breaking news
upreme court
-
మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులు వృత్తి మెళకువలు నేర్చుకుని పైకి రావాలంటే ఓ మంచి న్యాయవాదిని ఎంపిక చేసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేయాలని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. మంచి న్యాయవాది అంటే ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తి కాదని, న్యాయశాస్త్రంలో అంశాల మీద మంచి పట్టున్న వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తి వద్ద చేరితే కేసులను వాదించే అవకాశం దక్కి, మన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వస్తుందని, తద్వారా వృత్తిలో ముందుకెళ్లే అవకాశం దొరుకుతుందని చెప్పారు.వాదించే అవకాశం సులభంగా రాదని, బాగా కష్టపడాలని ఉద్బోధించారు. తాను కూడా అలా కష్టపడితేనే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానన్నారు. యువ న్యాయవాదులకు రాష్ట్ర న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్), కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ తరగతుల్లో రెండో రోజు శనివారం “ఆర్ట్ ఆఫ్ అడ్వొకసీ’ అనే అంశంపై జస్టిస్ నాగార్జునరెడ్డి మాట్లాడారు. కేవలం వాదనలు వినిపిస్తే సరిపోదని, వాదనలు ఎలా వినిపించాలో నేర్చుకోవాలని, అది ఓ కళ అని తెలిపారు. ఆ కళని ఒంటబట్టించుకుంటేనే విజయవంతమైన న్యాయవాది అవుతారన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.అందరిలో ఒకరిలా ఉండిపోకండి‘న్యాయ పాలనలో న్యాయవాదులు, న్యాయమూర్తుల పాత్ర’ అన్న అంశంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడారు. న్యాయమూర్తిగాకంటే న్యాయవాదిగా తాను ఎక్కువ ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. మూడుసార్లు తాను న్యాయమూర్తి పోస్టును తిరస్కరించానని, చివరకు విధి లేని పరిస్థితుల్లో ఆ పోస్టును అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఆ మరుసటి రోజే తన అంగీకారన్ని ఉపసంహరించుకుంటానని అప్పటి ప్రధాన న్యాయమూర్తిని కోరానని, అప్పటికే జాబితా కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.తాను ఎక్కడో చిన్న పల్లెలో పుట్టి ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. ఎప్పుడూ పెద్ద కలలు కనాలని, అప్పుడే ఖచ్చితంగా ఏదో ఒక స్థానానికి చేరుకుంటారని, అసలు కలలు కనకుంటే ఏ స్థాయికీ రాలేరని తెలిపారు. అందరిలో ఒకరిలా ఉండపోకూడదని, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలని చెప్పారు. న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావును బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.ద్వారకనాథరెడ్డి, ఇతర సభ్యులు ఘనంగా సన్మానించారు.కక్షిదారుడు న్యాయవాదులకు దేవుడుమనకు కేసు అప్పగించే కక్షిదారుడిని ఎప్పుడూ దేవుడిలా చూడాలని జస్టిస్ నాగార్జునరెడ్డి చెప్పారు. కక్షిదారుడిని అవమానించడం, తక్కువ చేసి చూడటం, అతనితో కర్కశంగా మాట్లాడటం వంటివి చేయకూడదన్నారు. కక్షిదారుడు ఇచ్చే ఫీజుతో మన కుటుంబాలు నడుస్తున్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని స్పష్టం చేశారు. అలాగే కక్షిదారుల నుంచి వసూలు చేసే ఫీజుల విషయంలో కూడా సహేతుకంగా ఉండాలని హితవు పలికారు. -
శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి
ఉపహార్ కేసులో అన్సాల్ సోదరులకు సుప్రీం కోర్టు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా కింద జమ చేయాలని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వాడాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలోని ఉపహార్ హాల్లో 1997, జూన్ 13న ‘బోర్డర్’ సినిమా ప్రదర్శిస్తుండగా భారీ అగ్నిప్రమాదం జరిగి 59 మంది సజీవదహనం అయ్యారు. అన్సాల్ సోదరులకు ఢిల్లీ కోర్టు ఏడాది జైలు శిక్ష వేసింది. విచిత్రమేమంటే వీరిలో ఒకరు అయిదు నెలలు, మరొకరు నాలుగు నెలలు మాత్రమే కేసు ప్రాథమిక విచారణ దశలో జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు వారి అప్పీలుపై సుప్రీం ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందని బాధితుల పక్షాన 18ఏళ్లుగా పోరాడుతున్న నీలం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయాన్ని ఈ తీర్పు కలిగించిందన్నారు. న్యాయం కోసం సుప్రీంకు రావడం తమ పొరపాటన్నారు. డబ్బున్న వ్యక్తి ఎవరినైనా కారు కింద పడేసి చంపి కోటి రూపాయలు ఇస్తే చాలన్నట్లుగా కోర్టు తీర్పు ఉందన్నారు. న్యాయం కోసం ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న తమ ఆవేదనను కోర్టు పట్టించుకోలేద న్నారు. ఇటువంటి కేసులలో చట్టం ప్రకారం గరిష్ట శిక్ష రెండేళ్లే అయినా తమ నిర్లక్ష్యంతో 59 మందిప్రాణాలను బలిగొనడానికి కారణమైనవారికి మరింత కఠిన శిక్ష విధించి కోర్టు కొత్త దారి చూపి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఉపహార్ ఘటనలో కృష్ణమూర్తి దంపతులు తమ ఇద్దరు పిల్లలను కోల్పోయారు. అప్పటి నుంచి నీలం న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. అసోసియేషన్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీగా ఏర్పడి ఇన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.