ఎంవీఐపై చీటింగ్ కేసు | Cheating case AVI | Sakshi
Sakshi News home page

ఎంవీఐపై చీటింగ్ కేసు

Dec 12 2013 4:53 AM | Updated on Sep 2 2017 1:29 AM

రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

=కానిస్టేబుల్ ఉద్యోగాల ఎర..రూ.5 కోట్లు వసూలు
 =23 జిల్లాల్లోని 98 మంది హోంగార్డులకు టోకరా
 =హైదరాబాద్ సీసీఎస్‌లో బాధితుల ఫిర్యాదు

 
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిపై హైదరాబాద్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అతని వద్ద పనిచేస్తున్న మరో నలుగురు హోంగార్డులను సైతం నిందితులుగా చేర్చారు. ఆర్టీఏలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని అదే సంస్థలో పనిచేస్తున్న 98 మంది హోంగార్డులను నమ్మించి సుమారు రూ.5 కోట్లు వసూలు చేసి మోసగించారని ఎంవీఐపై ఆరోపణ. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన కొందరు హోంగార్డులు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భీంరావు అదే జిల్లాలో కత్తిపూడి చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం మోసానికి తెర లేపాడు. రవాణా శాఖలో 23 జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 98 మంది హోంగార్డులకు నేరుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు ప్రభుత్వ పెద్దలతో పరిచయం ఉందని నేరుగా ప్రత్యేక జీవోను విడుదల చేసి తద్వారా కానిస్టేబుల్‌గా పదోన్నతులు కల్పిస్తానని కూడా నమ్మించాడు. అందుకు ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టాడు. అతని వలలో పడ్డ అన్ని జిల్లాల హోంగార్డులు అధికారి అడిగిన దాంట్లో విడతల వారీగా ఒక్కొక్కరు రూ.4 లక్షల చొప్పున చెల్లించారు.

ఇక హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది హోంగార్డులు బెల్‌సన్ తాజ్ హోటల్‌లో భీంరావుకు ఒకసారి రూ.20 లక్షలు మరోసారి రాజమండ్రిలోని అతని గెస్ట్‌హౌస్‌లో అతని వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లకు మరో రూ.20 లక్షలు, భీంరావుకు  మూడు విడతలుగా రూ.12 లక్షలు ఇచ్చారు. ఇలా అన్ని జిల్లాల హోంగార్డుల నుంచి అతను సుమారు రూ.5 కోట్లు వసూలు చేశాడు. సంవత్సరాలు గడుస్తున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాకపోవడంతో ఒక్కో జిల్లా నుంచి హోంగార్డులు పలుమార్లు భీంరావుకు ఫోన్‌చేసి తమ బాధను వెళ్లబోసుకునేవారు. అయినా అతను రేపుమాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు.

అనుమానం వచ్చిన ఆయా జిల్లాల హోంగార్డులు రెండు నెలల నుంచి రాజమండ్రిలోని అతని నివాసానికి రావడం మొదలు పెట్టడంతో వారికి చిక్కకుండా తిరిగాడు. అతను విధులు నిర్వహిస్తున్న కత్తిపుడి చెక్‌పోస్టుకు వెళ్లితే అక్కడ కూడా కనిపించ లేదు. అతనికి ఫోన్ చేసి వేడుకుంటే తన ఇంటికి వస్తె ఎస్సీఎస్టీ కేసులు బుక్ చేయిస్తానని హోంగార్డులను బెదిరించాడు. దీంతో హోంగార్డులు అతని ఇంటికి వెళ్లడం మానేశారు. ఏం చేయాలో తెలియక తమలో తాము కుమిలిపోయారు.

అప్పుగా తెచ్చిన డబ్బుకు వస్తున్న హోంగార్డు జీతం మొత్తం మిత్తీలకు పోతున్నాయని బాధపడ్డ పలువురు హోంగార్డులు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు ఎంవీఐ భీంరావుతో పాటు అతనికి సహకరించిన హోంగార్డులు మస్తాన్‌రావు, కృష్ణ, సత్తిబాబు, రాజేష్‌లపై బుధవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement