శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి | releaf to Uphaar fire tragedy convicts Ansal brothers in supreme court | Sakshi
Sakshi News home page

శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి

Aug 20 2015 1:22 AM | Updated on Sep 3 2017 7:44 AM

శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి

శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి

దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదాల్లో ఒకటైన ఉపహార్‌ సినిమాహాల్‌ ఘటనలో 18 ఏళ్ల తర్వాత తుదితీర్పు వెలువడింది.

ఉపహార్ కేసులో అన్సాల్ సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో  దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్‌లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు  చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా కింద జమ చేయాలని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వాడాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

దక్షిణ ఢిల్లీలోని ఉపహార్ హాల్లో 1997, జూన్ 13న ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తుండగా భారీ అగ్నిప్రమాదం జరిగి 59 మంది సజీవదహనం అయ్యారు. అన్సాల్ సోదరులకు ఢిల్లీ కోర్టు ఏడాది జైలు శిక్ష వేసింది. విచిత్రమేమంటే వీరిలో ఒకరు అయిదు నెలలు, మరొకరు నాలుగు నెలలు మాత్రమే కేసు ప్రాథమిక విచారణ దశలో జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు వారి అప్పీలుపై సుప్రీం ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందని బాధితుల పక్షాన 18ఏళ్లుగా పోరాడుతున్న నీలం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

ధనవంతులు ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయాన్ని ఈ తీర్పు కలిగించిందన్నారు. న్యాయం కోసం సుప్రీంకు రావడం తమ పొరపాటన్నారు. డబ్బున్న వ్యక్తి ఎవరినైనా కారు కింద పడేసి చంపి కోటి రూపాయలు ఇస్తే చాలన్నట్లుగా కోర్టు తీర్పు ఉందన్నారు. న్యాయం కోసం ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న తమ ఆవేదనను కోర్టు పట్టించుకోలేద న్నారు.  

ఇటువంటి కేసులలో చట్టం ప్రకారం  గరిష్ట శిక్ష రెండేళ్లే అయినా తమ నిర్లక్ష్యంతో 59 మందిప్రాణాలను బలిగొనడానికి కారణమైనవారికి మరింత కఠిన శిక్ష విధించి కోర్టు  కొత్త దారి చూపి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఉపహార్ ఘటనలో కృష్ణమూర్తి దంపతులు తమ ఇద్దరు పిల్లలను కోల్పోయారు. అప్పటి నుంచి నీలం న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. అసోసియేషన్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీగా ఏర్పడి ఇన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement