
అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతాం : సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.
బంజారాహిల్స్ : హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇప్పటికే అత్యుత్తమ నివాసిత నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి అన్ని ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో సోమవారం రాత్రి బ్రది విశాల్ పన్నాలాల్ పిత్తి 88వ జయంతిని పురస్కరించుకొని 13వ స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 1969 ఉద్యమంతో పాటు 2001 ఉద్యమంలో చనిపోయిన వారి చరిత్రను ప్రతిబింబించేలా స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం స్థలాన్వేషణ చేస్తున్నట్లు తెలిపారు.
నగరాభివృద్ధి ప్రణాళికకు ఇప్పటికే కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేసుకున్నామని తద్వారా నగరంలో ఉన్న సమస్యలపై దృష్టిసారించి దాన్ని పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా బ్రది విశాల్ రూపొందించిన పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌రావు, సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు, శరత్ పిత్తి, అక్షయ్‌పిట్టి పాల్గొన్నారు.