కప్పాతల్లీ! నీళ్లాడే

sri ramana writes about rain in hyderabad - Sakshi

అక్షర తూణీరం

‘నే చెప్పాకదా, పంచ భూతాల్ని మనం పిలవాలే గానీ వచ్చి వాల్తాయ్‌. అవసరమైతే పాత ఆచారా లను పునరుద్ధరిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా.

టీవీ పెడితే రెండోది లేదు. హైదరాబాదులో వాన వార్తలు తప్ప. మూడు వారాల నించీ ఇంకో గొడవ లేనే లేదు. మన మీడియా భలే చిత్రమండీ.. అంటూ మొదలుపెట్టాడు ఒక మంత్రి స్థాయి నాయకుడు. వర్షా కాలంలో వానలు కురవడం విడ్డూరమా? తడిసి ముద్ద యిన నగరం, ఆకాశానికి చిల్లు, నీటిపై తేలు తున్న ట్రాఫిక్‌ ఇలాంటి అర్థంపర్థం లేని పేర్లు పెట్టి జనాన్ని భయపెడతారెందుకో? వాన కురిసింది. అక్కడక్కడ నీళ్లు నిలుస్తాయి. సహజం. నిలిచాయి. అదేమన్నా పెద్ద వార్తా! నీరు పల్లమెరిగి గప్‌చుప్‌గా వెళ్లిపోతే మనకి వార్తవుతుందిగానీ, రోడ్లు కాలువలైతే అదెట్లా వార్తవుతుంది. సైన్స్‌ ప్రకారం సాంద్రతని బట్టి వస్తువులు నీళ్లపై తేల్తాయ్‌. నీటి పోటు అధికమైనప్పుడు కార్లు పడవలవుతాయి. ఈ సిద్ధాంతాన్ని పెద్ద రాద్ధాంతం చేయడంలో అంతరార్థమేమిటో తెలుస్తూనే ఉంది. దేశ విదే శాల నించీ పెట్టుబడి మూటల్ని గాడిదల మీద, ఒంటెలమీద వేసుకుని మన భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్న వారికి ఈ వార్తలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయ్‌. గత పాలకులు అరవై ఏళ్లుగా పట్టించుకోని అనర్థం ఇదంతా. మూడేళ్లలో విశ్వనగరం అయిపోవాలంటే కొంచెం కష్టమే. ఇది వరకటి ప్రభు త్వాలు అనేక గుంతల్ని, భయం కరమైన లొసు గుల్ని నగర వీధుల్లో కప్పి పెట్టాయి. ఈ కుండపోతలకి అవి బయటపడు తున్నాయ్‌. నీతి నియమం, సత్యం ధర్మం నిండిన మా పాలనని దేవుడు గుర్తించాడు. ‘‘చాలు మహాప్రభో’’ అన్నా వినకుండా గంగని వదుల్తున్నాడు – ఇదీ తెలంగాణ పరిస్థితి.

ఇక ఆంధ్రప్రదేశ్‌ స్థితి ఇందుకు భిన్నంగా లేదు. ‘‘నే చెప్పాకదా, పంచ భూతాల్ని మనం పిలవాలే గానీ వచ్చి వాల్తాయ్‌. జలహారతి ఇవ్వండి తమ్ముళ్లూ అని పిలుపునిచ్చాను. జలం ఉన్నచోటా లేని చోటా కూడా జల హారతులు ఘనంగా ఇచ్చాం. ఫలితం స్వయంగా చూస్తున్నాం. ఈసారి డ్వాక్రా మహిళల్ని, తెలుగు ఆడపడుచులని జలహారతిలో పూర్తి భాగ స్వాముల్ని చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మనవి చేస్తున్నానని అమరావతి వాగ్దానం చేయగానే, ‘‘వద్దు వద్దు... అతివృష్టితో రాష్ట్రం కొట్టుకుపోతుంది’’ అంటూ ముక్తకంఠంతో అరిచారు అభిమానులు.

చాలా కాలం తర్వాత శ్రీశైలం నిండిందని కూడా మీకు మనవి చేస్తున్నా. గేట్లు ఎత్తే వేడుకని జరుపుకుంటున్నాం. ఇక నుంచి ఒక్కో గేటుని ఒక్కో మంత్రితో ఎత్తించే ఏర్పాటు చేసి, అందర్నీ భాగస్వాముల్ని చేస్తాం. మన రాష్ట్రంలో వర్షాల కొరత ఉండదు. జలహారతి బాగా క్లిక్‌ అయ్యింది. వరుణ యజ్ఞాలు మరోవైపు సాగుతున్నాయి. వాన పూజలు బ్రహ్మాండంగా చేయించడం జరుగుతుంది. నాకు తెలుసు కొందరు వీటిని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇవి ఆగవు. పూర్వకాలంలో వానల కోసం మనవాళ్లు కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు. అవసరమైతే పాత ఆచారాలను పునరుద్ధరిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. ధైర్యంగా ఉండండి.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top