సీఎం ‘బ్రేక్’.. ఫాస్ట్‌తో బెదురుతున్న నేతలు..! | Sakshi
Sakshi News home page

సీఎం ‘బ్రేక్’.. ఫాస్ట్‌తో బెదురుతున్న నేతలు..!

Published Sun, Jun 7 2015 2:38 PM

సీఎం ‘బ్రేక్’.. ఫాస్ట్‌తో బెదురుతున్న నేతలు..! - Sakshi

ముఖ్యులు ఉదయాన్నే మా ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు రావాలని పిలిస్తే ఎవరైనా సంతోషిస్తారు. అందులోనూ సీఎం అంతటి వ్యక్తి పిలిస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు బ్రేక్ ఫాస్ట్ అంటే మాత్రం నేతలు ఏదో తిరకాసు ఉందని వెనుకడుగు వేస్తున్నారట. అలా హాజరైన వారికి పదవులు ఇవ్వకుండా బ్రేక్ వేయడానికే ఆయన బ్రేక్ ఫాస్ట్‌కు పిలుస్తారట. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

చూద్దామన్నందుకు... రోజూ స్వాతిముత్యం సినిమాలో ఉద్యోగం కోసం కమలహాసన్‌లా ప్రతి రోజూ ఏదో సందర్భంలో ఎక్కడో ఒకచోట కలిసి నమస్కారం పెట్టడం ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఆయన వ్యవహారం గమనించిన చంద్రబాబు పిలిచి రేపు మాయింటికి బ్రేక్ ఫాస్ట్‌కు రావాలని ఆహ్వానించారు. దాంతో తెగ సంతోషపడిన ఆ నేత తనకు ఎమ్మెల్సీ ఖరారైనట్టేనని మిత్రులు, సన్నిహితులందరికీ చెప్పుకున్నారు.

ఉదయాన్నే చెప్పిన టైమ్‌కన్నా అరగంట ముందే సీఎంగారి ఇంటికి చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత పిలుపు అందుకుని లోనికి వెళ్లారు. అల్పాహారం వడ్డింపులైన తర్వాత కుశల ప్రశ్నల పరంపర...! ఈలోగా తన పదవి అంటూ ఆ నేత గుర్తుచేయగా..! నీ గురించి నాకు తెలియదా..! నీ గురించి ఆలోచించేవారు నాకన్నా నీకెవరున్నారు...!! ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాగా...!

ఇప్పుడే ఎందుకు తొందర...: అని బ్రేక్ ఫాస్ట్ ముగించి మళ్లీ కలుద్దామన్నారట. అంతే...!!! టికెట్ లేదని చెప్పడానికి ఇంత తతంగమా...! బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ పదవి రాకుండా బ్రేక్ వేశారంటూ ఆ నేత బయటకు రాగానే ఎదురుపడిన నేతలకు చెప్పేసారు. ఆరోజు నుంచి నేతలెవరు కలిసినా బ్రేక్ ఫాస్ట్‌కు మాత్రం వెళ్లకండని చెబుతున్నారట.

Advertisement
 
Advertisement