సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌కు తేడా లేదు | BJP Lakshman comments on TRS government | Sakshi
Sakshi News home page

సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌కు తేడా లేదు

Aug 28 2017 3:09 AM | Updated on Sep 17 2017 6:01 PM

సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌కు తేడా లేదు

సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌కు తేడా లేదు

సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌ పాలకులకు తేడా ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

సెప్టెంబర్‌ 17ను ఘనంగా నిర్వహిస్తాం: లక్ష్మణ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌ పాలకులకు తేడా ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ‘నైజాం సర్కారోడ‘సినిమా బృందానికి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ, నైజాం ఏలుబడిలో మహిళలు, రైతులపై జరిగిన అరాచకాలు వెలుగులోకి రాకుండా పోయాయన్నారు. మహిళలపై జరిగిన అకృత్యాలు అన్నీ, ఇన్నీ కావన్నారు. భారతదేశానికి1947 ఆగస్టులోనే స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, అప్పటికీ నిజాం ఉక్కు పిడికిలిలోనే తెలంగాణ నలిగిపోయిందని అన్నారు.

దేశం నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ను స్వతంత్ర ముస్లిం రాజ్యంగానో, పాకిస్తాన్‌లో కలిపేయడానికో నైజాం రాజు సిద్ధమైనాడన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చాలామంది ఉద్యమకారులు ప్రాణాలను ఒడ్డి పోరాటం చేశారని వివరించారు. భారతదేశంలోనే విలీనం కావాలంటూ పోరాడిన షోయబుల్లాఖాన్, బందగీ, తుర్రెబాజ్‌ఖాన్‌ వంటి ముస్లింనేతలను కూడా నిజాం దారుణంగా చంపించాడని లక్ష్మణ్‌ చెప్పారు. భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేపట్టిన సైనికచర్యతో హైదరాబాద్‌ స్టేట్‌ కూడా 1948 సెప్టెంబర్‌ 17న భారతదేశంలో విలీనమైందని వివరించారు.

నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్‌ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దీనిని అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోకుండా అప్పటి సమైక్యపాలకులు కుట్రలు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా వేడుకలు నిర్వహించుకుంటామని ఎన్నోసార్లు చెప్పిన అప్పటి ఉద్యమనేత కేసీఆర్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రజాకార్లు ఏర్పాటు చేసిన మజ్లిస్‌ చేతిలో పావుగా మారారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు, సమైక్య పాలకులకు ఈ విషయంలో తేడా లేదన్నారు. మూడేళ్లుగా దీనికోసం పోరాటం చేస్తున్నామని, ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న తామే ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, నైజాం సర్కారోడ సినిమా నిర్మాత రాజమౌళి, చిత్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement