సభ సజావుగా సాగాలి | Sakshi
Sakshi News home page

సభ సజావుగా సాగాలి

Published Wed, Oct 25 2017 2:10 AM

8th session of the Assembly

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ 8వ సమావేశాలు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇరు సభలు ప్రశాంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పీకర్‌ చాంబర్‌లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.

ఇందులో స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మండలి విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు. సభలు కొనసాగుతున్న సమయంలో పటిష్ట భద్రతకు చర్యలు తీసుకోవాలని, గుర్తింపు కార్డులుం టేనే లోనికి అనుమతించాలని ఆదేశించారు. బ్యానర్లు, ఇతర సామగ్రిని లోనికి అనుమతించరాదని సూచించారు.

అంతకుముందు సీఎస్‌ ఎస్పీసింగ్‌తో సమావేశమయ్యారు. వివిధ శాఖలపై సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు వేగవంతంగా, అర్థవంతంగా రావడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేదీ, హైదరాబాద్‌  సీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

3 వేల మందితో బందోబస్తు: సీపీ
అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు. సమీక్ష అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.. గుర్తింపు కార్డు ఉన్న వ్యక్తులనే లోనికి అనుమతిస్తామని, జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని చెప్పారు.

శాంతి భద్రతలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎవరైనా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తే వారిని అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement