
ఆప్కో విభజనకు ఓకే
పరిశ్రమల శాఖలో అంతర్భాగమైన ఆప్కో, ఖనిజాభివృద్ధి సంస్థ విభజనకు సంబంధించిన తుది నివేదికలు సోమవారం షిలాబిడే కమిటీకి చేరాయి.
* షిలాబిడే కమిటీకి చేరిన ఎండీసీ, ఆప్కో నివేదికలు
* జనాభా ప్రాతిపదికన పంపకాలకు అంగీకారం
సాక్షి,హైదరాబాద్: పరిశ్రమల శాఖలో అంతర్భాగమైన ఆప్కో, ఖనిజాభివృద్ధి సంస్థ విభజనకు సంబంధించిన తుది నివేదికలు సోమవారం షిలాబిడే కమిటీకి చేరాయి.సంస్థల ఆస్తులు, అప్పులు, నిధులు, ఉద్యోగుల విభజన తదితర అంశాలను నివేదికలో పొందుపరిచారు.
ఆప్కో విభజనకు సంబంధించిన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇరు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న జాయింట్ మేనేజింగ్ డైరక్టర్లు (జేఎండీ) కమిటీకి నివేదించారు. అయితే ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ ఎండీసీ) నిధుల పంపకంలో ఉన్న సమస్యలను టీఎస్ ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ లోకేశ్ కుమార్ కమిటీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. రెండు విభాగాల నుంచి అందిన నివేదికలను పరిశీలించిన తర్వాత తమ అభిప్రాయం వెల్లడిస్తామని షిలాబిడే తెలిపారు.
ఆప్కోలో ఎక్కడి ఆస్తులు అక్కడే..
ఆప్కోను ఎక్కడి ఆస్తులు అక్కడే ప్రాతిపదికన విభజించేందుకు ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జనాభా ప్రాతిపదికన అప్పులు, నిధులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆప్కో ఉత్పత్తులను విక్రయించేందుకు మొత్తం 184 షోరూంలు వుండగా మొదటి కేటగిరీలో వున్న షోరూంల్లో తెలంగాణకు 47 దక్కుతాయి.
బయటి రాష్ట్రాల్లో వున్న 26 షోరూంలలో ప్రస్తుతమున్న వస్త్ర నిల్వలను జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. కాగా వరంగల్, హైదరాబాద్‌లోని ఆప్కో గోదాములు మాత్రమే తెలంగాణకు చెందుతాయని నివేదికలో పేర్కొన్నారు. ఆప్కో ఉద్యోగులను 42:58 నిష్పత్తిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
ఉమ్మడి ఖాతా నిధులపై సందిగ్ధత..
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఎండీసీ) విభజనపైనా సోమవారం షిలాబిడే కమిటీకి ఇరు రాష్ట్రాల అధికారులు నివేదిక సమర్పించారు. ఉమ్మడి రాష్ట్ర ఎండీసీ ఖాతాలో వున్న రూ.1,024 కోట్ల పంపకాలపై ఏపీ అనుసరిస్తున్న వైఖరిని టీఎస్ ఎండీసీ ఎండీ లోకేశ్‌కుమార్ కమిటీ దృష్టికి తెచ్చారు. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత దీనిపై తమ నిర్ణయం వెల్లడిస్తామని కమిటీ తెలిపింది.