దేశీయ పరిశ్రమకు ఆర్‌సీఈపీ విఘాతం

RCEP Agreement Not Good For India In Financial Crisis - Sakshi

మన అభివృద్ధి ప్రక్రియే ప్రస్తుతం మందగించిపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాల్లో ఆర్‌సీఈపీ సభ్యదేశాలకు తలుపులు తెరవడం వల్ల భారత్‌కు లాభం కంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువ. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మన పరిశ్రమ ఏమాత్రం సిద్ధంగా లేదు. బయట నుంచి వచ్చే ఎలాంటి పోటీకి కూడా మన పరిశ్రమలు తట్టుకునే స్థితిలో లేవు. ఒప్పందం షరతులను అమలు చేస్తే భారతీయ పరిశ్రమలు మూసివేతకు గురవుతాయి. ప్రపంచీకరణ విధానంలో భాగంగా భారత ప్రభుత్వాలు ఉద్యోగాలకు, ఉపాధికి కాకుండా వృద్ధికే అమిత ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాయి. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. బ్యూరోక్రాట్ల వైఖరి ఎలా ఉన్నా దేశ శ్రేయస్సుకు సంబంధించి రాజకీయనాయకత్వం అప్రమత్తంగా ఉండాలి. మనం చస్తున్నా సరే.. ఆర్థిక వ్యవస్థ మాత్రం స్వేచ్ఛా వాణిజ్యానికే మళ్లాలనుకోవడం ప్రమాదకరం. స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకిస్తున్నందుకు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ను విధ్వంసకరమైన సంస్థగా ముద్రించారు.

ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతున్నట్లు సర్వత్రా భయాం దోళనలు వ్యాపిస్తున్న సమయంలో చైనా నేతృత్వంలో ఏర్పడిన 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వాణిజ్య ఒప్పంద కూటమి (ఆర్‌సీఈపీ)లో చేరితే భారత్‌ తీవ్రంగా నష్టపోతుందని భారతీయ వ్యవసాయ, పౌర సమాజ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ మన దేశం ఆర్‌సీఈపీలో చేరడంపై అత్యంత ఆసక్తి చూపుతుండటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆర్థిక విభాగం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారతీయ అభివృద్ధి ప్రక్రియే ప్రస్తుతం మందగించిపోతున్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలను ఆర్‌సీఈపీ సభ్యదేశాలకు తలుపులు తెరవడం వల్ల భారత్‌కు లాభం కంటే నష్టపోయే అవకాశాలే ఎక్కువని ఆరెస్సెస్‌ అనుకూల ఆర్థిక చింతనా సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎమ్‌) జాతీయ సహ కన్వీనర్‌ అశ్వని మహాజన్‌ పేర్కొంటున్నారు. దేశ రాజకీయ నాయకత్వం, మీడియా కూడా చైనా నియంత్రణలోని ఒప్పందం గురించి ప్రగాఢ ఆసక్తి ప్రదర్శిస్తుండటంపై అశ్వని తీవ్రంగా విమర్శిస్తున్నారు. చైనా నేతృత్వం లోని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వైపు పరుగుతీయడం కంటే దేశీయ పాలపరిశ్రమ, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అశ్వని అంటున్నారు. ఆయన ఇంటర్వ్యూ సారాంశం క్లుప్తంగా...

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వాణిజ్య ఒప్పంద కూటమి (ఆర్‌సీఈపీ) గురించి 2011 సంవత్సరం నుంచి చర్చల్లో ఉంటోంది. ఈ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అన్ని షరతులను భారత్‌ ఆమోదిస్తే అది దేశానికి ఏమాత్రం ఉపయోగం ఉండదని మా అభిప్రాయం. యూపీఏ హయాంలో కూడా మా వైఖరి ఇదే. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మన పరిశ్రమ ఏమాత్రం సిద్ధంగా లేదు. బయట నుంచి వచ్చే ఎలాంటి పోటీకి కూడా మన పరిశ్రమలు తట్టుకునే స్థితిలో లేవు. ఒప్పందం షరతులను అమలు చేస్తే భారతీయ పరిశ్రమలు మూసివేతకు గురవుతాయి. ఒక పరిశ్రమను ఏర్పర్చడానికి చాలా ప్రయత్నం అవసరం. ఉక్కు, ఆటోమొబైల్స్, రసాయనాలు,  టెలికం, డెయిరీ, వ్యవసాయం వంటి అన్నిరంగాల్లోనూ భారీస్థాయిలో ఉద్యోగులు, సిబ్బంది నియమితులయ్యారు. ఇలాంట ప్పుడు మన దేశీయ సామర్థ్యాలు బయటి శక్తుల ప్రభావానికి గురైతే ఈ రంగాలు ఏవీ తట్టుకుని నిలబడలేవు. దీంతో భారతీయ పరిశ్రమలు మూతపడతాయి. దేశం భారీ స్థాయిలో నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనవలసి ఉంటుంది.  బయటి శక్తుల ప్రభావం ఎంత ప్రమాదకరమైనదో 1991 నుంచి అనేక ఉదాహరణలను చూడవచ్చు. ప్రపంచీకరణ విధానంలో భాగంగా భారత ప్రభుత్వాలు ఉద్యోగాలకు, ఉపాధికి కాకుండా వృద్ధికే అమిత ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాయి. అదేవిధంగా విదేశాలనుంచి మన మార్కెట్లకు వెల్లువలా సరుకులను ఆహ్వానించాము. ప్రత్యేకించి 2001 నుంచి చైనా ఉత్పత్తులు భారత్‌కు వెల్లువలా తరలివచ్చాయి. గత ప్రభుత్వాలు ఏవీ దిగుమతుల వెల్లువను అరికట్టలేకపోయాయి.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ సరుకుల దిగుమతిని కాస్త ఆపడానికి ప్రయత్నించింది. ప్రత్యేకించి గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఒక అవగాహనతో పనిచేస్తోంది. భారతీయ పరిశ్రమ తీవ్రంగా ఇబ్బందిపడుతోందని కేంద్రం గమనించింది. స్థానిక పరిశ్రమను కాపాడేందుకు రక్షణాత్మక సుంకాలను విధిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం తెలిపింది. యాంటీ డంపింగ్‌ సుంకాలను కూడా కేంద్రం విదేశీ దిగుమతులపై విధించింది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగానే ఉంది. చైనా నుంచి వెల్లువలా వస్తున్న దిగుమతులను అరికట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది.ఆర్‌సీఈపీపట్ల కేంద్రప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉండేది. 2015–16 సంవత్సరాలలో నిర్మలా సీతారామన్‌ వాణిజ్య మంత్రిగా ఉండేటప్పుడు భారత్‌ ఆర్‌సీఈపీలో చేరడానికి సిద్ధంగా లేదని స్పష్టంచేశారు బ్యూరోక్రాట్లు, వాణిజ్య నిపుణులు, ఆర్థిక వేత్తలు, మీడియా కూడా నాటి సమావేశంలో పాల్గొన్నారు. అందరి అభిప్రాయం ఆర్‌సీఈపీకి వ్యతిరేకంగానే ఉండేది. అయితే తర్వాతేం జరిగిందో తెలీదు కానీ కేంద్ర ప్రభుత్వం మరోవైపున స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నట్లు ఉంది. ఆర్‌సీఈపీ వ్యవహారాలను పరిశీలించాల్సి ఉండిన బ్యూరోక్రాట్లు ఆ ఒప్పం దంలో చేరవలసిన అవసరం గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తూవచ్చారు. అంటే వారు ప్రభుత్వానికి వివరించడం అనే ప్రక్రియనుంచి చాలా దూరం పోయారు.

వాస్తవం చెప్పాలంటే యావద్దేశం స్వేచ్ఛా వాణిజ్యం పట్ల తీవ్ర వ్యామోహంతో ఉంటోంది. మీడియాది కూడా ఇదే దారి. మన దేశ వాణిజ్య పత్రికలను ఒకసారి చూస్తే చాలు అర్థమవుతుంది. మన ఆర్థిక వ్యవస్థ తలుపులను పూర్తిగా తెరిచి ఉంచాలనే దుగ్ధ వీరికీ ఉంది. సుంకాలు జీరోకి తగ్గించాలని, అలా చేయకపోతే తాము పోటీ పడలేమని, మనం చస్తున్నా సరే.. ఆర్థిక వ్యవస్థ మాత్రం స్వేచ్ఛా వాణిజ్యానికే మళ్లాలని వీరి ఘనమైన అభిప్రాయం. దాన్ని వ్యతిరేకిస్తున్నందుకు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ను విధ్వంసకరమైన సంస్థగా వారు ముద్రించారు.  పైగా దేశ శ్రేయస్సు గురించి తమకే బాగా తెలుసని వారు భావిస్తున్నారు మరి. దేశంలో నిజాయితీ కలిగిన జర్నలిజం ఇప్పుడు లేదు. ఈ పరిస్థితికి వారు కూడా బాధ్యులే. బ్యూరోక్రసీ, మీడియా దారి ఏదైనా, రాజకీయ నాయకత్వం మాత్రం జాగరూకతతో పనిచేయాల్సి ఉంది. అందుకే ఆర్‌సీఈపీకి వ్యతిరేకంగా జాతీయవ్యాప్త ఆందోళనకు స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం వల్ల ప్రభావితం అయ్యే రంగాలు ఏవనే విషయం వెల్లడి కావాలి. పసిబిడ్డ ఏడిస్తేనే కదా తల్లి పాలు ఇచ్చేది. అందుకే స్వేచ్ఛావాణిజ్యం కారణంగా దెబ్బతింటున్న పరిశ్రమలు, వర్గాలు ఒక్కటొక్కటిగా తమ గొంతు విప్పాల్సి ఉంది. స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఆందోళనకు దిగినప్పుడు సైకిల్‌ పరిశ్రమ తన సమస్యలతో ముందుకొచ్చింది. అలాగే ఉక్కు పరిశ్రమ, టెలికాం పరిశ్రమ కూడా గళం విప్పాయి. చివరకు కొందరు మంత్రులు సైతం ఈ ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా ఆ ఒప్పం దాన్ని కోరుకుంటున్నట్లయితే, ముందుగా భారత ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఎవరు ఎక్కడ తప్పు చేశారు అనేది రాజకీయ నాయకత్వం గుర్తించగలదు.  ఈ అంశంపై జాగరణ్‌ మంచ్‌ ప్రభుత్వంతో చర్చలు జరపలేదు కానీ దాని ఆలోచనలపై వస్తున్న సమాచారం ప్రోత్సాహకరంగానే ఉంది.

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ బోధనలను అనుసరిస్తోంది. ప్రభుత్వం ఏ విధానాలను పాటించినా, ఎలాంటి ఒప్పందాలపై చర్చించినా, అంతిమ ఫలితం మాత్రం దేశంలోని చివరి వ్యక్తి కూడా లబ్ధి పొందేలా ఉండాలి. మంచ్‌ ఆందోళన చెందుతున్నట్లు పాల పరిశ్రమ దెబ్బతినేటట్లయితే అది దేశానికి మంచిది కాదు. వ్యవసాయం దెబ్బతినేటట్లయితే అది రైతులకు మంచిది కాదు. ప్రజా శ్రేయస్సే దెబ్బతింటున్నట్లయితే అలాంటి విధానాలను వ్యతిరేకించడమే మార్గం. ఆర్‌సీఈపీ ప్రభావాల గురించి ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ముంచుకొస్తున్న సమస్యలను అది పరిష్కరించాలి. ప్రజలు కూడా ఈ ఒప్పందం నుంచి గౌరవప్రదమైన నిష్క్రమణపై మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం చేయాల్సింది అదే. ముఖ్యంగా 15 సంవత్సరాల వ్యవధిలో సుంకాలను జీరో స్థాయికి తగ్గిస్తూ పోవాలన్న ప్రతిపాదనను మంచ్‌ అస్సలు ఒప్పుకోదు. 15 ఏళ్ల తర్వాత అమలుచేసే ఒప్పందం ఏ పరిస్థితుల్లోనూ సమ్మతం కాదు. ఇప్పుడు ఒక తప్పుకు పాల్పడితే తర్వాత ఎన్నటికీ పశ్చాత్తాపం చెందాల్సిందే. అలాంటి తప్పులను ఎవరూ చేయకూడదు. స్పష్టంగా చెప్పాలంటే చైనాతో ఎలాంటి ఒప్పందానికైనా స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కోరుకోవడం లేదు. వారి ఉత్పత్తులు మన దేశానికి అవసరం లేదు. ఇటీవల భారత్, చైనా అగ్రనేతలు మామల్ల పురంలో కలిశారు. నవ్వుకున్నారు. చేతులు కలిపారు. సంభాషించుకున్నారు. ఇవన్నీ బాగున్నాయి కానీ అంతిమ ఫలితం ముఖ్యం. ఆర్థిక మాంద్యంపై అస్పష్ట ప్రకటనలు చేయడం సరి కాదు. ప్రజలు బిస్కెట్లు కొనలేకపోతున్నారనడం వాస్తవం కాదు. దేశంలో రిఫ్రిజిరేటర్లకు, ఏసీలకు డిమాండ్‌ పెరుగుతోంది. సత్వరం అమ్ముడుపోయే వినియోగదారీ సరుకుల కొనుగోళ్లు తగ్గడం లేదు. ఈ రంగాలన్నింటిలోనూ వృద్ధి ఉంది. అటోమొబైల్స్‌ రంగంలో మాత్రమే అది వెనుకపట్టు పట్టింది. అది బ్యాంకింగ్‌ రంగంలో సమస్య. బ్యాంకులు ప్రజలకు రుణాలు ఇవ్వడం లేదు. సంఘ్‌ పరివార్‌లో ఆర్థిక వ్యవస్థ తీరుపై ఎలాంటి భేదాలు లేవు. అందరిదీ ఒకే వైఖరి.

(ది వైర్‌తో ప్రత్యేక ఏర్పాటు)
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top