శిలాయుగపు వలసల గుట్టు తేల్చేస్తాం! | Archaeological Survey excavations in the district to prepare for SIDDIPET | Sakshi
Sakshi News home page

శిలాయుగపు వలసల గుట్టు తేల్చేస్తాం!

Feb 19 2017 12:45 AM | Updated on Aug 20 2018 9:26 PM

శిలాయుగపు వలసల గుట్టు తేల్చేస్తాం! - Sakshi

శిలాయుగపు వలసల గుట్టు తేల్చేస్తాం!

ఒక చోట నుంచి మరో చోటికి వలస వెళ్లడం సాధారణమే.

సిద్దిపేట జిల్లాలో తవ్వకాలకు పురావస్తు శాఖ సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: ఒక చోట నుంచి మరో చోటికి వలస వెళ్లడం సాధారణమే. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి అప్పటి మానవులు వలసలు రావడం విశేషమే. ఇప్పటి ఇరాన్, ఇరాక్, పాలస్తీనా తదితర ప్రాంతాలకు చెందినవారు దాదాపు రెండున్నర వేల ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో మనుగడ సాగించినట్లుగా ఇటీవల ప్రాథమిక ఆధారాలు వెలుగుచూశాయి. అసలు అక్కడివారు ఇక్కడికి ఎందుకొచ్చారు, ఎలా వచ్చారు, తర్వాత ఏమయ్యారు.. ఇలా ఎన్నో అంతుచిక్కని సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఇప్పుడా గుట్టు తేల్చే అధ్యయనం మొదలవుతోంది.

బృహత్‌ శిలాయుగపు ఆనవాళ్లు, వలసల వెనుక విశేషాలను తేల్చేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ప్రఖ్యాత సంస్థలైన సెంటర్‌ ఫర్‌ సెల్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), పుణేలోని డెక్కన్‌ కాలేజీ ఫర్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులతో కలసి తవ్వకాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట, పాలమాకుల ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించనుంది.

రెండేళ్ల కిందటి తవ్వకాలతో..
పురావస్తు శాఖ రెండేళ్ల కింద సిద్దిపేట సమీపంలోని పుల్లూరులో బృహత్‌ శిలాయుగపు సమాధుల్లో తవ్వకాలు జరిపి మానవుల అవశేషాలను గుర్తించింది. అప్పట్లో వారు వాడిన వస్తువులు, పరికరాలు, ఆయుధాలను కూడా గుర్తించింది. సమాధిలో లభించిన మానవ అవశేషాలను సీసీఎంబీలో పరీక్షించారు. అయితే వాటిల్లోని డీఎన్‌ఏ తెలంగాణ స్థానికుల డీఎన్‌ఏతో సరిపోలలేదు. దాంతో వారు మరో ప్రాంతం నుంచి వలస వచ్చి ఉంటారని గుర్తించి పరిశోధన చేయగా... మధ్య ఆసియా దేశవాసుల డీఎన్‌ఏతో సరిపోలింది.

ఈ నేపథ్యంలో ఆ మానవ సమూహం ఈ ప్రాంతానికి వలస వచ్చి, తిరిగి ఎక్కడికో వెళ్లిపోయిందని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం మరిన్ని సమాధుల్లో తవ్వకాలు జరిపి పరీక్షలు నిర్వహించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. అయితే సాధారణ పద్ధతిలో తవ్వకాలు జరిపి, మానవ అవశేషాలను సేకరిస్తే అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో తవ్వకాలు జరపటంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణే డెక్కన్‌ కాలేజీ నిపుణుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపి, అక్కడే సీసీఎంబీ నిపుణులు శాంపిళ్లను సేకరించనున్నారు. ఈ మేరకు ఆ రెండు సంస్థలతో పురావస్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా తెలంగాణలో తొలిసారి పూర్తి శాస్త్రీయబద్ధంగా పురావస్తు తవ్వకాలు జరపబోతున్నారు.

రెండు ప్రాంతాల ఎంపిక
సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల కింద తవ్వకాలు జరిపిన పుల్లూరుకు సమీపంలో ఉన్న నర్మెట్ట, పాలమాకుల గ్రామాల్లో వందకుపైగా బృహత్‌ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇలాంటి సమాధుల్లో ప్రముఖమైనవి ఉన్నప్పుడు పది అడుగుల కంటే పొడవైన నిలువు రాళ్లను పాతేవారు. వాటిని మెన్హిర్‌గా పేర్కొంటారు. నర్మెట్ట శివారులో దాదాపు 10 అడుగుల ఎత్తున్న ఒక మెన్హిర్‌ను గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని భావిస్తున్నారు. ఈ నెలఖారున తవ్వకాలు ప్రారంభించి దాదాపు ఆరు వారాల పాటు కొనసాగించనున్నారు.

పూర్తి శాస్త్రీయ సర్వే ఇది
‘‘శాస్త్రీయ పద్ధతిలో పురావస్తు తవ్వకాలు జరపడంలో పుణేలోని డెక్కన్‌ కళాశాల, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉంది. మానవ అవశేషాల గుట్టు విప్పడంలో సీసీఎంబీ పేరు గాంచింది. అలాంటి ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిపే తొలి శాస్త్రీయ పరిశోధన ఇదే. బృహత్‌ శిలాయుగపు సమయంలో తెలంగాణకు వలసలు, ఆ సమూహాలు మరో ప్రాంతానికి వెళ్లటానికి కారణాలను విశ్లేషిస్తాం. ఇది చరిత్రలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు దోహదం చేస్తుంది’’
    – విశాలాచ్చి, పురావస్తుశాఖ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement