ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటల్లోగా దళితులకు క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఎస్సీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల్లోగా దళితులకు క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దళితులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు.
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ కమిషన్ ను పూర్తిస్థాయిలో నియమించలేదని తెలిపారు. బీసీ కమిషన్ కు ఇంతవరకు సభ్యులను నియమించలేదని, కనీసం కార్యాలయం కూడా లేదని అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అవసరమయితే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సూచించారు.