ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు | central government to provide Smart Card for every citizen in india | Sakshi
Sakshi News home page

ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు

Feb 18 2016 10:16 PM | Updated on Sep 18 2018 7:56 PM

ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

బహుళ ప్రయోజన కార్డుగా జారీ
హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే... మే నెలాఖరు గడువు


సాక్షి, హైదరాబాద్: ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్)లోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. దేశంలోనే ప్రతి పౌరుడికి ఈ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డును, మొబైల్ ఫోన్ నెంబర్‌ను దీనితో అనుసంధానం చేస్తుంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఐడీ కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా పనికొస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందేందుకు ఇదే ప్రధాన ఆధారంగా ఉంటుంది. ఈ కార్డుల జారీ ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. అందుకు వీలుగా ఇంటింటి సర్వేను పూర్తి చేసి తుది జాతీయ జనాభా పట్టికను తయారు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ కారణంగా గ్రేటర్ పరిధిలో సర్వే జరగలేదు. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా గతంలో జనగణన సందర్భంగా ఇచ్చిన వివరాలను ఆధార్ కార్డు నెంబర్లు, మొబైల్ నెంబర్లతో అనుసంధానం చేస్తారు. అప్పుడు ఇచ్చిన వివరాల్లో మార్పులు చేర్పులు తప్పు ఒప్పులున్నా సవరిస్తారు. జాతీయ జనాభా పట్టిక రూపకల్పనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో న్యూఢిల్లీలో గురువారం వర్క్‌షాప్ జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య దీనికి హాజరయ్యారు. ఈ సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇవ్వనుంది. వీటన్నింటినీ పరిష్కరించి సమగ్రంగా తుది జాతీయ జనాభా పట్టికను రూపొందిస్తారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తోంది. కార్డుల జారీకి దీనిని ప్రామాణికంగా గుర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement