మంత్రి రావెల వివాదాస్పద వ్యాఖ్యలు | ap minister ravela kishore babu controversial comments | Sakshi
Sakshi News home page

మంత్రి రావెల వివాదాస్పద వ్యాఖ్యలు

Apr 23 2016 6:17 PM | Updated on Sep 3 2017 10:35 PM

మంత్రి రావెల వివాదాస్పద వ్యాఖ్యలు

మంత్రి రావెల వివాదాస్పద వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


- టీఆర్‌ఎస్ విధానాలకు భయపడే ఆ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు


హైదరాబాద్ : తెలంగాణలో ప్రాంతీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రాంతీయ తీవ్రవాదానికి భయపడే.. టీడీపీ శాసనసభ్యులు ఆపార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సచివాలయంలోని శనివారం మంత్రి రావెల తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరుతున్నారని స్పష్టీకరించారు.

తెలంగాణలో టీడీపీ శాసనసభ్యులూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్ చేరుతున్నారా అన్న విలేకరులకు ప్రశ్నకు మంత్రి రావెల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తోపాటూ ఆయన కుటుంబ సభ్యులు ప్రాంతీయ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రాంతీయ తీవ్రవాదానికి భయపడే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ప్రాంతీయ తీవ్రవాదంతో చెలరేగుతోన్న టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును మెరుగుపర్చడానికే సర్వే నిర్వహించి మంత్రులకు ర్యాంకులు కేటాయిస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ర్యాంకులు ఎక్కువ వచ్చిన మంత్రులు గొప్ప కాదని.. తక్కువ ర్యాంకులు వచ్చిన మంత్రుల పని తీరు బాగోలేదనడానికి వీల్లేదన్నారు. కేవలం పనితీరును మెరుగుపర్చుకోవడానికే ర్యాంకులు కేటాయిస్తున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ర్యాంకులను పరిగణనలోకి తీసుకోనప్పుడు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సర్వేలు నిర్వహించడం ఎందుకని విలేకరులు ప్రశ్నించగా మంత్రి రావెల నీళ్లు నమిలారు.

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదవుతోన్న విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తున్నామని చెప్పారు. బీ, సీ, డీ గ్రేడ్‌లోని విద్యార్థులకు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి.. వారి ప్రతిభకు సానపెడతామని వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల పనితీరును అంచనా వేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంచనాలకు తగ్గట్టుగా పనితీరు లేని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement