breaking news
International terror organization Islamic State
-
ఆర్మర్ ‘చావు’ తెలివి!
సిరియా కేంద్రంగా ‘కథ’ నడుపుతున్న షఫీ పలుమార్లు చనిపోయినట్లు వదంతులు సృష్టి నిఘా వర్గాల దృష్టి మళ్లించేందుకే: అధికారులు సిటీబ్యూరో: అగ్రరాజ్యంగా భావించే అమెరికాను సైతం గడగడలాడిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పాటైందే అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ). దీనికి నేతృత్వం వహిస్తున్న షఫీ ఆర్మర్ ఇప్పటికే పలుమార్లు ‘చావు’ తెలివి వినియోగించాడు. బుధవారం పాతబస్తీలో చిక్కిన 11 మంది ఈ మాడ్యుల్‌కు చెందిన, ఆర్మర్ ఆదేశాల మేరకు పని చేస్తున్న వారే. సిరియా కేంద్రంగా వ్యవహారాలు నడిపిస్తున్న షఫీ ఆర్మర్ అక్కడ అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో తాను చనిపోయినట్లు వదంతులు వ్యాపించజేశాడు. నిఘా వర్గాల దృష్టి మళ్లించడానికే ఈ పంథా అనుసరించినట్లు అధికారులు చెప్తున్నారు. కర్ణాకటలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ ఆర్మర్ భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం తన అన్న సుల్తాన్ ఆర్మర్‌తో కలిసి దేశం దాటేశాడు. ఐఎస్‌కు అనుబంధంగా ‘అన్సార్ ఉల్ తౌహిద్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. సిరియాలో అమెరికా సేనలు చేసిన దాడుల్లో సుల్తాన్ చనిపోగా... షఫీ మాత్రం భారత్ టార్గెట్‌గా ఐఎస్‌ను విస్తరించే పనిలో పడ్డాడు. దీనికోసమే స్థానికంగా ఉన్న వారిని ఆకర్షిస్తూ విధ్వంసాలు సృష్టించడానికి జనవరిలో ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థను ఏర్పాటు చేయించాడు. తాజాగా ఏయూటీ ఆధ్వర్యంలోనే 11 మందితో మాడ్యుల్ తయారు చేశాడు. ఐఎస్ నుంచి వచ్చిన నిధులతో పాటు వివిధ మార్గాల్లో నగదు సమీకరిస్తూ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం కోసం హవాలా తదితర మార్గాల్లో ఇక్కడ ఎంపిక చేసుకున్న వాళ్లకు పంపిస్తున్నాడు. వివిధ రకాలైన పేర్లతో ఇంటర్నెట్ కేంద్రంగా యువతను ఆకర్షిస్తున్న షఫీ వయసు ప్రస్తుతం 29 ఏళ్లే అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. కొంతకాలం ఆఫ్ఘనిస్థాన్ కేంద్రంగా అల్ కాయిదాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న షఫీ... 2014 జూన్ నుంచి సిరియాలో మకాం పెట్టి కార్యకలాపాలను సాగిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాయి. ‘జునూద్’ మాడ్యుల్ అరెస్టు తర్వాత భారత నిఘా వర్గాలు ఆర్మర్పై సాంకేతిక నిఘా పెట్టాయి. దీన్ని తప్పించుకోవడంతో పాటు వారి దృష్టి మళ్లించడానికీ తాను చనిపోయినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా రెండుమూడు సార్లు ప్రచారం చేశాడు. ప్రతి సందర్భంలోనూ సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లోనే తన మరణం సంభవించినట్లు ప్రచారం చేసుకున్నాడు. ఈ వల్లోపడని నిఘా వర్గాలు తమ పని కొనసాగించడంతో తాజాగా ఏయూటీకి చెందిన 11 మంది హైదరాబాదీలు చిక్కారు. పేర్లు మార్చి... ఏమార్చి... భారత్‌ను టార్గెట్‌గా చేసుకుని సుదీర్ఘకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్న షఫీ ఆర్మర్... ఏ సందర్భంలోనూ తన ‘నిజ స్వరూపాన్ని’ బయటపెట్ట లేదు. ఒక్కో మాడ్యుల్‌ను సంప్రదించేప్పుడు ఒక్కో పేరు వాడినట్లు అధికారులు చెప్తున్నారు. ⇒దేశ వ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షఫీ ఆర్మర్ పేరు ఉంది. ఇతడిపై ఇం టర్పోల్ రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ చేసింది. ⇒2013లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తుల్ని ఐఎస్ వైపు నడిపించడానికి మహ్మద్ అట్టా పేరుతో సంప్రదింపులు జరిపాడు. ⇒2014లో హైదరాబాద్‌కు చెందిన బాసిత్, మాజ్ హుస్సేన్‌లతో పాటు మరో ఇద్దరినీ ఐఎస్ వైపు ఆకర్షించడానికి సమీర్ ఖాన్‌గా మారాడు. ⇒2015లో మధ్యప్రదేశ్‌లోని రత్లంలో ఏర్పాటు చేసుకున్న మాడ్యుల్‌కు యూసుఫ్‌గా పరిచయమయ్యాడు. ⇒ఈ ఏడాది చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్లోని సభ్యులతో యూసుఫ్ అల్ హింద్‌గా కథ నడిపాడు. ⇒తాజాగా హైదరాబాద్‌లో పట్టుబడిన 11 మందిని ఏ పేరుతో సంప్రదించాడనే అంశంపై ఎన్ఐఏ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. -
ఉగ్ర పడగ!
రోటీన్‌కు భిన్నంగా..! ఉగ్రవాదుల అరెస్టుతో కలకలం ఉలిక్కిపడిన నగరం ఎన్ఐఏ చర్యలతో తప్పిన పెను ముప్పు వారు చాపకింద నీరులా వ్యాపిస్తున్నారు.వారి టార్గెట్ యువత.. వ్యక్తిగతంగా కలవరు. కనీసం ఫోన్ కూడా చేయరు. అంతా ఆన్లైన్లోనే. సామాజిక మాద్యమాలే వేదికగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భాగ్యనగరంలోవిషవృక్షంలా విస్తరిస్తోంది. ఇక్కడి యువతకు గాలం వేసిఆకర్షితులైన వారికి ఉగ్ర పాఠాలు బోధిస్తోంది.ఏడాదిన్నర కాలంలో 9 మంది పోలీసులకు చిక్కడ. సంచలనమైతే.. తాజాగా బుధవారం పాతబస్తీలో 11 మంది ఎన్ఐఏకు పట్టుబడ్డారు. వీరంతా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న ‘ఏయూటీ’ మాడ్యుల్‌కు చెందిన వారు.ఈ వార్తతో నగరం ఉలిక్కిపడింది. అసలు ఐసిస్ రిక్రూట్మెంట్ విధానం ఏమిటి..? యవతను ఎలా రెచ్చగొడుతోంది..? దేశం దాటేందుకు ఎలా సహకరిస్తోంది..? నగరంలో ఐసిస్ జాడలు, గత సంఘటనలపై ‘సాక్షి’ ఫోకస్. -సాక్షి, సిటీబ్యూరో నగరం ఉలిక్కిపడింది. ‘ఉగ్ర’జాడలు బయట పడడంతో అవాక్కైంది. ముష్కరుల కుట్రల్ని ముందే గుర్తించారు కాబట్టి సరిపోయింది...లేకుంటే..?? ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పాటైన అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ) నగరంలో విధ్వసాలకు పన్నిన మరో కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛేదించింది. బుధవారం తెల్లవారుజామున పాతబస్తీలోని వేర్వేరు ప్రాంతాల్లో 11 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరి నుంచి ఆయుధాలు, నగదు, బాంబుల తయారీకి వినియోగించే ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నగరంలో కలకలం రేగింది. గతానుభవాల నేపథ్యంలో ప్రజల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఎన్ఐఏ ముందే మేల్కొనకపోతే మరో విధ్వంసంతో నగరం కకావికలమయ్యేదనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ తేలికైపోయినా.. విధ్వం సాలకు అవసరమైన పేలుడు పదార్థాల సేకరణ సవాల్‌గా మారింది. హైదరాబాద్‌లో చిక్కిన ఏయూటీ మాడ్యుల్ మాత్రం ఈ వ్యవహారంలోనూ తెలివిగా వ్యవహరించింది. రోటీన్‌కు భిన్నంగా సాంప్రదాయేతర ‘విధ్వంస’వనరులపై దృష్టి పెట్టింది. పోలీసు, నిఘా వర్గాలకు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా ప్రణాళికలు రచించింది. 11 మంది ముష్కరుల నుంచి ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో నాటు తుపాకులతో పాటు సాధారణ పదార్థాలుగా పరిగణించే యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, పాస్ఫరస్, పెయింట్స్ వంటివి ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కరులు దేశంలో చేసిన బాంబు పేలుళ్లకు ఎక్కువగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని వినియోగించేవారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల మొదలు అనేక ఘటనల్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విధ్వంసాలకు ఆర్డీఎక్స్ నేరుగా పాకిస్థాన్ నుంచే సరఫరా అయ్యేది. ఇది ముప్పని భావించిన ఆ దేశం దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) దగ్గరకు వచ్చేసరికి పరోక్షంగా సహకరిస్తున్న పాక్ నిఘా సంస్థ పేలుడు పదార్థాల సేకరణ స్థానికంగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఈ మాడ్యుల్ ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించారు. సిటీలో జరిగిన 2007, 2013 జంట పేలుళ్లలో ఐఎం ఉగ్రవాదులు దీన్నే వాడారు. తాజాగా చిక్కిన ఏయూటీ మాడ్యుల్ పేలుడు పదార్థాల సమీకరణలో మరో అడుగు ముందుకు వేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సమీకరించుకోవడానికి ప్రయత్నించినా నిఘాకు చిక్కే ప్రమాదం ఉందనే అనుమానంతో సాధారణ వస్తువులపై దృష్టిపెట్టింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా సాధారణ పదార్థాలనే పేలుడు పదార్థాలుగా వినియోగించే అంశంపై సుదీర్ఘ అధ్యయనమే చేసింది. ఈ మాడ్యుల్లో ఉన్న విద్యాధికులు ఇంటర్నెట్లో చేసిన పరిశీలన తరవాత యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫాస్పరస్‌లను బాంబుల తయారీకి ఎంచుకున్నారు. అగ్గిపుల్లలకు తలగా ఉండేదీ ఫాస్పరస్ కావడంతో పాటు దీపావళి సామాను తయారీకి వినియోగించే, రైతులు వాడే ఇవి మార్కెట్లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నారు. వీటితో తయారు చేసిన ఐఈటీ బాంబులు పేలినప్పుడు స్ల్పింటర్స్‌గా దూసుకుపోయి టార్గెట్‌ను ఛిద్రం చేయడం కోసం ఆ బాంబుల్లో మేకులు వేయడానికి ఏయూటీ మాడ్యుల్ సిద్ధమైంది.