రక్తంలోనూ కల్తీ!

రక్తంలోనూ కల్తీ! - Sakshi


రక్తంలో ‘సెలైన్’ కలుపుతూ నకిలీ ప్యాకెట్ల తయారీ

హైదరాబాద్: నిత్యావసరాలే కాదు నిత్యం మన శరీరంలో ప్రవహిస్తూ ప్రాణాన్ని నిలబెట్టే రక్తాన్నీ కల్తీ చేస్తున్నారు.. పాలలో నీళ్లు కలిపినట్లుగా బ్లడ్ బ్యాంకుల నుంచి సేకరించిన రక్తంలో సగం గ్లూకోజ్ (సెలైన్) కలుపుతున్నారు.. ఈ కల్తీ చేసి రక్తాన్ని వేరే ప్యాకెట్లలో నింపి రోగులకు అమ్ముకుంటున్నారు.. అంతా పక్కాగా కనిపించేందుకు ఆ రక్తం ప్యాకెట్లకు బ్లడ్‌బ్యాంకుల నకిలీ స్టిక్కర్లు అతికిస్తున్నారు.. నకిలీ రసీదులూ సృష్టిస్తున్నారు.. మొత్తంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నిర్వాకం.

 

ఏడాది నుంచి..

సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో సరూర్‌నగర్‌కు చెందిన నరేందర్ (ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వమే ఈ బ్లడ్‌బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తాన్ని అందజేస్తుంది. రక్తం అందుబాటులో లేనప్పుడు రోగుల నుంచి డబ్బులు వసూలు చేసి.. బయట ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం ప్యాకెట్లను కొనుగోలు చేస్తుంటారు.



దీనిని ఆసరాగా తీసుకున్న నరేందర్... దాతల నుంచి బ్లడ్‌బ్యాంకుకు వచ్చే రక్తంలో గ్లూకోజ్ (సెలైన్) కలిపి, నకిలీ రక్తం ప్యాకెట్లను తయారు చేస్తున్నాడు. ఇతరబ్లడ్ బ్యాంకుల పేరుతో నకిలీ స్టిక్కర్లు తయారు చేయించి వాటికి అతికిస్తున్నాడు. రోగుల అవసరాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,000 వరకు అమ్ముకుంటున్నాడు. దాదాపు ఏడాదిగా ఈ వ్యవహారం సాగుతోంది.

 

మరొకరికి బాధ్యతలు అప్పగించడంతో..

నరేందర్ ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవు పెట్టాడు. దీంతో అధికారులు ఆ స్థానంలో మరో ల్యాబ్ టెక్నీషియన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ రక్తనిధిలో నిల్వ చేసిన రక్తం తేడాగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలంగాణ వలంటరీ బ్లడ్ బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మారెడ్డి తన బృందంతో కలసి సరూర్‌నగర్‌లోని నరేందర్ ఇంటికి వెళ్లి నిలదీశారు.



దీంతో నరేందర్ పారిపోయాడు. డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారమివ్వగా... వారు గురువారం నరేందర్ ఇంటితో పాటు బ్లడ్‌బ్యాంక్‌లో తనిఖీ చేసి 29 నకిలీ రక్తం ప్యాకెట్లు, నకిలీ స్టిక్కర్లు, రసీదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. మరో విషయం ఏమిటంటే సాధారణంగా రక్తం ప్యాకెట్‌లో 250 మిల్లీలీటర్ల రక్తం ఉండాలి, కానీ ఈ ప్యాకెట్లలో 150 మిల్లీలీటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నకిలీ రక్తాన్ని రోగులకు ఎక్కిస్తే.. గుండె ఫెయిలయ్యే అవకాశం ఉంటుందని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో రోగి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

నిలోఫర్ ఆస్పత్రి ముందు దళారులు

నిలోఫర్ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రం ముందు రక్తం దళారులు తిష్టవేశారు. రోగుల బంధువులెవరైనా ఆస్పత్రి లోనుంచి చీటీ తీసుకుని బయటికి రావడమే ఆలస్యం వారిని చుట్టుముడతారు. ‘రక్తం కావాలా, బ్లడ్ బ్యాంకుకు తీసుకెళతాం..’ అని వెంటపడతారు. వారిని కమీషన్లు ఇచ్చే బ్లడ్ బ్యాంకులకు తీసుకెళతారు. అక్కడ రోగుల బంధువులకు నకిలీ రక్తం ప్యాకెట్లను ఇవ్వడం, అడ్డగోలుగా డబ్బు వసూలు చేయడం చేస్తుంటారు. ఈ ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

 

చర్యలు తీసుకుంటాం..

‘‘రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ రక్తం అందిస్తున్న వారిపై, ఈ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నరేందర్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాం..’’

- రత్నకుమారి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top