ఎన్నికల చక్రం

Sri Ramana Article On Central And State Interim Budgets - Sakshi

అక్షర తూణీరం

చూస్తుండగా కాలం గిర్రున తిరిగొచ్చింది. ఎన్నికలు మళ్లీ రానే వస్తున్నాయ్‌. నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నడంలో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లు నూటికి నూరు శాతం ఓట్ల బడ్జెట్‌గానే అంతా నిర్ధారించారు. అయినా జనం మాయలో పడు తూనే ఉంటారు. భ్రమలోపడి, ఆ మాటలు నమ్మి మీటనొక్కి వస్తుంటారు. వేలికి నల్లమచ్చ పొడిపించుకుని గంపెడాశతో బయటకొస్తారు. అక్కడ నుంచి నెలా రెండు నెలలు ఇంకో డ్రామాకి తెర లేస్తుంది. అంకాల వారీగా అది పూర్తవుతుంది. పదవుల్ని పంచుకుంటారు. అంతా సంకల్పాలు చెప్పి కంకణాలు ధరిస్తారు. కొత్త చాంబర్లు, కొత్తకార్లు అన్నీ ప్రజాసేవలోకి దిగుతాయ్‌. అసంతృప్తులు కూడా తొంగి చూడటం ప్రారంభం అవుతుంది. ఇక్కడికి ఆరు నెలల పుణ్యకాలం గడిచిపోతుంది. మళ్లీ చలికాలం మొదలవుతుంది. పది పన్నెండుసార్లుగా కోటి ఆశలతో ఓట్లు వేస్తున్న వారికి అవే అవే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయ్‌.
 
ప్రజా సమస్యల మీద నుంచి ప్రభుత్వాలు దృష్టి మళ్లించి నాలుగైదు నెలలు దాటింది. పాత మాటలు పక్కనపెట్టి సర్కార్లు కొత్త వాగ్దానాలు చేస్తున్నాయ్‌. ఈ మధ్య ఒక పెద్దాయన, ‘ఇప్పుడు జనాభాకి మునుపటిలో అయోమయంగానీ తికమకగానీ లేదండీ. స్పష్టంగా అనుకునే ఓట్లు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘మంచి ధరకి ఓటు వేస్తున్నారు కొందరు, మనవాడని వేస్తున్నారు కొందరు. అందుకని మాయ మాటల్లో పడే సమస్యే లేదు’ అని ముక్తాయించారు. 

ఓటర్‌ ప్రజకు వడ్డించాల్సిన భక్ష్యాలన్నీ ప్రభుత్వాలు బడ్జెట్‌ విస్తట్లో వడ్డించాయ్‌. వాళ్లకి అందులో తినేవి ఏవో ఉత్తుత్తివేవో అర్థం కాలేదు. ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడింకా కొత్త జల్లులు పడే అవకాశం లేదు. సమయం దాపురించేసింది. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపాలో తేల్చుకున్నారని చాలామంది స్పష్టంగా చెబుతున్నారు. అభ్యర్థి తేలితే అంతా ఖరారేనంటున్నారు. అన్ని వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయ్‌. అన్నింటినీ ప్రజ సమభావంతోనే స్వీకరిస్తోంది. మన దేశంలో నేతల ఆరోపణలన్నీ సీరియస్‌గా తీసుకోవడం జనం మానేసి చాలా కాలమైంది. అవి చాలాసార్లు కాలక్షేపం, కొన్నిసార్లు వినోదంగా మారాయి. 

స్వతంత్రం రాకముందు నుంచి రైతు సమస్యల గురించి మన నాయకులు ఉద్ఘోషిస్తున్నారు. గాంధీ గ్రామ స్వరాజ్యం మీద కలలు కన్నారు. గ్రామసీమలు చూస్తుండగా దివాళా తీశాయి. రైతుకి సిమెంటు రోడ్డు కంటే నీరు పారే పంటకాలువ, మురుగు కాలువ ముఖ్యం. వాటిని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. పట్టించుకున్నా వాటికి కమిటీలు వేసి, రాజకీయం చేసి వదులుతారు. ఏదో వంకన అస్మదీయుల్ని పెంచి పోషించడమే అవుతుంది.

ప్రభుత్వం పెట్టే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా, ముందు విధిగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం. గ్రామాలు అనేక కారణాల వల్ల మరుగున పడిపోయాయి. ఆదాయాలు లేవు, బతుకు తెరువులు లేవు. పట్నవాసంతో సమంగా ఖర్చులు పెరిగాయి. విద్య, వైద్య సౌకర్యాలు పూజ్యం. వలసలకి ఇదే కారణం. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, డాక్టర్లో ఇతర చిరుద్యోగులు గ్రామంలో ఉండరు. దగ్గర బస్తీలో మకాం పెడతారు. గుళ్లో పూజారి సైతం నగరంవైపు పరుగులు పెడతాడు. వాళ్ల పిల్లలకీ చదువులు కావాలి. వారి పెద్దలకీ వైద్యం కావాలి. వాళ్లకీ వ్యాపకం, వినోదం కావాలి. ఈ తరుణంలో ఓట్ల ప్రస్తావనలు వచ్చి, అందరికీ పల్లెలు గుర్తొస్తాయి. నివాసయోగ్యంగా సకల సదుపాయాలతో ఉన్న గ్రామాలు చాలా తక్కువ. గడిచిన నాలుగైదు దశాబ్దాలలో పల్లెలు కళా విహీనమయ్యాయి. అన్నీ పట్టించుకునే మీడియా కూడా గ్రామ ప్రాంతాలను పట్టించుకోదు. గ్రామంలో కుక్కని మనిషి కరిచినా అది వార్త కాదు.

జానపద కళల అభివృద్ధికి, కొన్ని క్రీడలకి గ్రామాలు ఆటపట్టుగా నిలుస్తాయ్‌– అభివృద్ధి చేస్తే. అన్ని క్రీడలకు పుట్టిల్లు పల్లెటూళ్లేనని మర్చిపోకూడదు. పల్లెని విస్మరించడమంటే తల్లిని విస్మరించడమే!


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top