కేంద్ర బడ్జెట్‌ నిండా హంసపాదులే

SriRamana Special Article On Central Budget - Sakshi

అక్షర తూణీరం

ప్రతిదానికి సహేతుకమైన కారణం ఉండి తీరుతుందని హేతువాదులు బల్లగుద్ది వాదిస్తారు. అత్తిపత్తిని తాకితే ముట్టవద్దన్నట్టు ముడుచుకుపోతుంది. అది దాని జీవలక్షణం. ఆ మర్మం తెలియనివారిని దైవ మహిమగా చిత్రించి దగా చేయకూడదు. కొన్నిసార్లు దేశంలో ఏదో మూల ఒక వేలం వెర్రిని పైకి లేపుతూ ఉంటారు. ఒకసారి వినాయకుడు పాలు తాగేస్తున్నాడని తమిళనాడులో సందడి లేచింది. అంతా ఇంతా సందడి కాదు. చెంచాలతో పాలు అందిస్తుంటే పిళ్లయ్యార్‌ ఆబగా పీల్చేయడం జనం కళ్లారా చూశారు. మర్నాడు హేతువాదులు రంగంలోకి దిగారు. ఇది దైవ మహిమా కాదు, గోంగూరా కాదు. విగ్రహం అంటే రాయి. బయటి వాతావరణానికి అలిసిపోతుంది. దీన్నే ‘స్టోన్‌ ఫెతిగ్‌’ అంటారు. అలాంటి సందర్భాలలో శిలలు ద్రవాల్ని సేవిస్తాయని వారంతా నొక్కి వక్కాణించారు. ఆ వేలం వెర్రి రెండో రోజుకి చప్పగా చల్లారిపోయింది. దైవ భక్తులు ఈ చర్యని దేవుడి మహత్యంగానే ఇప్పటికీ నమ్ముతుంటారు. వినే వారుంటే హేతువాదులు శాస్త్రీయ కారణాలను వివరిస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇలాంటి వెర్రి వేషాలు ఉన్నట్టుండి కనిపిస్తూనే ఉంటాయి. 

మనలాంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల వేళ కూడా ఈ వేలంవెర్రి తలెత్తుతోందని మేధావి వర్గం మొత్తుకుంటూ ఉంటుంది. ‘ఇది కూడా ఒక మాస్‌ హిస్టీరియానే. ఆనాడు ఇందిరమ్మకి మూకుమ్మడిగా ఎందుకు ఓట్లు వేశారు? తర్వాత ఎందుకు మానేశారు. ఆ హిస్టీరియా అమలులో ఉన్నప్పుడు గడ్డిపరక సైతం బంపర్‌ మెజారిటీతో గెలి చేస్తుంది’ అంటూ ఆ వర్గం అధిక ప్రసంగం చేస్తుంది. మొదటిసారి మోదీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు కొందరు మాస్‌ హిస్టీరియా అంటూ ఆక్షేపించారు. తర్వాతసారి, మోదీ బోలెడు జన వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు. సోదిలోకి కూడా రాడని కొందరు ఆశావాదులు తెగ సంబరపడ్డారు. మిగిలిన అందరూ ఓ కట్టు మీద ఉండాలని కూడా తీర్మానించుకున్నారు. ఫలితాలు చూసి దిగ్భ్రమ చెందారు. మెషీన్లు చేసిన మోసమని కూడా సమాధానపడ్డారు. 

కానీ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు. నరేంద్రమోదీ మరింత వైభవమైన మెజారిటీతో పీఠం ఎక్కారు. పెండింగ్‌ బిల్లులన్నింటినీ గట్టున వేశారు. కశ్మీర్‌ వ్యవహారంలో గొప్ప సాహసం చేశారన్నారు. ఇదంతా, ఒక ఎత్తు. రెండోవైపు, ‘ఏవుందీ.. దేశం గుంట పూలు పూస్తోంది. ఎక్కడా పెరుగుదల లేదు. విదేశీ పాలసీలు సరిగ్గా లేవు. స్వదేశీ సిద్ధాంతాలు బాగా లేవు’ అని అంతా దుయ్యబడుతున్నారు. కొందరు ఛాందసవాదులు, ఇవన్నీ కాదు– ‘ఏది రామాల యం ఎక్కడ? రెండోసారి రామయ్య గెలిపించినా రామకార్యం చెయ్యకపోతే ఇహ ఇంతే సంగతులు’ అంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. మోదీ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించి, ఆచరించే నేత. రాముణ్ణి పూర్తిగా నమ్మినా రెండోసారి గెలుపుకి ఆయనే కారణమని పైత్యంగా రామమందిరం పనులకి పునాదులు తీసేంత భక్త శిఖామణి మాత్రం కాదు.

రెండోసారి పగ్గాలు పట్టి నాలుగు నెలలు అవుతోంది. ధరల విషయంలో సామాన్యుడు సంతృప్తిగా లేడు. బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ప్రతి పద్దుని తిరిగతోడి సమర్థించుకుంటూ వస్తున్నారు. ప్రతి ఖాతాలోనూ, కొత్తగా ఎరువులు గుమ్మరించి, మందులు చిలకరిస్తున్నారు. అంతా ఉద్దీపకాలతోనే అన్నీ నడుస్తున్నాయ్‌. కేబినెట్‌లో కొందరికి స్వేచ్ఛగా ఊపిరాడుతోందని, ఇంకొందరికి ఉక్కపోస్తోందని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. మోదీకి పార్టీ విస్తరణ కాంక్ష తప్ప వేరే కాంక్ష లేదంటున్నారు. ఏమైనా కాస్త తూకం తప్పుతున్నట్టుంది. జాగ్రత్తపడితే మంచిది.

శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top