
ముగ్గురు నిందితుల అరెస్ట్.. వెంటనే బెయిల్
అసలు నిందితుడిని వదిలేసిన వైనం
శిథిలాలు పోలీసు స్టేషన్‌కు తరలింపు
తూతూ మంత్రపు చర్యలతో ప్రజలను బురిడీ కొట్టించే యత్నం
ప్రభుత్వ తీరుపై హిందూ సంఘాల మండిపాటు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసంపై హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామిరెడ్డి, మణిరెడ్డి, హేమాద్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ముగ్గురినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్ రెడ్డిపై కేసు నమోదు చేయక పోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి, నామమాత్రపు సెక్షన్లతో కేసు పెట్టడం వల్లే ముగ్గురి ఇలా అరెస్ట్ చేయడం.. అలా బెయిల్ మంజూరు చేసి పంపడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకోకపోయినా.. తీసుకున్నట్లు కనిపించాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వచి్చనట్లు సమాచారం. అందువల్లే తూతూ మంత్రపు చర్యలతో పోలీసులు ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘నన్నెవరూ ఏమీ చేయలేరు. నాని అన్న మంత్రి లోకేశ్‌తో మాట్లాడాడు. వాళ్లేం చేస్తారో చేసుకోని.. మనం చేసేది చేద్దాం’ అని ఆలయం కూల్చివేతలో కీలక నిందితుడు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.
కాగా, ఈ ఘటనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆలయాన్ని నేలమట్టం చేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం ఎస్‌ఐ జగన్నాథరెడ్డి పరిశీలించారు. కూటమి నాయకుల దాడిలో శిథిలమైన విగ్రహాలు, ఉత్సవమూర్తులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ఫణిరాజశయన ఆలయ ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించి, ఆలయ ఉపచారకులు శ్రీమహారుద్ర వారాహి స్వామిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
కాగా, విజయవాడకు చెందిన జై భారత్ హిందూ సంఘానికి చెందిన సభ్యులు ఘటనా స్థలి వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటనలో నిందితులకు వెంటనే బెయిల్ మంజూరు కావడంపై హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
పాకిస్తాన్‌లో ఉన్నామా?
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హిందువులపై ఎందుకు ఇంత విద్వేషమని హిందూ సంఘ ప్రతినిధి చీనేపల్లి కిరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్‌లోనే ఉన్నామా.. లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అని అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే నాని అనుచరుడు కిషోర్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించక పోవడం శోచనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందించక పోవడం పట్ల హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెడితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదని స్పష్టం చేశారు.