ఉగ్ర పడగ! | Caused outrage with terrorist arrested | Sakshi
Sakshi News home page

ఉగ్ర పడగ!

Jun 29 2016 11:04 PM | Updated on Sep 4 2017 3:43 AM

ఉగ్ర పడగ!

ఉగ్ర పడగ!

వారు చాపకింద నీరులా వ్యాపిస్తున్నారు.వారి టార్గెట్ యువత.

రోటీన్‌కు భిన్నంగా..!
ఉగ్రవాదుల అరెస్టుతో కలకలం
ఉలిక్కిపడిన నగరం
ఎన్‌ఐఏ చర్యలతో తప్పిన పెను ముప్పు

 

వారు చాపకింద నీరులా వ్యాపిస్తున్నారు.వారి టార్గెట్ యువత.. వ్యక్తిగతంగా కలవరు. కనీసం ఫోన్ కూడా చేయరు. అంతా ఆన్‌లైన్‌లోనే. సామాజిక మాద్యమాలే వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భాగ్యనగరంలోవిషవృక్షంలా విస్తరిస్తోంది. ఇక్కడి యువతకు గాలం వేసిఆకర్షితులైన వారికి ఉగ్ర పాఠాలు బోధిస్తోంది.ఏడాదిన్నర కాలంలో 9 మంది పోలీసులకు చిక్కడ. సంచలనమైతే.. తాజాగా బుధవారం పాతబస్తీలో 11 మంది ఎన్‌ఐఏకు పట్టుబడ్డారు. వీరంతా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న ‘ఏయూటీ’ మాడ్యుల్‌కు చెందిన వారు.ఈ వార్తతో నగరం ఉలిక్కిపడింది. అసలు ఐసిస్ రిక్రూట్‌మెంట్ విధానం ఏమిటి..? యవతను ఎలా రెచ్చగొడుతోంది..? దేశం దాటేందుకు ఎలా సహకరిస్తోంది..? నగరంలో ఐసిస్ జాడలు, గత సంఘటనలపై ‘సాక్షి’ ఫోకస్.  -సాక్షి, సిటీబ్యూరో


నగరం ఉలిక్కిపడింది. ‘ఉగ్ర’జాడలు బయట పడడంతో అవాక్కైంది. ముష్కరుల కుట్రల్ని ముందే గుర్తించారు కాబట్టి సరిపోయింది...లేకుంటే..?? ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పాటైన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) నగరంలో విధ్వసాలకు పన్నిన మరో కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఛేదించింది. బుధవారం తెల్లవారుజామున పాతబస్తీలోని వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరి నుంచి ఆయుధాలు, నగదు, బాంబుల తయారీకి వినియోగించే ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలో కలకలం రేగింది. గతానుభవాల నేపథ్యంలో ప్రజల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఎన్‌ఐఏ ముందే మేల్కొనకపోతే మరో విధ్వంసంతో నగరం కకావికలమయ్యేదనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

 

సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్‌మెంట్ తేలికైపోయినా.. విధ్వం సాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. హైదరాబాద్‌లో చిక్కిన ఏయూటీ మాడ్యుల్ మాత్రం ఈ వ్యవహారంలోనూ తెలివిగా వ్యవహరించింది. రోటీన్‌కు భిన్నంగా సాంప్రదాయేతర ‘విధ్వంస’వనరులపై దృష్టి పెట్టింది. పోలీసు, నిఘా వర్గాలకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా ప్రణాళికలు రచించింది. 11 మంది ముష్కరుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో నాటు తుపాకులతో పాటు సాధారణ పదార్థాలుగా పరిగణించే యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాస్ఫరస్, పెయింట్స్ వంటివి ఉండటం గమనార్హం.  పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కరులు దేశంలో చేసిన బాంబు పేలుళ్లకు ఎక్కువగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని వినియోగించేవారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల మొదలు అనేక ఘటనల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విధ్వంసాలకు ఆర్డీఎక్స్ నేరుగా పాకిస్థాన్ నుంచే సరఫరా అయ్యేది. ఇది ముప్పని భావించిన ఆ దేశం దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దగ్గరకు వచ్చేసరికి పరోక్షంగా సహకరిస్తున్న పాక్ నిఘా సంస్థ పేలుడు పదార్థాల సేకరణ స్థానికంగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఈ మాడ్యుల్ ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించారు. సిటీలో జరిగిన 2007, 2013 జంట పేలుళ్లలో ఐఎం ఉగ్రవాదులు దీన్నే వాడారు. తాజాగా చిక్కిన ఏయూటీ మాడ్యుల్ పేలుడు పదార్థాల సమీకరణలో మరో అడుగు ముందుకు వేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకోవడానికి ప్రయత్నించినా నిఘాకు చిక్కే ప్రమాదం ఉందనే అనుమానంతో సాధారణ వస్తువులపై దృష్టిపెట్టింది.


ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా సాధారణ పదార్థాలనే పేలుడు పదార్థాలుగా వినియోగించే అంశంపై సుదీర్ఘ అధ్యయనమే చేసింది. ఈ మాడ్యుల్‌లో ఉన్న విద్యాధికులు ఇంటర్‌నెట్‌లో చేసిన పరిశీలన తరవాత యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్పరస్‌లను బాంబుల తయారీకి ఎంచుకున్నారు. అగ్గిపుల్లలకు తలగా ఉండేదీ ఫాస్పరస్ కావడంతో పాటు దీపావళి సామాను తయారీకి వినియోగించే, రైతులు వాడే ఇవి మార్కెట్‌లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నారు. వీటితో తయారు చేసిన ఐఈటీ బాంబులు పేలినప్పుడు స్ల్పింటర్స్‌గా దూసుకుపోయి టార్గెట్‌ను ఛిద్రం చేయడం కోసం ఆ బాంబుల్లో మేకులు వేయడానికి ఏయూటీ మాడ్యుల్ సిద్ధమైంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement