భూగోళానికే మడి వస్త్రం చుట్టిన కరోనా

Sriramana Article On Coronavirus - Sakshi

ఇన్నాల్టికి ఒక ఆశావహమైన చిన్న వ్యాసం (16.5.2020 సాక్షి డైలీలో) వచ్చింది. తెలుగువాళ్లు పసుపు, నిమ్మకాయ, లవంగం, వెల్లుల్లి, ఎక్కువగా నిత్యం వాడతారు. ఇదే శ్రీరామరక్ష అని నెల్లూరు డాక్టర్‌గారు భరోసా ఇస్తున్నారు.పూర్వం మన పెద్దవాళ్లు ఒక బలవర్ధకమైన రుచికరమైన ఆహారం చేసి పెట్టేవారు. రాత్రిపూట కావల్సినంత అన్నంలో పాలుపోసి బాగా మరిగించి, తగిన వేడికి చల్లార్చి దాన్ని తోడు పెట్టేవారు. తెల్లారి పొద్దునకది అన్నంతో కలిసి తోడుకునేది. అందులో నీరుల్లిపాయ ముక్కలు, పది మిరియపు గింజలు వేసేవారు. తినేటప్పుడు ఆ పెరుగు తోడులో కాసిని నీళ్లు, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, శొంఠి పొడి కలుపుకునేవారు. ఇవన్నీ ఒకనాటి మన సంప్రదాయాలు. గ్లోబలైజేషన్‌ నిషాలో అన్నింటినీ వదిలేశాం. ఇప్పుడు అన్నింటినీ తల్చుకుని, నాలిక కరుచుకుంటున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలకు లేదుగానీ గోదావరి జిల్లాలకు ‘తరవాణి కుండ’ బాగా అలవాటు. మరీ ముఖ్యంగా వేసవికాలం రాగానే ఈ కుండని ఓ మూల ప్రతిష్ట చేస్తారు. కుండలో అన్నం, నీళ్లు వేసి పులియబెడతారు. దాంట్లో వేయాల్సిన దినుసులు వేస్తారు. పుల్లపుల్లగా ఉండే నిమ్మ, దబ్బ ఆకులు ముఖ్య దినుసు. ఇంకా సైంధవ లవణం లాంటివి కొన్ని ఉండేవి. ఆ కుండలో నీళ్లు పర్మింటేషన్‌తో ఒక రకమైన పుల్లని రుచితో మారేవి. ఇంటిల్లిపాదీ తరవాణి నీళ్లని తాగేవారు. దీంట్లోని బలవర్ధకాల గురించి తెలియదుగానీ, ఇది మంచి జఠరాగ్ని కలిగిస్తుందని చెప్పేవారు. అయితే ఇది శ్రోత్రీయ కుటుంబాలలో కనిపించేది కాదు. ఇందులో అన్నం పులియబెట్టడం లాంటి ప్రాసెస్‌ ఉండేది కాబట్టి అన్నం అంటు, ఎంగిలి కాబట్టి కొంత అన్‌హైజనిక్‌ అనీ దూరం పెట్టి ఉంటారు. కానీ తరవాణిలో ఉన్న గుణదోషాలను ఎవరూ చెప్పరు. నాడు మోహిని అమృతం పంచాక తెలుగుజాతికి దీన్ని కానుకగా ఇచ్చిందని ఐతిహ్యం. గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇది ఉంది. 
పూర్వం మన పెరటి దొడ్లలో కరివేప, నిమ్మ, దబ్బ, అరటి చెట్లు విధిగా ఉండేవి. అల్లం కొమ్ములు తులసి మొక్క మొదట్లో భద్రపరిచేవారు. ఫ్రిజ్‌లు లేని రోజుల్లో నేలలో పెట్టిన అల్లం ఎన్నాళ్లయినా పచ్చిగా, తాజాగా ఉండేది. మహా అయితే చిగురు వేసేది. నిమ్మపళ్లు నిత్యం అందుబాటులో ఉండేవి. పైగా ఏడాదిలో అన్ని రోజులూ నిమ్మకాయలు వస్తూనే ఉంటాయి. అంటే మన నిత్య వంటలో పదార్థాల్లో నిమ్మ ఒక భాగంగా ఉండేది. అలాగే దబ్బ. ఇప్పుడిప్పుడు దాని వాడుక బాగా తగ్గిపోయింది. మార్కెట్‌ లేనందున శ్రద్ధ లేదు. ప్రపంచీకరణ మహా ఉప్పెనలో ఎన్నో మంచి చెడులూ కొట్టుకుపోయాయి. మొన్న కరోనా ఉపద్రవం వచ్చినప్పుడు లాకౌట్‌లు చూసి, మొత్తం గ్లోబ్‌కి మడి వస్త్రం చుట్టినట్టు ఉందని ఓ మిత్రుడు చమత్కరించాడు. ధైర్యం చెప్పిన డాక్టర్‌ గారికి ధన్యవాదాలు. మీ అనుభవంలోంచి ఇంకా కొన్ని ధైర్య వచ నాలు చెప్పండి. మా యువ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భయపెట్టకండి, ధైర్యం చెప్పండని పెద్దలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.

వ్యాసకర్త : శ్రీరమణ,  ప్రముఖ కథకుడు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top