వైఎస్సార్ కడప జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయసాయి రెడ్డి కేంద్రాన్ని కోరారు.
► రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రస్తావన
న్యూఢిల్లీః ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచిన నిబంధన మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈమేరకు ఆయన ఈ అంశాన్ని గురువారం ప్రత్యేక ప్రస్తావనల కింద లేవనెత్తారు. విభజన జరిగిన సమయం నుంచి 6 నెలల్లో సెయిల్ ఈ ప్లాంటు ఏర్పాటుకు యోగ్యత అధ్యయనాన్ని పూర్తిచేయాల్సి ఉందని గుర్తుచేశారు.
ఎట్టకేలకు రెండేళ్ల అనంతరం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారుచేయడానికి ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని, కానీ ఇప్పటివరకు పురోగతి లేదని వివరించారు. పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల తరహాలోనే వైఎస్సార్ జిల్లా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయన్నారు. ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగిత తీవ్రంగా ఉందని, సామాజిక–ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవని వివరించారు. స్టీల్ ప్లాంట్ సాధన సమితి, కడప ఉక్కు పోరాట కమిటీ ఈ ప్లాంటు ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.