వివాదాల్లో ఈవో.. కారణాలు ఏవేవో! | Sakshi
Sakshi News home page

వివాదాల్లో ఈవో.. కారణాలు ఏవేవో!

Published Mon, Jan 8 2018 8:35 AM

officials terror on durga temple EO post  - Sakshi

సాక్షి, విజయవాడ: దశాబ్దకాలంలో టి.చంద్రకుమార్, ఈ.గోపాలకృష్ణారెడ్డి, ఎన్‌.విజయకుమార్, ఎం.రఘునాథ్, కె.ప్రభాకరశ్రీనివాస్, సీహెచ్‌ నర్సింగరావు దుర్గగుడికి పూర్తికాలం ఈవోలుగా పనిచేశారు. ఇందులో ప్రభాకర శ్రీనివాస్, నర్సింగరావు స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటీ కలెక్టర్లు కాగా, మిగిలిన వారు దేవాదాయశాఖలో రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ కేడర్‌వారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ గట్టిగా రెండేళ్లు కూడా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోపణపై అర్థంతరంగా బదిలీ అయినవారే. సీహెచ్‌ నర్సింగరావు ఒక అర్చకుడిని మనోవ్యధకు గురిచేయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. అర్చకులంతా «నిరసన తెలియజేయడంతో నర్సింగరావును బదిలీ చేశారు. ఒక మహిళా ఉద్యోగినిపై తన పీఏ సహాయంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణతో ప్రభాకర శ్రీనివాస్‌ను మార్చారు. ఈవో పీఏ ఒక మహిళా ఉద్యోగిని లైగింకంగా వేధిస్తూ ఎస్‌ఎంఎస్‌ పెట్టడం వివాదాస్పదమైంది.

దేవస్థాన హుండీల్లో  ఉండాల్సిన డబ్బు ఈవో కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడంతో అమ్మవారి సొమ్ము దారి మళ్లుతోందంటూ రఘునాథ్‌ను ఆ సీటు నుంచి తప్పించారు. టెండర్లలో అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం చేశారని విజయకుమార్‌ను, ఇంద్రకీలాద్రిపై ఉన్న ఇళ్లను తొలగించేందుకు అమ్మవారి సొమ్మును చెల్లించే విషయంలో అవకతవకలు జరిగాయని చంద్రకుమార్‌ను బదిలీ చేశారు. ఇక రెండుసార్లు ఇన్‌చార్జిగా పనిచేసిన చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఒకసారి పాలకమండలితో విభేదించి, రెండోసారి పుష్కరాలకు పూర్తిస్థాయి ఈవోను వేయాలని మార్చారు. తాత్కాలిక ఈవోగా పనిచేసిన ఆర్‌.కృష్ణమోహన్‌ హయాంలో తొక్కిసలాట జరగడంతో ఆయననూ మార్చారు. 

తొలి మహిళా అధికారికీ తప్పని అవమానం
దుర్గగుడికి తొలి మహిళా ఐఏఎస్‌ అధికారి సూర్యకుమారికి అవమానం తప్పలేదు. టీటీడీ తరహాలో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చి ఆమెను దుర్గగుడి ఈవోగా వేశారు. ఆమెపై ఆరోపణలు రావడంతో చివరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం రద్దు చేశారు. దేవస్థానంలో తాంత్రిక పూజలు చేయించిన విషయం పొక్కడంతో ఈవో పదవి నుంచి తప్పించారు. ఈవోగా రెండేళ్లూ పనిచేయని సూర్యకుమారి తన పదవీ కాలమంతా వివాదస్పదంగానే గడిపారు. ఆదాయం పెంచడం కోసం టికెట్‌ రేట్లు పెంచడం, అమ్మవారి మూలధనాన్ని దుబారా చేయడం.. ఇలా అనేక విమర్శలు మూటగట్టుకున్నారు.

కనీసం మూడేళ్లు ఉంటేనే అభివృద్ధి
ఈవోలు కనీసం రెండేళ్లయిన పనిచేయకుండా మార్చివేయడంతో దేవాలయం అభివృద్ధి కుంటుపడుతోంది. దసరా, భవానీ దీక్షల విరమణ చేస్తే వారికి కొంత అవగాహన వస్తుంది. ఇలా అవగాహన పెంచుకుని పట్టు బిగించేలోపే ఈవోను బదిలీ చేసేస్తున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. అర్చకులతోపాటు అనేక మంది సిబ్బంది దీర్ఘకాలం దేవస్థానంలోనే ఉండటంతో వచ్చిన ఈవోలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చివరకు ఈవోలు అప్రదిష్టను మూటగట్టుకుని వెళ్తున్నారు.

Advertisement
Advertisement