
గోపాలపురం: కొత్త రేషన్ కార్డుల మంజూరులో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్మార్ట్‌కార్డుల పంపిణీలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామంలో శనివారం ఉదయం నుంచి రేషన్ షాపు వద్ద కొత్త స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుందని శుక్రవారం రాత్రి ప్రచారం చేశారు. దీంతో శనివారం ఉదయమే లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.
అదే గ్రామానికి చెందిన కొరపాటి పెద వెంకటస్వామి (69) కూడా క్యూలో నిలబడ్డాడు. అయితే, రెండు గంటలకు పైగా నిరీక్షించిన అనంతరం అతను కార్డు తీసుకున్నాడు. ఉదయం నుండి ఆహారం తీసుకోకపోవడంతో వెంకటస్వామి ఇంటికి చేరుకునేసరికి కళ్లు తిరిగి కింద పడిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడు మృతిచెందినట్లు వారు తెలిపారు.
ఇంటింటికీ పంపిణీ చేయాలి..
నిజానికి.. కొత్త స్మార్ట్ కార్డులను రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, రేషన్ షాపు వద్దకే రావాలంటూ టాం టాం ద్వారా గ్రామంలో ప్రకటించడంతో లబ్ధిదారులు డీలరు వద్దకు చేరుకుని నానా అవస్థలు పడ్డారు. దీనిపై తహసీల్దార్ ఎంపీ సాయిప్రసాద్‌ను వివరణ కోరగా.. టాంటాం చేయడంవల్ల అనర్ధం జరిగిందన్నారు. స్మార్ట్ కార్డులు ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేశామన్నారు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి వీఆర్వోను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.