వాణిజ్య బంధంతో ముందడుగు!

US Ambassador to India Kenneth I Juster writes on trade bonding - Sakshi

ఆవిష్కరణలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే కీలకమైన, సానుకూల ప్రభావం ఎలాంటిదో హైదరాబాద్‌లో ఈ మధ్యే జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం చూశాం. భారత్‌ మార్కెట్‌ను అమెరికా వ్యాపార, వాణిజ్యం కోసం విస్తరించడం వల్ల మన రెండు ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగే అధునాతన సాంకేతికతలను అందిపుచ్చుకోవచ్చు. అమెరికన్‌ సంస్థల వద్ద ఉన్న వినూత్న సాంకేతికతలు భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 స్మార్ట్‌ నగరాల ప్రాజెక్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

అమెరికా– భారత్‌ మధ్య భాగస్వామ్యం అన్ని అంతర్జాతీయ వ్యవహారాల మాదిరిగానే పరిణామాత్మకమైంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మన దేశాలను పటిష్టం చేయడంతో పాటు ఇండో–పసిఫిక్‌ ప్రాంతంపై ప్రయోజనకరమైన ప్రభావం చూపుతుంది. గత పదిహేడు సంవత్సరాల కాలంలో మన దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది వేశాం. ఇది ఈ 21వ శతాబ్దంలో మాత్రమే కాదు, తదనంతర కాలంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ బలమైన పునాదిపై మరింత నిర్మాణం చేయాల్సి ఉంది. మనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి ఈ ప్రాంత సుస్థిర నిర్మాణం కోసం కృషి చేయాలి.

అమెరికా – భారత్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా మలచాల్సిన అవసరం ఉంది. మనందరి ప్రయోజనం కోసం స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన ప్రాంతంగా ఇండో–పసిఫిక్‌ ప్రాంతం ఉండాలనే అమెరికా దీర్ఘకాలిక నిబద్ధత వలన ఈ ప్రాంతంలో సుస్థిరత ఏర్పడి, గణనీయ స్థాయిలో వాణిజ్య ఎదుగుదలకు దోహదపడుతుంది.

మనందరి భవిష్యత్తు ఇండో–పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధితో విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నందువల్ల ఈ ప్రాంత స్థిరత్వానికి అమెరికా కట్టుబడి ఉంది. అంతర్జాతీయంగా అందరికీ వర్తించే నియమాలకు మనందరం కట్టుబడుతున్నాము. ఒక దృఢమైన నమ్మకంతో భాగస్వాములుగా ఎదుగుతున్నాం. అమెరికా విదేశాంగమంత్రి టిల్లెర్‌ సన్‌ మాటల్లో చెప్పాలంటే, అవ్యవస్థత, సంఘర్షణ, దోపిడీ ఆర్థిక విధానాల స్థానంలో ఇండో–పసిఫిక్‌ ప్రాంతాన్ని ఒక శాంతియుతమైన, సుస్థిరమైన, సంపద్వంతమైన ప్రాంతంగా ఎదిగించేందుకు, ఒక ప్రాంతీయ నిర్మాణ చట్రంపై భావసారూప్యం కలిగిన దేశాలన్నీ కృషి చేయడంలో భాగంగా ఈ ప్రాంత వాణిజ్యంలో భారత్‌ నాయకత్వాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం.

రక్షణ రంగంలో పూర్తి సహకారం
రక్షణ, ఉగ్రవాద నిరోధంపై మన దేశాల మధ్య సహకారం అతి ముఖ్యమైనది. అమెరికా రక్షణ సంస్థలు ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టి అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థల కోసం విడిభాగాలు తయారు చేస్తున్నాయి. దేశీయంగా రక్షణ సామర్థ్యాలు పెంచుకునేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు మేము మద్దతునిస్తాం. ప్రధాన రక్షణ భాగస్వాములుగా, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన రెండు దేశాల సేనల సామర్థ్యాన్ని పరస్పర సహకారంతో వినియోగించుకోవడాన్ని మరిం తగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తాం.

మన రక్షణ రంగ భాగస్వామ్యం లాగానే మన దేశాల మధ్య ఉన్న వాణిజ్య భాగస్వామ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారం చేసేందుకు ఉన్న అడ్డంకుల గురించి అనేక అమెరికన్‌ సంస్థలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలు తగ్గించుకుంటే, మరికొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాయి. ఇండియా ఈ వ్యూహాత్మక అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికన్‌ సంస్థల పెట్టుబడులు, వాణిజ్యానికి ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదగాలి.

స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యం అనేవి ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న భారత్‌ దీర్ఘకాలిక వృద్ధికి ఉపయోగపడుతాయి. మోదీ ప్రకటించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతి పాదించిన ‘అమెరికా ఫస్ట్‌’ అనేవి పరస్పరం విరుద్ధమైనవి కావు. పైగా, రెండు దేశాలు ఇతర మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన మన వ్యాపార సంబంధాలు పెరగడంతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో సహకారం, ఉద్యోగాల కల్పనలో పరస్పరం సహకరించుకోవచ్చు.

ప్రధాని నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణ ప్రక్రియల వలన భారత్‌ ఒక సమర్థవంతమైన, పారదర్శక మార్కెట్‌గా అవతరిస్తోంది. ఈ సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ వల్ల భారతీయ వస్తువులు ప్రపంచ విపణిలో మరింత విస్తృతంగా దొరుకుతాయి. ఇది మరిన్ని ఉద్యోగాల కల్ప నకు దారి తీస్తుంది.

స్మార్ట్‌ నగరాలకు సాంకేతిక సొబగులు
మన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం వల్ల, భారత్‌ ఒక ప్రాంతీయ కేంద్రంగా అవతరించడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఆవిష్కరణలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే కీలకమైన, సానుకూల ప్రభావం ఎలాం టిదో హైదరాబాద్‌లో ఈ మధ్యే జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో మనం చూశాం. వ్యవస్థాపకత, ఆవిష్కరణ రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉంటోంది. టెక్నాలజీ రంగంలో అమెరికా ఇప్పటికే భారత్‌తో విస్తృతమైన సంబంధాలు ఏర్పరచుకుంది.

భారత్‌ మార్కెట్‌ను అమెరికా వ్యాపార, వాణిజ్యం కోసం విస్తరించడం వల్ల మన రెండు ఆర్థిక వ్యవస్థలను కాపాడగలిగే అధునాతన సాంకేతికతలను– ప్రత్యేకించి ఆధునిక తయారీ, సైబర్‌ భద్రతా రంగాల్లో అందిపుచ్చుకోవచ్చు. పెరిగిన అమెరికా వాణిజ్యం, పెట్టుబడుల వల్ల మరిన్ని పెట్టుబడులు, మేధో జ్ఞాన రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతుంది. సాంకేతికతలో వస్తున్న వేగవంతమైన మార్పులను అందిపుచ్చుకోవడానికి దేశాల మధ్య ప్రతిబంధకాలు లేని వ్యాపార, డేటా ప్రవాహం ఉండాలి.

అమెరికాలో తయారయ్యే వస్తువులను భారత్‌లో మరింతగా అందుబాటులోకి తీసుకురావడం, అమెరికన్‌ సంస్థల ఉనికి దేశంలో మరింత విస్తరించడం వల్ల ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి. వీటి వల్ల మౌలిక వసతులు, కనెక్టివిటీ కూడా మెరుగవుతాయి. ఉదాహరణకి అమెరికన్‌ సంస్థల వద్ద ఉన్న వినూత్న సాంకేతికతలు భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 స్మార్ట్‌ నగరాల ప్రాజెక్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ముడి చమురు నుంచి ఇంధన భద్రతదాకా..
ఇంధన రంగంలో కూడా మన దేశాలు సహకరించుకోవచ్చు. భారత్‌–అమెరికా ఒక సమగ్రమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోగలవు. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణు విద్యుత్‌ వంటి అన్ని రకాల ఇంధన సంబంధిత రంగాల్లో సహకరించుకోవచ్చు. అంతేకాకుండా శిలాజ ఇంధనాలు, స్మార్ట్‌ గ్రిడ్లు, ఇంధన నిల్వలు, పునరుత్పాదక వనరులు వంటి వాటికి సంబంధించి టెక్నాలజీ విషయంలో కూడా సహకరించుకోవచ్చు.

గత సంవత్సరం  అమెరికా తొలి ముడి చమురును భారత్‌కి ఎగుమతి చేసింది. దేశీయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకుని, ఇంధన భద్రతను పెంపొందించుకోవడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు అవసరమైన మద్దతు సేవలు, మౌలిక వసతులు, సాంకేతిక జ్ఞానాన్ని అందించడంలో కూడా అమెరికా తన సహాయం తప్పకుండా అందించగలదు.

భారత్‌– అమెరికా వ్యాపార సంబంధాలు మరింత బలపడడం వల్ల ఇండియా పట్ల, ఇండో–పసిఫిక్‌ ప్రాంతం పట్ల అమెరికా మరింత దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉంటుంది. దీని వల్ల మన రక్షణ, ఉగ్రవాద నిరోధక భాగస్వామ్యం మరింత బలపడుతుంది. మన విధానాల్లో ఏమైనా తేడాలుంటే చక్కదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది.

నిరంతరం మారుతూ ఉండే ఈ కల్లోల ప్రపంచంలో భారత్‌–అమెరికా దేశాల భాగస్వామ్యం స్థిరమైనది. స్వాతంత్య్రం, సార్వభౌమత్వం మన రెండు దేశాలకు ఎంతో విలువైనవి. పరస్పర భాగస్వామ్యంతో మనం ముందుకెళితే అది ప్రపంచంపై అనుకూల ప్రభావం కూడా చూపుతుంది. మన ప్రజానీకం భద్రత, శ్రేయస్సు గురించిన ఆకాంక్షలు కూడా నెరవేరతాయి.


- కెన్నెత్‌ ఐ. జస్టర్‌

వ్యాసకర్త భారత్‌లో అమెరికా రాయబారి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top