అచ్చమైన నేత

Sri Ramana Article On KCR Decision Of Dissolve Assembly - Sakshi

అక్షర తూణీరం

ముందస్తు ఎన్నికలు రావడం వేరు, నాయకుడే కోరి తెప్పించుకోవడం వేరు. దీనికి తెగువ, తెగింపు కావాలి. అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిది నిజంగానే గొప్ప సాహసం... కాదంటే ఆత్మ విశ్వాసం. సర్వే రిపోర్ట్‌లన్నీ ‘సరిలేరు నీకెవ్వరూ’ అని ముక్త కంఠంతో చెప్పాయనీ, కనుక కేసీఆర్‌ ఈ రద్దుని దుస్సాహసంగా భావించడం లేదనీ దగ్గరి వారను కుంటున్నారు. ఏ మాత్రం రిస్క్‌ వున్నా తిని కూర్చుని ఈ ముందస్తు అడుసులోకి దిగరు కదా. తిరిగి మళ్లీ అంతా వాళ్లే. ఎమ్‌ఐఎమ్‌ వాళ్ల పేర్లు కూడా అవే వుండచ్చు. సేమ్‌ గవర్నర్‌! ప్రజలకి అసలేం తేడా పడదు. కాకపోతే, ‘తానొకటి తలచిన ఓటర్‌ మరొకటి తలచును’ అనే చందంగా ఒక్కసారి సభ్యుల్ని మారుద్దాం అనుకుంటే చెప్పలేం.

కేసీఆర్‌ ఉద్యమంలోంచి ఉద్భవించిన నేతగా జ్ఞాని కనుకనే సీట్ల గురించిన కసరత్తులు చేయకుండా ఒక్క నిమిషంలో తేల్చి పడేశాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు, ఎవరైనా ఒకటేనని! ఈ చర్యని కొందరు ‘ఓవర్‌ కాన్ఫిడెన్స్‌’ అని అభివర్ణించారు. ఇంకొందరు, ‘అదేం కాదు. లోపల చాలా జంకు ఉంది. లేని సాహ సాన్ని ప్రదర్శించి ప్రత్యర్థుల్ని చెదరగొట్టడం ఒక స్ట్రాటజీ’ అని అనుకోవడం వినిపించింది. ఏమైనా ఇది అర్ధరాత్రి నిర్ణయమేమీ కాదు. సామాన్యంగా రాష్ట్రంలో అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే బావుండని అధికార పార్టీ ఆశిస్తుంది. ఈ సీజన్‌లో వర్షాలుపడి రిజర్వాయర్ల నించి ఊరి చెరువుల దాకా నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ ప్రమేయం చినుకంతైనా లేకపోయినా ఫలితం ప్రభుత్వ ఖాతాలో పడుతుంది. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య, కరెంటు కోతలు లాంటి ఈతి బాధలు లేకుండా ఉంటే– సామాన్య పౌరుడు అంతా సజావుగానే ఉందనుకుంటాడు. కిందటి మేనిఫెస్టో ప్రతుల్ని ఇంట్లో ఫ్రేములు కట్టించుకుని ఎవ్వరూ తగిలించుకోరు. ‘ఏదో మాట వరసగా బోలెడు అంటారు. అవన్నీ పట్టుక్కూర్చోకూడదు’ అనే విశాల దృక్పథంతో జనం ఉంటారు.

పోనీ, అవతలివైపు ఏమైనా అద్భుతమైన ప్లస్‌ పాయింట్లు వచ్చి చేరాయా అంటే అదేం లేదు. మాటల ధోరణి మారిందా అంటే అదీ లేదు. వేలం పాటలో పై పాట పాడినట్టు అవతలవాళ్లు అన్న దానికి ఓ అంకె కలపడం, పాడడం లాగా ఉంది. కొత్త ఆలోచనలు లేవు. కొత్త ప్రాజెక్టులు లేవు. కొత్త రైల్వేలైను, నాలుగు పెద్ద కర్మాగారాలు... పోనీ మాటవరసకైనా లేవు. అందుకని కేసీఆర్‌ తన సీట్లో తాను కాళ్లూపుకుంటూ నిశ్చింతగానే కూర్చుని కనిపి స్తున్నారు. అధికార పక్షానికి నెగెటివ్‌ ఓటు శాపం ఉంటుంది. ఎంత చేసినా ఓటరు సంతృప్తిపడనీ, ఇంకా ఏదో చెయ్యలేదనీ ఆగ్రహంతో ఉంటాడనీ ఒక వాదన ఉంది. తప్పదు, రాజకీయ రొంపిలో దిగాక అన్నింటినీ తట్టుకు నిలబడాల్సిందే.

ఒక రాష్ట్రాన్ని చేతుల్లోకి తీసుకోవడమంటే సామాన్యమా? ఎంత పవరు, ఎంత పలుకుబడి, ఎంత డబ్బు, ఎంత కీర్తి?! ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదారు లక్షల కోట్లు ముఖ్యమంత్రి చేతులమీదుగా చెలామణీలోకి పోతుంది, వెళ్తుంది. ఆ ప్రవాహం ఏ మెరక దగ్గర కొద్దిగా ఆగినా కోట్లకి మేట పడుతుంది. ఎన్ని ఉద్యో గాలు అడ్డగోలుగా వేయించగలరో! ఎన్ని అవకత వకల్ని, అవినీతుల్ని శుద్ధి చేసి పక్కన పెట్టగలరో! అందుకే రాజకీయం చాలా గొప్పది. పైగా ‘ప్రజా సేవ’ కిరీటం ఎక్స్‌ట్రా. కేసీఆర్‌ అటు ఢిల్లీ అధికార పక్షంతో కూడా అన్ని విషయాలు మాట్లాడుకుని ఈ పనికి పూనుకున్నారని అంతా అనుకుంటున్నారు. ఇందులో పెద్ద అర్థంగాని వ్యూహమేమీ లేదు.

ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే, పార్ల మెంటుకి స్థిమితంగా ఉంటారు. అప్పుడు కొంచెం బీజేపీకి చేసాయం, మాటసాయం చెయ్యచ్చు. అప్పుడు బీజేపీతో కలిసి వెళ్లినా ఆక్షేపణ ఉండదు. ఉన్నా పెద్ద పట్టింపు లేదు. కాసేపు సెక్యులరిజాన్ని ఫాంహౌజ్‌లో పెట్టి కథ నడిపించవచ్చు. అప్పుడది నల్లేరు మీద బండి నడక అవుతుంది. ‘జీవితంలో తన ఉన్నతికి చేదోడుగా ఉన్న ఎందరినో సందర్భో చితంగా మర్చిపోతూ వెళితేగానీ ఒక నేతగా నిలబడ లేడని’ సూక్తి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అచ్చ మైన నేత.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top