ముగిసిన ఓ మహా శకం

Ts Sudhir Guest Columns On Karunanidhi History - Sakshi

కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. 94 ఏళ్ల కవి, రాజకీయనేత మరణవార్త ప్రకటించగానే నిశ్శబ్దం తాండవమాడింది. ఈ కాలంలో వాస్తవ జీవితంలో కన్నా భారీగా కనిపించిన ముగ్గురు బడా తమిళ నేతలు తమ విలక్షణ శైలితో రాజకీయాలను శాసించారు. అయితే, వారి రాజకీయాలు తక్కువ వైషమ్యా లతో నడిస్తే బావుండేదని అనిపిస్తుంది. మెరీనాలో మాజీ ముఖ్యమంత్రులు సీఎన్‌ అణ్ణాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుగ నున్నాయి. తమిళనాడును తీర్చిదిద్దిన నేతలకు ఇలా మెరీనాలో సమాధులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కృతజత్ఞలు తెలిపే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

‘ఇళందు వా తలైవా ఇళందు వా’ (నాయ కుడా లేవండి, బయటకు రండి!). గత పది రోజులుగా చెన్నై కావేరీ ఆస్పత్రి వెలుపల ఉద్వే గపూరితంగా పిలిచిన మాటలివి. తమ నాయకుడిని మరి కొన్నేళ్లు బతికేలా చూడాలంటూ జనం దేవుణ్ని ప్రార్థించారు. కర్పూరం వెలిగిం చారు. జగమెరిగిన నాస్తికుడైన ముత్తువేల్‌ కరుణానిధి కోసం ఇలా అభి మానులు చేయడం విశేషమే. మంగళవారం నాయంత్రం 6.10 గంట లకు కరుణానిధి కన్నుమూశారు. 94 ఏళ్ల కవి, రాజకీయ నేత మరణ వార్త ప్రకటించగానే నిశ్శబ్దం తాండవమాడింది. ఇదేమీ ఊహించనిది కాదు. కరుణ ఆరోగ్యస్థితిపై ముందు రోజు ఆస్పత్రి విడుదల చేసిన ప్రక టనలో ఆయన ఏ క్షణంలోనైనా కన్నుమూయవచ్చనే విషయం వెల్లడిం చారు.

జయలలిత 2016 డిసెంబర్‌లో మరణించడానికి కొన్ని రోజులు ముందు కరుణ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎం.జి.రామచంద్రన్‌తో స్నేహం శత్రుత్వంగా మారడం, తర్వాత జయలలితతో బద్ధవైరం ఆయన రాజకీయ జీవితంలో కొట్టొచ్చి నట్టు కనిపించే విషయాలు. ఏడాదిన్నరగా కరుణానిధి ఇంటికే పరిమిత య్యారు. రాజకీయాల్లో చురుకుగా లేరు. డీఎంకేను పూర్తిగా నడిపిస్తు న్నది ఆయన కొడుకు ఎంకే స్టాలినే. ఆయన గొప్ప సినీ రచయిత. కానీ, మలుపులు, మార్పులతో నిండిన తన కథను వాస్తవం కన్నా మెరుగ్గా రాయగలిగేవారు కాదేమో! 

‘రాజకుమారి’ సినీ జీవితం ఆరంభం!
ఓసారి ఆయన జీవితంలో వెనక్కి వెళ్లి 1947లో ఏం జరిగిందో చూద్దాం. ఎంజీఆర్‌ నటించిన తమిళ చిత్రం ‘రాజకుమారి’ కథ కరుణానిధి రాశారు. మూడేళ్ల తర్వాత ‘మంత్రి కుమారి’ కథా రచయితగా హీరో పాత్రకు ఎంజీఆర్‌ పేరును ఆయన సిఫార్సు చేశారు. ఈ రెండు సిని మాలూ సూపర్‌ హిట్టవడంతో సినీరంగంలో కరుణ, ఎంజీఆర్‌కు ఎదు రులేకుండా పోయింది. కరుణానిధి 75కు పైగా చిత్రాలకు రచయిత. అయితే, సినీరంగంలో తనతోపాటు ఎదిగిన ఎంజీఆర్‌ డీఎంకేకు ప్రధాన ప్రచారకునిగా తనను మించిపోతారని కరుణ అప్పట్లో ఊహించలేదు. దీంతో నిరాశకు గురైన కరుణ తమిళ చిత్రరంగంలో ఎంజీఆర్‌కు పోటీగా తన పెద్ద కొడుకు ముత్తును ప్రోత్సహించడానికి ప్రయత్నించారు. ఎంజీ ఆర్‌ను అనుకరించేలా చేయడానికి కూడా వెనుకాడలేదు.

కానీ, ఈ ప్రయత్నంలో ముత్తు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఎంజీఆర్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి కరుణ జీర్ణించుకోలేకపోయారు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి పోయాక ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించారు. తన కృషి ఫలితంగా ఏర్పడిన సినీ ఇమేజ్‌తో ఎంజీఆర్‌  రాజకీయంగా ముందుకు దూసుకుపోవడం కరుణానిధికి చికాకు పుట్టిం చింది. అణ్ణా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏడీఎంకే) అనే పేరుతో ఎంజీఆర్‌ పార్టీ పెట్టగానే, దాన్ని నడిగర్‌ కచ్చి అంటే నటుడి పార్టీ అని కరుణ పిలిచేవారు. ఎంజీఆర్‌ సినిమాలు, రాజకీయాలు ఒకటి కాదని చెబుతూ నటులు రాజకీయాలకు మంచిది కాదని ప్రచారం చేయడానికి పాటలు కూడా ఆయన రాశారు. ‘సినిమా సోరు పోడుమా’ (సినిమా కూడు పెడు తుందా?) అనే పాటల పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురించారు. 

ఎంజీఆర్‌ అభియోగాలతో కరుణ బర్తరఫ్‌
కరుణానిధిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంజీఆర్‌ ఆయన ప్రభు త్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ కేంద్రానికి మెమొరాండం సమర్పించారు. 1976 జనవరిలో డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్‌ చేసి, ఆరోపణలపై దర్యాప్తునకు జస్టిస్‌ సర్కారియా కమిషన్‌ నియమిం చింది. 1976–89 మధ్యకాలం కరుణానిధికి నిజంగా కష్టకాలం. అధి కారం లేకుండా డీఎంకేపై తన పట్టు సడలకుండా, పార్టీ కార్యకర్తలు నిస్పృహకు లోనుకాకుండా ఆయన పట్టుదలతో కృషిచేశారు. అయితే, కరుణానిధిని ఊపిరి సలపనీయకుండా చేశారు ఎంజీఆర్‌. 1984లో కరుణ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక, శాసనమండలి రద్దుకు ఎంజీఆర్‌ తమి ళనాడు అసెంబ్లీలో తీర్మానం చేయించారు.

పైకి ‘మండలి’ వల్ల అనవ సర ఖర్చని చెప్పినాగాని, కరుణకు మాట్లాడటానికి వేదిక లేకుండా చేయ డమే ఎంజీఆర్‌ ఉద్దేశమని డీఎంకే భావించింది. ఎన్నికల విజయాల విషయానికి వస్తే, దేశంలో కరుణే అగ్రస్థానంలో నిలబడతారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమేగాక 1957 నుంచి 13 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక్క 1984లోనే ఆయన పోటీచేయలేదు. అయితే, రాజకీయాల్లో తనకంటే జూనియర్లయిన ఇద్దరు తనను పదవి నుంచి తొలగించగలగడం కరుణానిధిని బాధించింది. 1976లో తనను బర్తరఫ్‌ చేశాక ఎంజీఆర్‌ బతికున్నంత వరకూ ఆయన మళ్లీ ముఖ్య మంత్రి కాలేకపోయారు. 1987లో ఎంజీఆర్‌ కన్నుమూశాకే కరుణకు మళ్లీ అధికారం దక్కింది. అలాగే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత రెండోసారి వరుస విజయం సాధించి కరుణానిధిని చివరిసారి సీఎం కాకుండా అడ్డుకున్నారు. 

జయలలితపై వ్యక్తిగత విమర్శలు 
జయలలిత రాజకీయాల్లోకి రాగానే డీఎంకే ఆమెపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడింది. 1982లో కడలూరులో జరిగిన ఏడీఎంకే మహాసభలో జయ తొలి రాజకీయ ప్రసంగం వినడానికి ఊరు ఊర ంతా తరలివచ్చిందని జయలలిత జీవిత చరిత్ర రాసిన వాసంతి పేర్కొన్నారు. ‘జనం అందమైన ముఖాన్ని చూడటానికి వచ్చారుగాని నిప్పులు చెరుగుతూ చేసిన జయ ఉపన్యాసం విన్నారు’ అని వాసంతి రాశారు. డీఎంకే పార్టీ దినపత్రికలో మాత్రం జయ రాజకీయప్రవేశాన్ని ‘కడలూర్‌ కేబరే’ అని ఎగతాళి చేసింది.

1989లో తమిళనాడు అసెంబ్లీ లోపల జరిగిన అవమా నకరమైన సంఘటన వారిద్దరి మధ్య సంబంధాలను శాశ్వతంగా క్షీణిం చేలా చేసింది. పాలకపక్షమైన డీఎంకే తన ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తోందని జయ ఆరోపించారు. వెంటనే సీఎం పదవిలో ఉన్న కరుణానిధి ఆమె నుద్దేశించి చేసిన అసభ్య వ్యాఖ్య ఆమెకు ఆగ్రహం తెప్పించింది. తర్వాత కరుణ మాటలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం సభలో జరిగిన గందరగోళంలో డీఎంకే నేత దురైమురుగన్‌ జయ చీర లాగ డానికి ప్రయత్నించారు. మరుసటి ఎన్నికల్లో విజయం సాధించే వరకూ అసెంబ్లీలోకి అడుగుపెట్టనని ఆగ్రహంతో జయలలిత శపథం చేశారు. పురుషాధిక్యాన్ని అణచివేస్తానని కూడా చెప్పారు.

1991లో డీఎంకేకు ఘోర పరాజయం!
1991లో కరుణానిధికి గడ్డుకాలం మొదలైంది. అప్పటి ఎన్నికల్లో 225 సీట్లతో జయలలిత ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగుబెట్టారు. డీఎంకే నాయకత్వంలోని కూటమికి దక్కింది ఏడు సీట్లే. ఏడీఎంకే కూటమికి 59.8 శాతం ఓట్లు రాగా, డీఎంకే కూటమికి లభించినవి 30 శాతమే. దీంతో అసెంబ్లీకి హాజరయ్యేకంటే శాసనసభ్యత్వానికి రాజీ నామా చేయడం మేలని భావించి కరుణ ఆ పని చేశారు. 1989లో జయపై జరిగిన దాడికి ప్రతీకారంగా అసెంబ్లీలో తనపై ఏఐఏడీఎంకే దాడిచేయవచ్చనే అనుమానంతో కరుణ అసెంబ్లీకి రాజీనామా చేశారని అప్పటి ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతారు. ఇద్దరు నేతల మధ్య వైరం అంతటితో ఆగలేదు. 1990ల చివర్లో అవినీతి ఆరోపణలపై జయ లలితను కరుణానిధి ప్రభుత్వం అరెస్ట్‌ చేయించింది.

తర్వాత అధికా రంలోకి వచ్చిన జయలలిత 2001లో ఫ్లైఓవర్‌ కేసులో అర్ధరాత్రి కరు ణానిధిని అరెస్ట్‌ చేయించి పగ తీర్చుకున్నారు. ఇలా పగ, ప్రతీకారాలతో వారి రాజకీయాలు విద్వేషపూరితంగా మారాయి. వారిద్దరి మధ్య రాజ కీయ శత్రుత్వానికి ముగింపు లేకుండా పోయింది. పదిహేనేళ్ల తర్వాత కూడా కరుణానిధి కుటుంబంపై జయ కోపం తగ్గలేదు. 2016లో ముఖ్య మంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ కార్యక్రమా నికి డీఎంకే తరఫున హాజరైన కరుణానిధి కొడుకు ఎం.కె.స్టాలిన్‌కు ముందు వరుసలో కూర్చునే అవకాశం ఆమె ఇవ్వలేదు. వాస్తవానికి 89 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని డీఎంకే ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ జయ లలిత స్టాలిన్‌కు తగిన స్థానంలో కూర్చునే అవకాశం కల్పించలేదు. ఇది ‘ఉద్దేశపూరితంగా చేసిన అవమానం’ అంటూ కరుణ ఆగ్రహంతో, ‘‘జయలలిత మారలేదు. ఎప్పటికీ ఆమె మారదు,’’ అని దుయ్యబ ట్టారు. దీంతో స్టాలిన్‌ను అవమానించే ఉద్దేశం తనకు లేదని జయలలిత వివరణ ఇచ్చుకున్నారు. 

కరుణపై ఎంజీఆర్‌కు ప్రత్యేక అభిమానం!
పైకి బద్ధ రాజకీయ శత్రువులుగా కనిపించినా కరుణానిధిపై ఎంజీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని ఇద్దరితో సాన్నిహిత్యం ఉన్నవారు చెబు తారు. అందుకే కరుణానిధిని ఎవరైనా పేరు పెట్టి ప్రస్తావిస్తే వారిని ఎంజీఆర్‌ కోప్పడేవారని అంటారు. కరుణను ‘కళైంజ్ఞర్‌’ (కళాకారుడు) అని పిలవాలని ఎంజీఆర్‌ గట్టిగా చెప్పేవారు. ఎంజీఆర్‌ మరణించిన ప్పుడు ఆయన నివాసానికి మొదట వెళ్లింది కరుణానిధే కావడం విశేషం. కరుణ ఓదార్చలేని స్థాయిలో కన్నీరు కారుస్తూ విలపించారు. సముద్ర తీరంలోని మెరీనాలో మాజీ ముఖ్యమంత్రులు సీఎన్‌ అణ్ణాదురై, ఎంజీ ఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుగు తాయని చెప్పారు.

తమిళనాడు భవిష్యత్తును తీర్చిదిద్దిన నేతలకు ఇలా మెరీనాలో  సమాధులు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కృతజత్ఞలు తెలిపే సంప్రదాయం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఓ శకానికి తెరపడింది. ఈ కాలంలో వాస్తవ జీవితంలో కన్నా భారీగా కనిపించిన ముగ్గురు బడా తమిళ నేతలు తమ విలక్షణ శైలితో రాజకీయాలను శాసించారు. అయితే, వారి రాజకీయాలు తక్కువ వైషమ్యాలతో నడిస్తే బావుండేదని మాత్రం మనకు అనిపిస్తుంది.


వ్యాసకర్త : టీఎస్‌ సుధీర్‌, సీనియర్‌ జర్నలిస్టు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top