ఇక ‘తానా’ తందానేనా?

Vardhelli Murali Article On TDP Present Situation - Sakshi

జనతంత్రం

ద్వాపరయుగం చివరి రోజులు... ద్వారకా నగరంలో అనేక వింతలూ, విడ్డూరాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు లేవు, వర్షం లేదు, కానీ పిడుగులు పడుతున్నాయి. అప్పుడప్పుడూ ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడుతున్నాయి. చిలుకలు గుడ్లగూబల్లా ప్రవర్తిస్తున్నాయి. నక్కల మాదిరిగా మేకలు ఊళలు పెడుతున్నాయి. జనం తాగి తందనాలాడుతున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈ విపరీత పరిణామాల రిపోర్టంతా శ్రీకృష్ణునికి అందింది. ఆయన ఆశ్చర్యపడలేదు. మౌనం వహించాడు. మొత్తం సినిమా ఆయనకు అర్థమైపోయింది. కురుక్షేత్ర యుద్ధానంతరం కౌరవమాత గాంధారి తీవ్రంగా రోదించింది. నూరుగురు కొడుకులను కోల్పోయిన పుత్ర శోకంతో ఆమె రుద్రమూర్తిలా మారిపోయింది. ఇందుకు కారకుడవు నువ్వేనంటూ శ్రీకృష్ణుడిని నిందించింది. నా కడుపు కోతకు కారణమైన నీ వంశం సర్వనాశనమైపోతుందని శపించింది. అప్పటికి ముప్ఫయ్యారేళ్లయింది కురుక్షేత్ర యుద్ధం – ధర్మరాజు పట్టాభిషేకం జరిగి. ఆమె శాపం ఇప్పుడు ప్రభావం చూపడం మొదలైందని కృష్ణుడికి అర్థమైంది. దానికితోడు మునుల శాపం ఒకటుంది. యాదవ వంశంలో ఒకరోజు ముసలం (రోకలి) పుట్టి, ఆ వెంటనే పరస్పర హననంతో అందరూ అంతరిస్తారని వారు శపించారు. అదీ పని చేయడం మొదలైంది. చేయగలిగిందేమీ లేదు. కృష్ణుడు కళ్లు మూసుకున్నాడు. యాదవ వంశ వినాశనం జరిగిపోయింది. ఇది మహాభారతంలోని పదహారవ పర్వమైన మౌసల పర్వం కథా సంగ్రహం.

రాజకీయాల్లో ఎన్నడూ కననీ, విననీ విడ్డూరాలూ, చోద్యాలు తెలుగుదేశం పార్టీలో జరిగిపోతున్నాయి. ఎన్నికలకు ముందే ఈ పరిణామం మొదలైంది. ఇప్పుడు పీక్స్‌కు చేరుతోంది. లేకపోతే, ఒక పార్టీ అధ్యక్షుడై వుండి, తనకు నమ్మిన బంట్ల వంటి నాయకులను స్వయంగా బొట్టుపెట్టి మరీ బీజేపీలోకి చేర్చడమేమిటి? మరో రెండు మూడు బ్యాచ్‌లకు కూడా బొట్టుపెట్టడానికి ఏర్పాట్లు చేయడమేమిటి? అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతున్న తీరు కూడా వింత గొలుపుతోంది. అక్రమ నిర్మాణంలో నివాసముంటున్నారని అధికారపక్షం గౌరవ ప్రతిపక్ష నేతను అధిక్షేపించింది. అందుకాయన ‘లేదు, లేదు, కృష్ణానదే నా ఇంటిని దురాక్రమణ చేసింద’ని ఎదురుదాడికి దిగారు. అక్కడ ప్రకాశం బ్యారేజీ కట్టడం వలన ప్రవాహం ఆగిపోయి తన ఇంటి మీదకు వరదొచ్చిందనేది ఆయన కవి హృదయ సారాంశం. కానీ, చంద్రబాబు గారికి నాలుగేళ్ల వయసున్నప్పుడు (1954) బ్యారేజీ శంకుస్థాపన జరిగింది. ఏడేళ్ల ప్రాయంలో (1957) ప్రారంభోత్సవం కూడా జరిగింది. అప్పటికే అక్కడ ఇప్పుడున్న ప్యాలెస్‌ వుండి వుంటే, కృష్ణానది దొంగతనంగా వారి పెరట్లోకి ప్రవేశించిందన్న అభియోగాన్ని తర్కం కోసమైనా పరిశీలించవచ్చు. పిచ్చి ముదిరిందీ అంటే రోకలి తలకు చుట్టమనే ఈ వైఖరితో తెలుగుదేశం నేతలూ, ఎమ్మెల్యేలూ లబలబలాడిపోతున్నారని సమాచారం.

చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్‌ ఒప్పందాల్లో భారీ స్కామే దాగుందని అధికారపక్షం చేసిన ఆరోపణపై చంద్రబాబు వ్యవహరించిన తీరుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తల్లడిల్లిపోతున్నారు. అధికారపక్షాన్ని అనవసరంగా రెచ్చగొట్టి మరీ దెబ్బలు తింటున్నాడు మా నాయకుడని వారు ప్రైవేటు శోకాలు పెడుతున్నారు. తప్పు చేసినప్పుడు తేలు కుట్టినవాడిలాగా కూర్చుంటే సరిపోయేది. తగుదునమ్మా అని అసెంబ్లీ అయిన తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడటాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. దాని ఫలితంగా మరుసటిరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చి గణాంకాలతో సహా స్కామ్‌ను నిరూపించిన తీరు సామాన్య జనంలోకి కూడా సూటిగా వెళ్లిపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఈ గణాంకాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘‘మిగులు విద్యుత్‌ ఉన్నా కూడా అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసేలా చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనివల్ల ఏటా 2,766 కోట్ల భారం పడుతుంది. ఈ ఒప్పందాల గడువు 25 సంవత్సరాలు. అంటే 2,766 x 25 = 69,150 కోట్లు. రానురాను విద్యుత్‌ ఛార్జీలు తగ్గుతాయని చంద్ర బాబు స్వయంగా చెప్పారు. అంటే రాష్ట్ర ఖజానాకు మరింత భారం. మొత్తంగా 70 వేల కోట్లను దాటిన భారీ కుంభకోణం ఇది’’ – ఏదో ఒక గ్రూప్‌ ద్వారా ఈ వివరాలు అందని స్మార్ట్‌ఫోన్‌ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటి కూడా ఉండకపోవచ్చు. చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడుతూ అసలు విషయం చెప్పకుండా సెల్‌ఫోన్‌ ఛార్జీలు తగ్గించింది తానేననీ, విద్యుత్‌ సంస్కరణలు మొదలుపెట్టిందీ తానేనని అందుకోవడంతో టీవీల్లో అసెంబ్లీ చూస్తున్న చాలా మంది జడుసుకున్నారట. ఇక చార్మినార్‌ కట్టింది కూడా తానేననీ, గోల్కొండ కోట తనదేనని అంటారని ఊహించారు. లక్కీగా అక్కడిదాకా పోలేదు. విత్తనాలు, పోలవరం, కాపుల సమస్యలలోనూ అసెంబ్లీలో ఎదురుదెబ్బలే. తనువంతా గాయాలే.

ఎందుకిలా జరుగుతున్నది. ఎన్టీఆర్‌ శాపం ఇప్పుడు ప్రభావం చూపెడుతున్నదా? ఏమో... తెలుగుదేశం నేతల కైతే కారణాలు అంతుబట్టడం లేదు. అంతుచిక్కించుకునే పరిస్థితిలో చంద్రబాబు లేరు. ఐదేళ్ల కాలంలో తాము చేసిన అవినీతి నభూతో నభవిష్యతి అని తన అంతరాత్మే చెబుతోంది. వీటిమీద విచారణలు జరిగితే తన పరిస్థితి ఏమిటి? బయటపడే మార్గం ఎలా? బీజేపీతో సయోధ్యకు మళ్లీ దారి దొరుకుతుందా... ఇవే ఆలోచనలు. పూర్వం చక్రవర్తుల కటాక్ష వీక్షణాలకోసం సామంతులూ దండనాయకులూ యధాశక్తి కానుకలు పంపించేవారు. ఆ తరువాత అసలు కథ నడిపేవారు. ఈ కానుకలలో రాజ్యభాగాలు, రమణులు, గుర్రాలు, ఏనుగులు, గోవులు, బ్రాహ్మణులు, ధనకనకవస్తు వాహనాదులుండేవి. కాలక్రమంలో కానుకల్లో కొన్ని మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు కూడా మోదీ కొలువుకు ముందుగా కొన్ని ‘గుర్రాలను’ పంపించారు. వాటితోపాటు ఒక తెల్లజెండాను కూడా పంపించారు. ఢిల్లీ పెద్దల స్పందనకోసం ఎదురుచూస్తున్నారు.

బీజేపీ పెద్దలకు తెలుగుదేశం కథ అర్థమైంది. ఆ పార్టీకి ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గరపడిందన్న నిర్ధారణకు వచ్చేశారు. అందుకు సహేతుకమైన కారణాలున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్మించుకున్న కోట కింద భూగర్భంలోని టెక్టానిక్‌ ప్లేట్ల అమరికల్లో జరుగుతున్న మార్పులు నాగపూర్‌ ఆరెస్సెస్‌ కేంద్రంలోని రెక్టర్‌ స్కేల్‌పై నమోదవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యాభై శాతం ఓట్‌ షేర్‌తో రికార్డు సృష్టించింది. ఇంతకాలం టీడీపీకి ప్రధాన వోటు బ్యాంక్‌గా వున్న బీసీ వర్గాల్లో నిట్టనిలువునా చీలిక వచ్చి మొగ్గు వైసీపీవైపు తూగింది. వై.ఎస్‌. జగన్‌కు వున్న వ్యక్తిగత విశ్వసనీయత కారణంగా ఆయన ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను బీసీ విద్యాధికులు సంపూర్ణంగా నమ్మారు. ఫలితంగా వైసీపీకే ఈసారి కొంత ఆధిక్యత లభించింది.

బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వంటి వర్గాల్లోనూ గతంతో పోలిస్తే కొంత మెరుగైన స్థాయిలో ఆ పార్టీ మద్దతు రాబట్టగలిగింది. సంప్రదాయ ఓటు బ్యాంకును చెక్కుచెదరకుండా నిలబెట్టుకోవడం వలన ఈ కొద్దిపాటి అదనపు మద్దతుతోనే వైసీపీ కళ్లు చెదిరే విజయాన్ని నమోదు చేయగలిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వై.ఎస్‌. జగన్‌ చూపుతున్న రాజకీయ పరిణతి, ఇచ్చిన హామీలను శర వేగంగా అమలుచేయడం కోసం తొలి సమావేశాల్లోనే వాటికి చట్టబద్ధత కల్పించడం, ఏ స్థాయిలో అవినీతి జరిగినా సహించబోమని దృఢంగా పంపించిన సంకేతాలు, విచ్చలవిడి మద్యపానంపై మోపిన ఉక్కుపాదం, ప్రజాధనం పైసా కూడా వృథా కాకూడదని పడుతున్న తపన– అందుకోసం అవినీతి ప్రాజెక్టులను సమీక్షించి రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధపడడం వంటి చర్యల ఫలితంగా కుల, మత, వర్గాలకతీతంగా వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల్లో మద్దతు పెరిగింది. నవరత్న పథకాలు పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత ఆయన బలం మరింత పెరుగుతుందన్న అంచనాల్లో బీజేపీ వర్గాలున్నట్టు సమాచారం.

నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకూ, స్త్రీలకూ 50 శాతం వాటా కేటాయించడం కూడా తీవ్రంగా ప్రభావం చూపే అంశమేననీ, ఈ పరిణామం తర్వాత బీసీ వర్గాల్లో తెలుగు దేశం మద్దతు నామమాత్రం కానున్నదని కాషాయం పెద్దల అంచనా. ఇప్పటివరకూ బీసీలతోపాటు పట్టణ ఉన్నత మధ్యతరగతి వర్గాల్లో టీడీపీకి ఆదరణ వుంది. మీడియా ప్రచారం కారణంగా, సెల్‌ఫోన్‌ను కనిపెట్టడం, హైటెక్‌ సిటీని నిర్మించడం వంటి గోబెల్స్‌ ప్రచారాల కారణంగా ఈ సెక్షన్‌లో టీడీపీ పాగా వేయగలిగింది. పబ్లిసిటీ స్టంట్‌లో చంద్రబాబుకు బీజేపీ ఏమాత్రం తీసిపోదు. టన్నులకొద్దీ దేశభక్తిని సోషల్‌ మీడి యాలో డంప్‌ చేయగల శక్తి బీజేపీకి వుంది. ఈ వ్యూహంతో ఆంధ్రప్రదేశ్‌ పట్టణ మధ్యతరగతిని టీడీపీ నుంచి తమ వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని బీజేపీ భావిస్తున్నది. బీసీ ఓట్లను వైసీపీ తీసుకుని, పట్టణ మధ్య తరగతిని తాము లాగేసుకుంటే ఇక తెలుగుదేశం పరిస్థితి రెక్కలు తెగిన పక్షిలాంటి దేని కాషాయ శిబిరం భావిస్తున్నట్టుంది.

ఈ కోణం నుంచే ఆలోచించి తెలుగుదేశంతో ఎటువంటి సంబంధాలను నెలకొల్పుకోవాలన్నది బీజేపీ నిర్ణయించుకుంటుంది. తెలుగుదేశం పార్టీని నిశ్శేషం చేసి, ఆ స్థానంలో ప్రవేశించడమా? లేక అవశేషమాత్రంగా మిగిల్చి జూనియర్‌ పార్ట్‌నర్‌గా చేసుకోవడమా? అనేది బీజేపీ చాయిస్‌గానే వుంటుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఆకాంక్షల మేరకు ఉండకపోవచ్చు. తమపై ఎటువంటి కేసులూ రాకుండా కాపాడి ఎన్డీఏలో చేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ లాబీయింగ్‌ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ అగ్రనాయకుడు రామ్‌మాధవ్‌ చేసిన ఒక వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హమైనది. ఇక మీదట తెలుగుదేశం పార్టీ ‘తానా’ సభల్లో మాత్రమే మిగులుతుందని ఆయన కామెంట్‌ చేశారు. దానర్థం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోబోతోందనే. అమెరికా, కెనడాల్లో స్థిరపడ్డ తెలుగు వారి కోసం ఏర్పడిన సాంస్కృతిక సంస్థ ‘తానా’. అది రానురాను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులతో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీతో ఏర్పరచుకున్న ‘గాఢ’మైన అనురక్తితో ‘తానా’లో ఒక కెమిస్ట్రీ ఏర్పడింది. ఆ ‘కెమిస్ట్రీ’ ల్యాబ్‌లోని హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వెలువరించే కుళ్లిన కోడిగుడ్ల వాసనకు తానా సభలకు వెళ్లిన రామ్‌మాధవ్‌కు తల తిరిగినంతపనైంది.


వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top