breaking news
CCMB Experts
-
ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు..
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఏపీలో వచ్చినట్టు చెప్పుకొంటున్న ఎన్440కె వేరియంట్ కరోనా వైరస్ ఇక్కడ వచ్చింది కాదని, గత ఏడాది సెప్టెంబర్లోనే హైదరాబాద్లో గుర్తించామని సీసీఎంబీ మాజీ సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథరావు చెప్పారు. ఇప్పుడు దీని ప్రభావం లేదని తెలిపారు. ఒక టీవీ చానల్లో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఇప్పుడు వచ్చిందనో, ఏపీలో పుట్టిందనో చెప్పడం సరికాదన్నారు. 8 నెలల కిందటే సీసీఎంబీలో గుర్తించినట్లు తెలిపారు. ఇప్పుడు దీని ప్రభావం తగ్గిపోయిందని, ఇతర వేరియంట్ల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. వేరియంట్లకు పేరు మనం పెట్టుకునేది కాదని, జీనోమ్ సీక్వెన్స్ మేరకు ఒక కన్సార్టియం నిర్ణయించిందన్నారు. అందులో సీసీఎంబీ కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ వేరియంట్ ఎప్పటినుంచో మహరాష్ట్రలో ఉందని తెలిపారు. వేరియంట్లలో రెండు రకాలు.. వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్నట్టు తేలిందన్నారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు వేరియంట్లు ఎక్కడ పుట్టాయి అన్నది ముఖ్యం కాదని, వాటి ఉధృతి ఎలా ఉంది, దాన్ని తట్టుకునేందుకు ఏం చేయాలి అన్నదానిపైనే ముందుకెళ్లాలని చెప్పారు. కరోనా సోకి భిన్నమైన లక్షణాలున్న వ్యక్తినుంచి నమూనాలు సేకరించి ప్రయోగం చేస్తేగాని వేరియంట్స్ గురించి తెలియవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం మంచిదని ఆయన చెప్పారు. చదవండి: కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్ ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ -
శిలాయుగపు వలసల గుట్టు తేల్చేస్తాం!
సిద్దిపేట జిల్లాలో తవ్వకాలకు పురావస్తు శాఖ సిద్ధం సాక్షి, హైదరాబాద్: ఒక చోట నుంచి మరో చోటికి వలస వెళ్లడం సాధారణమే. కానీ కొన్ని వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి అప్పటి మానవులు వలసలు రావడం విశేషమే. ఇప్పటి ఇరాన్, ఇరాక్, పాలస్తీనా తదితర ప్రాంతాలకు చెందినవారు దాదాపు రెండున్నర వేల ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో మనుగడ సాగించినట్లుగా ఇటీవల ప్రాథమిక ఆధారాలు వెలుగుచూశాయి. అసలు అక్కడివారు ఇక్కడికి ఎందుకొచ్చారు, ఎలా వచ్చారు, తర్వాత ఏమయ్యారు.. ఇలా ఎన్నో అంతుచిక్కని సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ ఇప్పుడా గుట్టు తేల్చే అధ్యయనం మొదలవుతోంది. బృహత్ శిలాయుగపు ఆనవాళ్లు, వలసల వెనుక విశేషాలను తేల్చేందుకు పురావస్తు శాఖ సిద్ధమైంది. ప్రఖ్యాత సంస్థలైన సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), పుణేలోని డెక్కన్ కాలేజీ ఫర్ పోస్టు గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులతో కలసి తవ్వకాలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట, పాలమాకుల ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించనుంది. రెండేళ్ల కిందటి తవ్వకాలతో.. పురావస్తు శాఖ రెండేళ్ల కింద సిద్దిపేట సమీపంలోని పుల్లూరులో బృహత్ శిలాయుగపు సమాధుల్లో తవ్వకాలు జరిపి మానవుల అవశేషాలను గుర్తించింది. అప్పట్లో వారు వాడిన వస్తువులు, పరికరాలు, ఆయుధాలను కూడా గుర్తించింది. సమాధిలో లభించిన మానవ అవశేషాలను సీసీఎంబీలో పరీక్షించారు. అయితే వాటిల్లోని డీఎన్ఏ తెలంగాణ స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. దాంతో వారు మరో ప్రాంతం నుంచి వలస వచ్చి ఉంటారని గుర్తించి పరిశోధన చేయగా... మధ్య ఆసియా దేశవాసుల డీఎన్ఏతో సరిపోలింది. ఈ నేపథ్యంలో ఆ మానవ సమూహం ఈ ప్రాంతానికి వలస వచ్చి, తిరిగి ఎక్కడికో వెళ్లిపోయిందని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం మరిన్ని సమాధుల్లో తవ్వకాలు జరిపి పరీక్షలు నిర్వహించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. అయితే సాధారణ పద్ధతిలో తవ్వకాలు జరిపి, మానవ అవశేషాలను సేకరిస్తే అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో తవ్వకాలు జరపటంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణే డెక్కన్ కాలేజీ నిపుణుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపి, అక్కడే సీసీఎంబీ నిపుణులు శాంపిళ్లను సేకరించనున్నారు. ఈ మేరకు ఆ రెండు సంస్థలతో పురావస్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా తెలంగాణలో తొలిసారి పూర్తి శాస్త్రీయబద్ధంగా పురావస్తు తవ్వకాలు జరపబోతున్నారు. రెండు ప్రాంతాల ఎంపిక సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల కింద తవ్వకాలు జరిపిన పుల్లూరుకు సమీపంలో ఉన్న నర్మెట్ట, పాలమాకుల గ్రామాల్లో వందకుపైగా బృహత్ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇలాంటి సమాధుల్లో ప్రముఖమైనవి ఉన్నప్పుడు పది అడుగుల కంటే పొడవైన నిలువు రాళ్లను పాతేవారు. వాటిని మెన్హిర్గా పేర్కొంటారు. నర్మెట్ట శివారులో దాదాపు 10 అడుగుల ఎత్తున్న ఒక మెన్హిర్ను గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని భావిస్తున్నారు. ఈ నెలఖారున తవ్వకాలు ప్రారంభించి దాదాపు ఆరు వారాల పాటు కొనసాగించనున్నారు. పూర్తి శాస్త్రీయ సర్వే ఇది ‘‘శాస్త్రీయ పద్ధతిలో పురావస్తు తవ్వకాలు జరపడంలో పుణేలోని డెక్కన్ కళాశాల, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉంది. మానవ అవశేషాల గుట్టు విప్పడంలో సీసీఎంబీ పేరు గాంచింది. అలాంటి ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిపే తొలి శాస్త్రీయ పరిశోధన ఇదే. బృహత్ శిలాయుగపు సమయంలో తెలంగాణకు వలసలు, ఆ సమూహాలు మరో ప్రాంతానికి వెళ్లటానికి కారణాలను విశ్లేషిస్తాం. ఇది చరిత్రలో కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు దోహదం చేస్తుంది’’ – విశాలాచ్చి, పురావస్తుశాఖ డైరెక్టర్