‘ఇంక్విలాబ్ మంచ్’ నేత
షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య
కాల్పుల్లో గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి
బంగ్లాదేశ్‌వ్యాప్తంగా మిన్నంటిన ఆగ్రహ జ్వాలలు
ఢాకా/న్యూఢిల్లీ: పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. ‘ఇంక్విలాబ్ మంచ్’ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యాకాండ అగ్గి రాజేసింది. ఈ హత్య పట్ల ఆగ్రహానికి గురైన జనం వీధుల్లోకి వచ్చారు. విధ్వంసం సృష్టించారు. పత్రికా కార్యలయాలపైనా విరుచుకుపడ్డారు. గురువారం రాత్రంతా హింసాకాండ కొనసాగింది. అసిస్టెంట్ ఇండియన్ హైకమిషన్ కమిషనర్ నివాసంపై రాళ్లు రువ్వారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రెహా్మన్ నివాసాన్ని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని అల్లరిమూకలు దాడి చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో దీపూచంద్ర దాస్(25) అనే కారి్మకుడు మరణించాడు.
ఆటోలో వెళ్తుండగా హదీపై కాల్పులు
షరీఫ్ ఉస్మాన్ హదీ గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా వ్యతిరేక రాడికల్ లీడర్‌గా యువతలో గుర్తింపు పొందాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో ఢాకా–8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు.
ఈ నెల 12వ తేదీన సెంట్రల్ ఢాకాలోని విజోయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారానికి ఆటోలో వెళ్తున్న హదీపై ముసుగులు ధరించి బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలే అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. సరిగ్గా తలపై కాల్చడంతో కుప్పకూలిపోయాడు. ఒక చెవిలోకి దూసుకెళ్లిన తూటా మరో చెవి నుంచి బయటకు వచి్చంది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్‌కు తరలించారు.
ఆరు రోజుపాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఆరోగ్యం విషమించి గురువారం మృతిచెందాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ ఈ విషయాన్ని స్వయంగా టీవీలో ప్రకటించారు. దాంతో జనంలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హదీ మరణాన్ని జీరి్ణంచుకోలేక వీధుల్లో విధ్వంసానికి దిగారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. రాజ్‌షాహీ సిటీలో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. నిరసనకారుల ముసుగులో అల్లరిమూకలు రెచ్చపోయాయి. గురువారం రాత్రంతా దాడులు జరిగాయి. రాజధాని ఢాకాలో నిరసనకారులు ఛాయానత్ అనే సాంస్కృతిక సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఫరి్నచర్‌ను బయటపడేసి నిప్పుపెట్టారు. బంగ్లా పత్రికలు ప్రొథోమ్ అలో, డెయిలీ స్టార్ కార్యాయాలపైనా దాడులు జరిగాయి.
భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు..
హదీని హత్య చేసిన దుండుగులు భారత్‌కు పారిపోయారని ఆరోపిస్తూ నేషనల్ సిటిజెన్ పారీ్ట(ఎన్సీపీ) నేతలు, కార్యకర్తలు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దుండగులను వెనక్కి తీసుకొచ్చేదాకా భారత హైకమిషన్‌ను మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సంయమనం పాటించాలని యూనస్ వినతి
హింసాకాండ పట్ల మొహమ్మద్ యూనిస్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంయమనం పాటించాలని, దాడులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. హదీని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హంతకులపై దయ చూపించే ప్రసక్తే లేదన్నారు. శనివారం సంతాపం దినంగా పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల వాయిదా తప్పదా?
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఇంతలోనే షరీఫ్ ఉస్మాన్ హత్య జరగడం, విధ్వంసం ప్రారంభం కావడంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
రిజర్వేషన్లతో మొదలైన రగడ
→ ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా(రిజర్వేషన్లు) వ్యవస్థను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రారంభించిన పోరాటం చివరకు ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవడానికి దారితీసింది.
→ 1971 నాటి బంగ్లా విమోచన ఉద్యమం పాల్గొన్నవారి వారసులకు ఉద్యోగాల్లో ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడాన్ని విద్యార్థులు తప్పుపట్టారు. రిజర్వేషన్ల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ 2024 జూలైలో ఆందోళన ప్రారంభించారు. ఇది ‘జూలై తిరుగుబాటు’గా పేరుగాంచింది.
→ షేక్ హసీనా తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆందోళనకారులు పోరాటం ఉధృతం చేశారు. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మైనారీ్టలపై విచ్చలవిడిగా దాడులు జరిగా యి.
→ చేసేది లేక షేక్ హసీనా అప్పటికప్పుడే దేశం విడి చిపెట్టి వెళ్లిపోవాల్సి వచి్చంది. భారత ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కలి్పంచింది.
→ నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టారు.
→ షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
→ మరోవైపు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని, 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని మొహమ్మద్ యూనస్ ప్రకటించారు.
→ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు గురి కావడం సంచలనాత్మకంగా మారింది.
దీపూచంద్ర దాస్‌ను కొట్టి చంపారు
బంగ్లాదేశ్‌లపై మైనారీ్టలైన హిందువులపై దాడులు మళ్లీ మొదలయ్యాయి. 25 ఏళ్ల దీపూచంద్ర దాస్‌ను గురువారం రాత్రి దారుణంగా కొట్టి చెట్టుకి కట్టి ఊరి తీశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దీపూచంద్ర దాస్ మైమెన్‌సింగ్ సిటీలో ఓ ఫ్యాక్టరీలో కారి్మకుడిగా పని చేస్తున్నాడు. దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అల్లరిమూక అతడిని హత్య చేసినట్లు బంగ్లా ట్రిబ్యూన్ పత్రిక వెల్లడించింది. దీపూచంద్ర హత్యను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. అతడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కచి్చతంగా శిక్షిస్తామని పేర్కొంది.
బంగ్లాదేశ్‌ను గడగడలాడిస్తా..
షరీఫ్ ఉస్మాన్ హదీపై కాల్పులు జరిపిన దుండుగుల్లో ఫైజల్ కరీంను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పక్కాప్రణాళికతోనే హదీని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ హత్య తర్వాత దేశమంతటా తీవ్రస్థాయిలో అలజడి రేగుతుందని అతడు ముందే ఊహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న హదీపై కాల్పులు జరగ్గా, అంతకుముందు రాత్రి ఢాకా శివార్లలోని ఓ రిసార్ట్‌లో ఫైజల్ కరీం తన గర్ల్‌ఫ్రెండ్ మరియా అఖ్తర్ లీమాతో ఉన్నాడు. బంగ్లాదేశ్‌ను వణికించే పెద్ద సంఘటన జరగబోతోందని ఆమెతో చెప్పాడు. దేశాన్ని గడగడలాడించబోతున్నానని పేర్కొన్నాడు. మరుసటి రోజే మరో ఇద్దరితోపాటు కలిసి హదీపై కాల్పులు జరిపాడు.


