాల్లో అమలులో ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేశారు. దాని ప్రకారం ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో నిషేధం అమలవుతుండగా.. తెలంగాణలో మాత్రం యాజమాన్యం దాన్ని అమలు చేస్తూనే ఉంది. ఒకేసారి ఏడాది మొత్తానికి వేతనాల నుంచి రికవరీ చేస్తే... మధ్యలోనే పదవీ విరమణ, ఇతర కారణాలతో వైదొలిగేవారు నష్టపోతారని ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో కార్మికులు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరితోనే గుర్తింపు యూనియన్ గడువు ముగిసినందున ఇప్పుడు వసూలు చేయాలనే నిర్ణయం అక్రమమేనని వారు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement