
మసిపూసి మారేడుకాయ
తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) ర్యాంకులను శుక్రవారం ప్రకటించారు.
* రహస్యంగా ప్రైవేటు మెడికల్ ర్యాంకుల ప్రకటన
* వెబ్‌సైట్‌లో ర్యాంకులు పెట్టి చేతులు దులుపుకున్న యాజమాన్యాలు
* ఇంటర్ వెయిటేజీ మార్కులతో కలిపి వెల్లడి
* సగం మంది ర్యాంకులు ప్రకటించని వైనం
* ఖమ్మంకు చెందిన కొండా అన్వితకు మొదటి ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) ర్యాంకులను శుక్రవారం ప్రకటించారు.
ర్యాంకుల వివరాలను ప్రభుత్వానికి తెలపడం కానీ... అధికారికంగా ప్రకటించడంగానీ చేయలేదు. అత్యంత రహస్యంగా వెబ్‌సైట్‌లో పెట్టి ప్రైవేటు యాజమాన్యాలు తమ ధిక్కారాన్ని ప్రదర్శించాయి. ఏ ప్రమాణాలను ఆధారం చేసుకొని ర్యాంకులను వెల్లడిస్తున్నారో ప్రకటించలేదు. కనీసం మీడియాకు ప్రకటన కూడా జారీచేయలేదు. కేవలం విద్యార్థుల పేర్లను, ర్యాంకులను వెల్లడించి ఊరుకున్నారు. ఇంతగోప్యత పాటించడం వెనుక అక్రమాలకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
అన్నీ సందేహాలే!
ప్రైవేటు యాజమాన్యాల ప్రత్యేక ఎం-సెట్ నోటిఫికేషన్ మొదలు... ర్యాంకుల ప్రకటన వరకూ ఎక్కడా పారదర్శకత లేదు. కనీసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి కూడా చెప్పకుండానే నోటిఫికేషన్, మార్కులను, ర్యాంకులను విడుదల చేశారు. అంతేకాదు దరఖాస్తు సమయంలో వెయిటేజీ కోసం ఇంటర్ మార్కులను, హాల్‌టికెట్ నెంబర్‌ను అడగలేదు. ప్రభుత్వం నుంచి చీవాట్లు పడ్డాక ఇంటర్ వెయిటేజీ ఉంటుందని పేర్కొన్నారు.
ఇంటర్ మార్కులను అప్‌లోడ్ చేయాలన్న విషయాన్ని కూడా అందరికీ చెప్పకుండా తమకు కావాల్సిన వారికి మాత్రమే అప్‌లోడ్ చేయమని సమాచారమిచ్చారని తెలిసింది. ఇలా తాము అమ్మేసుకున్న సీట్ల విద్యార్థులకు తగినట్లుగా ర్యాంకులను ప్రకటించారా అన్న విమర్శలు వస్తున్నాయి. పరీక్షకు 5,130 మంది హాజరైతే... 2,266 మంది ర్యాంకులే ప్రకటించారు. ఇంత తక్కువ మంది ర్యాంకులు ప్రకటించడం వెనుక మతలబేంటి? ఇంటర్ వెయిటేజీ కలిపాక దాదాపు సగం మందే అర్హత సాధించారా? లేకుంటే అంతమందే ఇంటర్ మార్కులను అప్‌లోడ్ చేశారా? ఇవన్నీ సందేహాలే. ర్యాంకుల ప్రకటనకు ఎంత కట్ ఆఫ్ మార్కును తీసుకున్నారనేది కూడా తెలియదు.
మొదటి ర్యాంకర్ ఖమ్మంకు చెందిన అన్విత
ప్రవేశ పరీక్ష మార్కులను 75 శాతంగా, ఇంటర్ మార్కులను 25 శాతంగా లెక్కించి ర్యాంకులను వెల్లడించారు. ఈ ర్యాంకులను కేవలం ఇంటర్ మార్కుల శాతాన్ని www.tgmedico.com లో అప్‌లోడ్ చేసిన వారికే కేటాయించారు. అప్‌లోడ్ చేయని వారికి ర్యాంకులను కేటాయించలేదు. ప్రవేశ పరీక్ష, ఇంటర్ వెయిటేజీని కలిపి లెక్కిస్తే ఖమ్మంకు చెందిన కొండా అన్విత మొదటి స్థానంలో నిలిచింది.
ఆమె ఎం-సెట్‌లో 147 మార్కులు సాధించింది. రెండో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన ఊటుకూరి తేజ సాధించాడు. మూడో ర్యాంకును వడ్ల క్రిష్ణయ్య శాలిని, నాలుగో ర్యాంకును దాసరి సుష్మారెడ్డి, ఐదో ర్యాంకును శశాంక్ పరిమి, ఆరో ర్యాంకును కొరళ్ల మహతిరెడ్డి, ఏడో ర్యాంకును శ్రుతి, ఎనిమిదో ర్యాంకును మేఘన, తొమ్మిదో ర్యాంకును కావ్య, పదో ర్యాంకును త్రిభూనేశ్వరి సాధించారు. మొదటి పది ర్యాంకుల్లో 8 ర్యాంకులు అమ్మాయిలకు, రెండు ర్యాంకులు అబ్బాయిలకు వచ్చాయి.