ఇంజనీరింగ్, ఫార్మసీలో 57,940 మందికి సీట్లు

ఇంజనీరింగ్, ఫార్మసీలో 57,940 మందికి సీట్లు - Sakshi


- మొదటి కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు

- కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లు 11,183

- యూనివర్సిటీ కాలేజీల్లో వంద శాతం కేటాయింపు

- 100 ప్రైవేటు కాలేజీల్లో నూటికి నూరు శాతం భర్తీ

- రెండు కాలేజీలకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇవ్వలేదు

- 9 మందిలోపే ఆప్షన్లు ఇచ్చిన కాలేజీలు మూడు

- ఆప్షన్లు సరిగా ఇవ్వక ఏ కాలేజీలో సీట్లు రానివారు 8,626


 

 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డి తొలిదశ ప్రవేశాల్లో భాగంగా సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని 308 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 69,123 సీట్లు అందుబాటులో ఉండగా 57,940 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగతా 11,183 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 21లోగా ట్యూషన్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో చలానా రూపంలో చెల్లించాలని, 22వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. చివరి దశ ప్రవేశాల కోసం ఈ నెల 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 27న సీట్లు కేటాయిస్తామని, 29 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. 66,566 మంది విద్యార్థులు 34,29,835 వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులో ఒక విద్యార్థి అత్యధికంగా 848 ఆప్షన్లు ఇవ్వగా, ఒక విద్యార్థి ఒకే ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 57,940 మందికి సీట్లను కేటాయించారు. కేటాయింపు వివరాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో ఉంచారు. 8,626 మంది ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇవ్వనందున ఏ కాలేజీలో సీటు లభించలేదు.

 

 ఇంజనీరింగ్ 8,906 సీట్లు మిగులు

 రాష్ట్రంలోని 198 ఇంజనీరింగ్ కాలేజీల్లో (14 ప్రభుత్వ, 184 ప్రైవేటు) కన్వీనర్ కోటాలో 66,695 సీట్లు ఉండగా.. అందులో 57,789 సీట్లు భర్తీ అయ్యాయి. 8,906 సీట్లు మిగిలిపోయాయి. ఈసారి బీ-ఫార్మసీలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. 81 బీఫార్మసీ (ఎంపీసీ స్ట్రీమ్) కాలేజీల్లో 2,138 సీట్లు అందుబాటులో ఉండగా 116 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 2,022 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 29 ఫార్మ్-డి కాలే జీల్లో 290 సీట్లు అందుబాటులో ఉండగా.. 35 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

 

 255 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.  వంద ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే నూటికి నూరు శాతం సీట్ల కేటాయింపు జరిగింది. రెండు కాలేజీలకు ఒక్కరు కూడా ఆప్షన్ ఇచ్చుకోలేదు. మరో 3 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 30 బ్రాంచీల్లో ప్రవేశాలను చేపట్టినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు. అందులో 19 బ్రాంచీల్లోనే వంద శాతం సీట్ల కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు.

 

 ఇవీ సీట్ల కేటాయింపు వివరాలు..

 కోర్సు    కేటగిరీ    కాలేజీల     మొత్తం    కేటాయించినది    ఖాళీ     కేటాయింపు%

 సంఖ్య    సీట్లు        సీట్లు

 ఇంజనీరింగ్    వర్సిటీ    14    3040    3040    0    100

ప్రైవేటు    184    63,655    54,749    8906    86.0

మొత్తం    198    66,695    57,789    8,906    86.6

 

బీఫార్మసీ(ఎంపీసీ)


వర్సిటీ    3    80    36    44    45

ప్రైవేటు    78    2058    80    1,978    3.9

మొత్తం    81    2138    116    2,022    5.4

ఫార్మ్-డి    ప్రైవేటు    29    290    35    255    12

మొత్తంగా    308    69,123    57,940    11,183    83.8

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top