‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు? మర్యాద నేర్చుకోండి. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించుకోవాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊగిపోయారు.
సోలార్, కృష్ణపట్నంపై ఆరోపణలు నిరూపించాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు? మర్యాద నేర్చుకోండి. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించుకోవాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊగిపోయారు. ఆరోపణలు నిరూపించే వరకు సభ జరక్కూడదన్నారు. సోమవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. సీబీఐ విచారణ జరిపించాలన్న విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ను పక్కనబెట్టి అవినీతి ఆరోపణలపై ఆధారాలు చూపాలంటూ చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ‘కోరలు తీస్తా, రౌడీయిజాన్ని అణచివేస్తా’ వంటి పదాలతో విరుచుకుపడ్డారు. ‘జెన్‌కో, సోలార్‌పవర్, కృష్ణపట్నం, వీటీపీఎస్‌కు ఎక్కువ ఇచ్చామట.. ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేయవచ్చో కనిపెట్టిన కృష్ణప్రసాద్‌కు ఏదో అప్పనంగా కట్టబెట్టామంటున్నారు.
సోలార్, వీటీపీఎస్, కృష్ణపట్నంపై సవాల్ విసురుతున్నా.. వీళ్లు నిరూపిస్తారా? నిరూపించలేకుంటే వాళ్ల నాయకుని చేత ఈ హౌస్‌కు రానని చెప్పిస్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సోలార్, కృష్ణపట్నం ప్రాజెక్టులకు ఒప్పందాలే కుదరకపోతే రూ.7 వేల కోట్ల అవినీతి జరిగిందంటారా? పేపర్లలో రాసి కోర్టుల్లో కేసులు వేసి మమ్మల్ని నిరూపించుకోమంటారా?’ అని ప్రశ్నించారు. ‘ఏయ్, ఏంటది? మీ దివాళాకోరుతనం ఏంటీ? నేను సవాల్ చేస్తున్నా.. ధైర్యం, దమ్ము ఉంటే సోలార్, కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో అవినీతిపై ఆధారాలు చూపండి. మీది దోపిడీ పార్టీ, పనికిమాలిన పార్టీ. రౌడీయిజం చేస్తే సహించం. కోరలు తీస్తాం తప్ప వదిలే ప్రసక్తే లేదు..’ అంటూ గుడ్లురిమారు. (సభలో గందరగోళం) ఆ తర్వాత మళ్లీ ప్రసంగిస్తూ... ‘కృష్ణపట్నం, సోలార్‌పై అవినీతి ఆరోపణలను నిరూపించాలి. లేకుంటే వాళ్లపై చర్య తీసుకోవాలి. ఆ తర్వాతే సభ ముందుకు పోవాలి..’ అని అన్నారు. ‘మీ తండ్రి నాపైన 26 కేసులు పెట్టారు. 23 విచారణలు జరిపించారు. మీ తండ్రే ఏమీ చేయలేకపోయారు. ఇక నీ లాంటి వాళ్లు ఏమి చేస్తారు?’ అంటూ విపక్ష నేత జగన్‌పై చంద్రబాబు పరుషపదజాలంతో దూషణలకు దిగారు.