రైతు సమగ్ర సర్వేపై పర్యవేక్షణకు వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్ బుధవారం సెల్‌ను ఏర్పాటు చేశారు.
- ఇక ప్రతీ రోజూ హైదరాబాద్ నుంచి టెలీ కాన్ఫరెన్స్
- క్షేత్ర స్థాయిలో అధికారుల సెలవులు రద్దు
సాక్షి, హైదరాబాద్: రైతు సమగ్ర సర్వేపై పర్యవేక్షణకు వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్ బుధవారం సెల్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెల్‌కు ఇన్‌చార్జిగా ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్‌కుమార్‌ను నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ‘రైతుకు ఎకరానికి సీజన్‌కు రూ. 4 వేల పెట్టుబడి’పథకం కోసం రైతుల సమగ్ర వివరాలను సేకరిస్తున్న సంగతి తెలి సిందే. ఆయా వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), మండల వ్యవసాయాధికారులు (ఏవో) ఉన్నారు. ఆ కార్యక్రమ పనితీరు పరిశీలించేందుకు జిల్లాకో రాష్ట్రస్థాయి బృందాన్ని ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తోన్న కిందిస్థాయి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇంటింటికీ వెళ్లి రైతు సమగ్ర సర్వే చేయని ముగ్గురు ఏఈవోలను ఇప్పటికే సస్పెండ్ చేయగా, సీరియస్‌గా పనిచేయని మరో ఏడుగురు ఏఈవోలకు తాజాగా నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే నెల 10వ తేదీ వరకు కింది నుంచి పై స్థాయి అధికారుల సెలవులను రద్దు చేశారు. ముఖ్యమంత్రి నిత్యం సమగ్ర రైతు సర్వేపై సమాచారం తెప్పించుకుంటున్నారు. సర్వే జరుగుతోన్న తీరును అడిగి తెలుసుకుంటు న్నారు. స్వయానా ఆ శాఖ కార్యదర్శి, కమిషనర్‌లకు ఫోన్ చేసి అడుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు 20 శాతం వరకు సర్వే పూర్తయినట్లు కమిషనర్ జగన్‌మోహన్ ‘సాక్షి’కి తెలిపారు.
రోజూ సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్
ఇకనుంచి ప్రతీ రోజూ సాయంత్రం 7 గంట లకు హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అవసరాన్ని బట్టి మంత్రి పోచారం, కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్ పాల్గొంటారు. పదో తేదీ వరకు నిత్యం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి స్తారు. మరోవైపు ఏఈవో, ఏవోలకు మొదటి విడత ట్యాబ్‌లను ఒకట్రెండు రోజుల్లో అందజేయనున్నారు.