చరిత్రకు ప్రతీక.. చౌమొహల్లా ప్యాలెస్ | Chaumohalla Palace is the symbol of history | Sakshi
Sakshi News home page

చరిత్రకు ప్రతీక.. చౌమొహల్లా ప్యాలెస్

Nov 20 2013 3:02 AM | Updated on Sep 2 2017 12:46 AM

రాచరికం పోయినా.. పాలించిన రాజులు చరిత్రలో మిగిలిపోయినా.. వారు కట్టించిన నిర్మాణాలు మాత్రం శాశ్వతంగా ఉన్నాయి.

 దారుషిఫా,న్యూస్‌లైన్:  రాచరికం పోయినా.. పాలించిన రాజులు చరిత్రలో మిగిలిపోయినా.. వారు కట్టించిన నిర్మాణాలు మాత్రం శాశ్వతంగా ఉన్నాయి. వాటిని వారసత్వంగా మనకు అందించిన దక్కన్ నవాబులు చిరస్థాయిగా నిలిచిపోయారు. కుతుబ్‌షాీహ లఅనంతరం దక్కన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న ఆసిఫ్‌జాహీల పాలనలో అద్భుతమైన కట్టడాలు జీవం పోసుకున్నాయి. వాటిలో ‘చౌమహల్లా ఖిల్వత్ ప్యాలెస్’ది ప్రత్యేకస్థానం. చార్మినార్‌కు సమీపంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన నాలుగు ప్యాలెస్‌ల సముదాయమే చౌముహల్లా ప్యాలెస్. సుమారు 2.90 లక్షల గజాల విశాల ప్రాంగణంలో  5వ నిజాం అఫ్జలుద్దౌలా బహదూర్ పాలనలో (1857-69)లో వీటిని వీటిని నిర్మించారని చర్రితకారుల అభిప్రాయం. ఇరాన్ దేశం టెహ్రాన్‌లోని ‘షా ప్యాలెస్’ కంటే ఎన్నో రెట్లు మిన్నగా నిజాం ప్రభువు ఈ ప్యాలెస్‌ను నిర్మించారు.
 
 1912 ప్రాంతంలో ఏడవ నిజాం చౌముహల్లా ప్యాలెస్‌కు మరమ్మతులు చేయించి ప్యాలెస్‌ను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు.  ప్యాలెస్ ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో పాలరాతి ఫౌంటెన్ కట్టిపడేస్తాయి. భవనంలోపల తలెత్తి చూస్తే సీలింగ్ ఆకాశాన్ని తాకుతుందా అన్న అనుభూతి కలుగుతుంది. లతలు, పూల అలంకరణతో 60 అడుగుల ఎత్తున గల ఆ సీలింగ్ నుంచి వేలాడే అతిపెద్ద బెల్జియం క్రిష్టల్ షాండ్లియార్ల అందాలు తప్పక చూడాల్సిందే. ఇవి నిజాంకు బహుమతిగా లభించాయని, మరికొన్ని 1799 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో నిజాంకు చెందాల్సిన వాటాగా టిప్సుల్తాన్ బహూకరించాడని చరిత్ర చెబుతోంది. ఆ రోజుల్లో విద్యుత్ సౌకర్యం లేకున్నా షాండ్లియార్లలో వెలుగు కోసం పొగరాని, మసి పట్టని కొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
 
  నిజాం ప్రభువు ఈ దర్బార్‌లోనే సందర్భకుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడంతోపాటు ఆస్థానానికి వచ్చే విదేవీ ప్రముఖులకు ఆహ్వానం, రిసెప్షన్ ఇచ్చేవారు.  శతాబ్ధాల చరిత్రగల ఈ ప్యాలెస్ ప్రస్తుతం నిజాం ట్రస్ట్ నిర్వహణలో ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు చౌమహల్లా ప్యాలెస్‌ను దర్శించే అవకాశం ఎవరికీ ఉండేది కాదు. కానీ నేడు సామాన్యులు సైతం రాజ భవనంలోకి వెళ్లే అవకాశం కలిగింది. దీనికి కొంత రుసుం చెల్లించాలి. పర్యాటకుల కోసం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రయమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం సెలవు దినం.

Advertisement
 
Advertisement
Advertisement