సనా ఇక్బాల్‌ జీవితం విషాదాంతం..

Sana Iqbal, cross- country woman biker and activist, dies in car crash - Sakshi

సాహసానికి నిర్వచనం సనా

ఓఆర్‌ఆర్‌పై అనుమానాస్పదంగా సనా ఇక్బాల్‌ మృతి

ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ధీర వనిత

29 రాష్ట్రాలు, 111 నగరాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో  

ఆరున్నర నెలలపాటు 38 వేల కిలోమీటర్ల ప్రయాణం

ఐదు నెలల పసికందును  ఇంట్లో వదిలి సాహస యాత్ర...

ఈ స్ఫూర్తితో ఎందరో ఆత్మహత్యాయత్నం నుంచి బయటకు...

అభిమానులు, డిప్రెషన్‌ బాధితుల్లో విషాదం

‘సనాతో మాట్లాడినతరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్‌బుక్‌ పేజీకి పోస్టు చేసేవారు.

మన దేశంమహిళలకు ఎంతోసురక్షితమైంది.నా పర్యటనలో ప్రతి చోటా సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. 

‘సూసైడ్‌ ఈజ్‌ నాట్‌ ద సొల్యూషన్‌’ అంటూ దేశానికి చాటిచెప్పిన సనా ఇక్బాల్‌ జీవితం విషాదాంతమైంది. ఆత్మహత్యాయత్నాల నుంచి వేలాది మందికి విముక్తి కల్పించిన ఆమె మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందడం అభిమానులను కలవరపరచింది. జీవించే హక్కు కోసం మరణించేవరకూ పోరాడిన స్ఫూర్తి ప్రదాత. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపిన ధీరవనిత ఆమె. మరణం అంచుల్లో ఉన్న ఎంతోమందికి జీవితపు లోగిళ్లలో వెలుగులు నింపింది. తాను స్వయంగా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యా సదృశమైన పరిస్థితులను జయించి ఫీనిక్స్‌లా పైకెగిసింది. తనలాగే  డిప్రెషన్‌తో బాధడేవాళ్లను కలిసి ఆ బాధల నుంచి విముక్తి కల్పించింది. సనా స్ఫూర్తితో  ఎంతోమంది  ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకున్నారు. కానీ సనా...మూడు పదుల వయసులోనే  మంగళవారం నాటి దుర్ఘటనలో కన్నుమూశారు. 

సాక్షి, సిటీబ్యూరో : ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా  బైక్‌రైడ్‌ చేసి స్పూర్తి నింపిన హైదరాబాదీ అమ్మాయి సనా ఇక్బాల్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్‌లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు.  

ఆమె ఒక సాహసి..
సనా జీవితం ఆద్యంతం సాహసోపేతం. నిట్టూర్పులకు, నిరుత్సాహానికి తావు లేకుండా, నిరాశా నిస్పృహలను దరిచేరనీయకుండా గడిపారామె. చిన్న వయసులోనే చుట్టిముట్టిన కుంగుబాటును అధిగమించారు. ‘ఇక ఇంతేలే..జీవితం’ అనుకున్న నిస్సహాయ పరిస్థితుల్లో నలిగిపోయి ఫినిక్స్‌లా పైకెగిశారు. నగరంలోని టోలిచౌకీకి చెందిన సనా ఇక్బాల్‌ భౌతికంగా లేకపోయినా ఆమె అందించిన స్ఫూర్తి మాత్రం దేశంలోని అన్ని నగరాల్లో సజీవంగానే ఉంటుంది. ఆమె బైక్‌పై ఒంటరిగా దేశమంతా పయనించారు. 2015 నవంబర్‌  23వ తేదీ నుంచి  2016 జూన్‌ 13వ తేదీ వరకు ఆమె చేసిన సాహసోపేత బైక్‌ రైడింగ్‌ ఒక సంచలనం. దేశంలోని 111 నగరాలు, 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో సనా పర్యటించారు. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా స్ఫూర్తిని రగిలించారు. ఆరున్నర నెలల పాటు, 38 వేల కిలోమీటర్ల దూరం సాగిన ఈ మహా యాత్రలో వేలాదిమంది ఆమె అభిమానులయ్యారు.

ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. ‘సూసైడ్‌ ఈజ్‌ నాట్‌ ద సొల్యూషన్‌’ అనే ఒకే ఒక్క నినాదమై సాగించిన యాత్రలో ఆమె వేలాది మందిని స్వయంగా పలికరించారు. ‘నాకు డిప్రెసివ్‌గా ఉందంటూ’ రాత్రి, పగలు తేడా లేకుండా ఆమె మొబైల్‌ ఫోన్‌కు ఎవరు సందేశాలు పంపించినా వెంటనే అప్రమత్తమయ్యేవారు. స్వతహాగా సైకాలజిస్ట్‌ అయిన సనా వారితో గంటలతరబడి మాట్లాడి ఆత్మహత్యా పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు తీసుకొచ్చేవారు. ఆమె మాటలు వారిలో ధైర్యాన్ని నింపేవి. ఎంతో ఊరట కలిగించేవి. ‘సనాతో మాట్లాడిన తరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్‌బుక్‌ పేజీకి పోస్టు చేసేవారు. కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ సందేశాలు కనిపిస్తాయి. సైకాలజీలో ఎంఏ  చేసిన సనా పలు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లోనూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చారు.   

ఇదీ సనా ప్రస్తానం ......
సనా బైక్‌రైడింగ్‌ సాహసయాత్ర నాటికి ఆమె కొడుకు ఐదు నెలల పసికందు. ఆ చిన్నారి  బాబును ఇంట్లోనే వదిలి పెట్టి ఈ యాత్ర చేపట్టారు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ‘ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు’ అనే సందేశంతో చేపట్టిన ఆ సాహసయాత్ర వెనుక ఎంతో విషాదంఉంది. సనా తల్లి షాహీన్‌ అడ్వొకేట్‌. తండ్రి కొన్నేళ్ల  క్రితమే చనిపోయారు. సనా 2014 డిసెంబర్‌లో అబ్దుల్‌ నదీం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. నదీం వేధింపులతో సనాకు జీవితంపైనే విరక్తి కలిగింది. అతని నుంచి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆమె గర్భిణి. ‘ఇక ఈ జీవితం బతకడానికి పనికిరానిదంటూ’ ఆమె తరచుగా ఆవేదన వ్యక్తం చేసేది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఆమెను తీవ్రంగా వేధించాయి. సరిగ్గా ఆ సమయంలోనే సనా వాస్తవంలోకి వచ్చారు. డిప్రెషన్‌ను, విషాదాన్ని జయించి యాత్ర చేపట్టారు. తనలాంటి ఎంతోమందిని కాపాడాలనే సత్సంకల్పానికి అలా శ్రీకారం చుట్టారు.   

రైడ్‌లోనే మృత్యువును జయించారు...
ఆ సాహసోపేతమైన బైక్‌రైడింగ్‌ ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో సాగిందంటే .... రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖం పూర్తిగా  దెబ్బతిన్నది. ఒకరకంగా సనా అప్పుడే మృత్యుముఖంలోంచి బయటపడ్డారు. కానీ తన సాహసయాత్రకు ఈ ప్రమాదం ఆటంకం కాలేదు. తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు వచ్చిన తరువాత సనాఏమన్నారంటే...‘మన దేశం మహిళలకు ఎంతో సురక్షితమైంది. నా పర్యటనలో ప్రతి చోట సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో యాక్సిడెంట్‌ అయ్యి దెబ్బలు తగిలి ముఖం బాగా పాడయింది. టూర్‌కి ముందు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే  తప్పకుండా డిప్రెషన్‌లోకి వెళ్లెదాన్ని. కానీ ఇప్పుడు ఆ యాక్సిడెంట్‌ వల్ల పాడైన ముఖం నన్ను బాధ పెట్టలేదు. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చిన ఈ రైడ్‌ను చివరి వరకు కొనసాగించాలనే పట్టుదలతోనే పూర్తిచేశాను’. రైడ్‌లో భాగంగా ఆమె కాలేజీలకు వెళ్లి విద్యార్ధులను కలిశారు.

విషాదఛాయలు
గోల్కొండ: సనా ఇక్బాల్‌ మృతితో టోలిచౌకి అల్‌హస్నాత్‌ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలనీలో తెలిసినవారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అమ్మాయి మృతి చెందిందన్న విషయం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆమె ఉపయోగించే ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్‌ చేసి ఉంది. వాహనాన్ని చూసిన వారు సనా ఇక్బాల్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

అనుమానంగా ఉంది
మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటలకు ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన సనా కారు పార్క్‌ చేస్తూ నాకు కాల్‌ చేసింది. అప్పటికే ఆమె భర్త నదీం కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కోసమే అతడు వచ్చినట్లు నాకు అర్ధమైంది. ఆ సమయంలో అతనితో గొడవ పడడం మంచిది కాదని, తాను అతనితో కలిసి వెళ్తానని తన కొడుకును, లాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని అక్క నాతో చెప్పింది, నేను అలాగే బాబును తీసుకొని ఇంట్లోకి వచ్చాను. సనా ఆమె భర్తతో కలిసి బయటకు వెళ్లింది. ఉదయం 7 గంటలకు  సనా ప్రమాదానికి గురైనట్లు నదీం ఫ్రెండ్‌ అద్నాన్‌ వచ్చి చెప్పాడు. ఆసుపత్రికి కెళ్లాం. అక్క తీవ్రంగా గాయపడింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్‌ చెప్పాడు. కానీ నదీం మాత్రం క్షేమంగా కనిపించాడు. నదీం మా అక్కను చంపేశాడని అనుమానంగా ఉంది. గతంలోనూ నదీంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.   – సబ, సనా చెల్లెలు

ఫియర్‌లెస్‌..
తను చాలా ధైర్యవంతురాలు. సనాను వాండరర్‌ గ్రూప్‌కి నేను పరిచయం చేశాను. మొదటి రోజు నుంచి తాను చాలా బాగా రైడ్‌ చేసేది. ఒంటరిగా దేశమంతా తిరిగింది. భయం అన్నది తెలియదు. అసలు తను లేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నా.   – రాహుల్‌ సక్సేనా, (సనా మిత్రుడు)  

డేర్‌ డెవిల్‌...
నాకు కూతుళ్లు లేరు. ఆ లోటు సనాని చూసినప్పుడు తీరిందనిపించేది. ఎవరికి పరిచయం చేసినా నా కూతురు అనే చెప్పేవాడిని. ఎంతో గౌరవంగా మెలిగేది. ఆల్‌ ఇండియా టూర్‌లో మగవాళ్లు కూడా రైడ్‌ చేయలేని దారుల్లో, పరిస్థితుల్లో ఒంటరిగా పయనించింది. ఆమెకి నా సెల్యూట్‌. ఆమె లేకపోవటం మా రైడర్స్‌కి తీరని లోటు  – లలిత్‌జైన్, వాండరర్స్‌ రైడర్‌ గ్రూప్‌

                   ఓ కళాశాలలో సనా...(ఫైల్‌) , సాహసయాత్రకు వెళ్తూ..(ఫైల్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top