సహోరే బాహుబలి | Bahubali Mania in the two telugu states | Sakshi
Sakshi News home page

సహోరే బాహుబలి

Apr 28 2017 1:51 AM | Updated on Aug 11 2018 6:09 PM

సహోరే బాహుబలి - Sakshi

సహోరే బాహుబలి

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. ప్రస్తుతం అందరూ ఇదే పేరు స్మరిస్తున్నారు.

ఇరు రాష్ట్రాల్లో బాహుబలి మేనియా..
- థియేటర్ల ముందు చాంతాడులా లైన్లు
- ఆన్‌లైన్లో 5 రోజుల వరకూ టికెట్లు నిల్‌..


హైదరాబాద్‌: బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. ప్రస్తుతం అందరూ ఇదే పేరు స్మరిస్తున్నారు. బాహుబలి మేనియాతో యావత్‌ దేశం ఊగిపోతోంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ మినహాయింపు కాదు. ఒక్క చాన్స్‌ అన్నట్టుగా.. ఒకే ఒక్క టికెట్‌ అంటూ ఇప్పుడు యువత థియేటర్ల ముందు వెంపర్లాడుతోంది. స్నేహితులు.. తెలిసిన వారు కలిస్తే ఇప్పుడు వినిపిస్తున్న మాట.. ‘‘బాహుబలి టికెట్‌ దొరికిందా..!’’ అనే.. ఈ ఒక్క ఉదాహరణ చాలు బాహుబలి ది కన్‌క్లూజన్‌ సినిమా పై హైప్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. శుక్రవారం ఏకంగా 8 వేల థియేటర్లలో విడుదలవుతోంది.

ఇన్ని థియేటర్లలో విడుదలవుతున్నా.. బాహుబలి టికెట్‌ దొరకడం గగనమైపోతోంది. చిన్నా చితకా థియేటర్లలోనే కాదు.. బడా మల్టీప్లెక్సుల్లోనూ ఇదే పరిస్థితి. శుక్రవారం సినిమా విడుదల అవుతుండగా.. గురువారం తెల్లవారుజాము నుంచే ఆయా థియేటర్ల వద్ద అభిమానులు క్యూ కట్టారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పంజగుట్ట పీవీఆర్‌ సినిమాస్, బంజారాహిల్స్‌లోని ఐనాక్స్, సినీమ్యాక్స్‌ పీవీఆర్‌ సినిమాస్, ఐమాక్స్‌లోనూ టికెట్ల కోసం వేలాది మంది క్యూ కట్టారు. ఒక్క టికెట్‌ సాధించడానికి ఎనిమిది గంటల పాటు లైన్‌లో నిల్చున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మరికొందరు ఆన్‌లైన్‌లో టికెట్‌ తీసుకుందామని ట్రై చేస్తున్నా.. సర్వర్లు మొరాయిస్తున్నాయి. నెట్‌లో ఉన్న ఆ కొన్ని టికెట్లు కూడా ఐదు ఆరు రోజుల వరకూ బుక్‌ అయిపోయాయి. అయినా సరే టికెట్లు దక్కించుకునేందుకు చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు విశాఖ, విజయవాడ ఇలా అన్నిచోట్లా ఇదే పరిస్థితి. గురువారం రాత్రి పలు పట్టణాల్లో బెనిఫిట్‌ షోలు వేశారు. టికెట్‌ రూ.800 నుంచి 1500 వరకూ విక్రయించారు. ఏపీలోని పలు చోట్ల అభిమానులను అదుపు చేయడానికి స్వల్పంగా లాఠీచార్జి చేశారు.

జోరందుకున్న ‘బ్లాక్‌’
ఆన్‌లైన్‌ మూవీ టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత బ్లాక్‌లో టికెట్లు అమ్మే పరిస్థితి తగ్గిపోయింది. కానీ   బాహుబలితో మళ్లీ బ్లాక్‌ టికెట్ల అమ్మకం జోరందు కుంది. పైరవీలు, పలుకుబడి ఇలా ఏదోలా టికెట్లను చేజిక్కించుకోవడం.. వాటిని స్పెషల్‌ టికెట్లు.. కాంబో ఆఫర్లు అంటూ అంటగట్టడం నయా ట్రెండ్‌. బాహుబలి టికెట్‌ కోసం డిమాండ్‌ తారస్థాయికి చేరింది. చివరకు థియేటర్‌ యాజమాన్యాలు సైతం చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

శుక్రవారం సినిమా విడుదల కానుండగా ఆదివారం వరకు హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. మరోవైపు నెల రోజులుగా బోసిపోయిన థియేటర్లకు బాహుబలి రాకతో కొత్త కళ వచ్చింది. బాహుబలి పుణ్యమా అని థియేటర్ల మీదకు జనం ఎగబతున్నారు. కాగా. మోసపూరిత ప్రకటనలతో జనంలో ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి విమర్శించారు. ‘రూ.800 నుంచి వెయ్యి వరకూ టికెట్లు అమ్ముతున్నారు. ఈ ధోరణి పెరిగితే.. ఇక ధియేటర్లకు జనం రారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement