ఒంటరి స్వేచ్ఛ నిలబడదు

Prime Minister Try To Attack On Media Over Fake News - Sakshi

జాతిహితం

ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్‌ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! 

గడచిన అర్థ శతాబ్దకాలంలో చూస్తే భారతదేశ చరిత్రలో శక్తిమంతులైన ముగ్గురు ప్రధానమంత్రులు కనిపిస్తారు. ఈ ముగ్గురికీ కూడా పూర్తి ఆధిక్యం ఉంది. వారివి స్థిరమైన ప్రభుత్వాలు. వీరిలో మొదటి ప్రధాని ఇందిరాగాంధీ. మార్చి, 1971లో జరిగిన ఎన్నికలలో ఆమె, ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్‌ (ఐ) విపక్షాలను తుడిచి పెట్టడం కనిపిస్తుంది. తరువాత రాజీవ్‌ గాంధీ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ 1984లో ఘన విజయం సాధించారు. మనకున్న శక్తిమంతుడైన ఆ మూడో ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఐదేళ్ల పాలన ఇప్పుడు చివరి సంవత్సరంలోకి ప్రవేశించబోతోంది కూడా. అయితే స్పష్టత కోసం 1980–84 ఇందిర పాలనను ఇందులో చేర్చడం లేదు. అప్పుడు హత్యకు గురికావడంతో ఆమె పదవీకాలం అర్థాంతరంగా ముగిసిపోయింది. తరచి చూస్తే ఈ మూడు ప్రభుత్వాల నడుమ ఒక సారూప్యతను మీరు కనుగొనగలరు. ఇందుకోసం ‘ఫోన్‌ ఎ ఫ్రెండ్‌’ వంటి ఒక ఆధారం కూడా నన్ను ఇవ్వనివ్వండి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ ఐదేళ్ల పాలన ఆఖరి సంవత్సరాలలో ఏం చేయడానికి ప్రయత్నించారో ఆలోచించండి! ఇప్పటికీ ఊహించడం దగ్గరే ఉన్నారా? అయితే మరొక ఆధారం ఇస్తున్నాను– పత్రికా రచయిత మాదిరిగా ఆలోచించండి! 

వాస్తవాలు ఇక్కడున్నాయి. ఈ ముగ్గురు ప్రధానులు కూడా తమ తమ పాలన చివరి ఏడాదిలో మీడియా స్వేచ్ఛను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇందిరాగాంధీ ఐదేళ్ల పాలనలోని సరిగ్గా చివరి సంవత్సరంలోనే అత్యవసర పరిస్థితి ప్రకటించి, పత్రికల మీద సెన్సార్‌ నిబంధనలను విధించారు (ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత, అందుకు తనకు తాను ఇచ్చుకునే కానుక అన్నట్టు పార్లమెంట్‌ కాలపరిమితిని ఒక సంవత్సరం, అంటే ఆరేళ్లకు పొడిగించుకున్నారు). స్వార్థ ప్రయోజనాలూ భారత్‌ను అస్థిరం చేయాలన్న కుట్ర కలిగిన ‘విదేశీ హస్తం’ కనుసన్నలలో మెలగుతున్న పత్రికారంగం (అప్పటికి ఈ రంగాన్ని ఎవరూ మీడియా అని పిలిచేవారు కాదు) ప్రతికూలతను, విద్వేషాన్ని వెదజల్లుతున్నదని ఇందిర వాదన. ఏవో కొన్ని తప్ప పత్రికలన్నీ దారికొచ్చేశాయి. దారికి రాని పత్రికల వారు జైళ్లకు వెళ్లవలసి వచ్చింది. ఆయా సంస్థలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. రాజీవ్‌ కూడా అంతే. తన ఐదేళ్ల పాలన తుది అంకంలో అంటే 1987–88 సంవత్సరంలో సదరు పరువు నష్టం బిల్లు తీసుకువచ్చారు. బొఫోర్స్‌ కుంభకోణం, జైల్‌సింగ్‌ సవాలు, వీపీ సింగ్‌ తిరుగుబాటు వంటి వాటితో సతమతమవుతున్న రాజీవ్‌ కూడా సహజంగా పత్రికారంగాన్ని తప్పుపట్టారు. ఆ బిల్లు అసలు లక్షణాలు ఏమిటో గ్రహించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఒక ఆంగ్లపత్రికను – ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌–ఏకాకిని చేసి ‘శిక్షించేందుకు’ దాని మీద వందలాది దొంగకేసులు నమోదు చేయించారు. 

ఇప్పుడు మోదీ ప్రభుత్వం ‘నకిలీ వార్త’ మీద పోరాటం పేరుతో ప్రధానస్రవంతి మీడియా మీద దాడిని కొనసాగించే యత్నం చేస్తున్నది. అయితే ప్రధాని జోక్యంతో అలాంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు నాటకీయంగాను, అంతే సంతోషంతోను తప్పుల తడక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు. అలా ప్రకటించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ పని ఇంకా చేయవలసి ఉందన్నదే నిజం. పైగా ఒక ఆధారం ఇస్తున్నట్టుగానే ఆ ఉపసంహరణ ప్రకటన వెలువడింది. ఎలాగంటే డిజిటల్‌ మీడియాకు నియమావళిని రూపొందించడానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అందులో ఉంది. ఈ వాదన ఎలా ఉందంటే, పత్రిక, ప్రసార రంగాలకు వాటి నిబంధనావళి వాటికి ఉంది (ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ). ఎటొచ్చీ ఇబ్బందికరంగా ఉన్న డిజిటల్‌ మీడియాకే ఇలాంటి వ్యవస్థ ఏదీ లేదు. ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఆ మీడియాను పనిచేయడానికి అనుమతించరాదు. 

పత్రికారంగ పూర్వపు నిబంధనలలో ‘మూడు ఉదాహరణల నిబంధన’ ఒకటి. మూడింటిని ఒకేసారి స్పృశిస్తే అవి ఒకే విషయాన్ని బోధపరుస్తాయి. ఏక ఖండంగా ఉన్న దారంలా కనిపిస్తాయి. కాబట్టి, శక్తిమంతమైన ప్రభుత్వాలు చివరి అంకంలో ప్రవేశించనప్పుడు వాటికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే వారిని చెడ్డవార్తల సంగతి చూసేటట్టు చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటేæ, అది వేరే చర్చ. వారి ఆకస్మిక పతనాన్ని వారే నమ్మలేకపోవడం, లేదా మరోసారి ప్రభుత్వంలోకి రావడం గురించి ఉన్న అభద్రతా భావం చెడువార్తలను ప్రచురిస్తున్నాయంటూ పత్రికలను తప్పు పట్టేట్టు చేస్తాయి కాబోలు. 1975 ఆరంభం నాటి పరిస్థితి ఏమిటో మనకి తెలుసు. 20 శాతానికి మించిన ద్రవ్యోల్బణంతో, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమంతో ఇందిరాగాంధీ పతనావస్థకు చేరుకున్నారు. అయినా పత్రికలను అదుపు చేయాలన్న ప్రయత్నంలో చాలావరకు విజయం సాధించారు. ఎందుకంటే చాలా పత్రికలు తలొగ్గాయి. అయితే పత్రికల మీద విధించిన సెన్సార్‌ నిబంధనల కారణంగా ప్రజలు శిక్షించడం వల్లనే ఇందిర ఓటమి పాలయ్యారని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించడమనే ఘోర తప్పిదానికి ఆమె పాల్పడకుండా ఉండి ఉంటే, అత్యవసర పరిస్థితి కాలం నాటి ‘క్రమశిక్షణ’ చాలా ప్రాచుర్యంలో ఉండేది. కానీ ఆమె శత్రువులు అధికారంలోకి రావడంతో ఆమె జైలుకు వెళ్లారు. ఒక సాంఘిక ఒప్పందం అక్కడ ఆవిర్భవించింది. 

ఆ మేరకు సెన్సార్‌ నిబంధనలలోని క్రూరత్వాన్ని ప్రజలు గ్రహించి పత్రికా స్వేచ్ఛకు పూచీ పడ్డారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేని దేశంలో ఇలాంటì మలుపు పెద్ద పరిణామం. ఆ మేరకు పత్రికా రంగాన్ని అదుపులో పెట్టాలన్న ఇందిర ఆలోచన పూర్తిగా బెడిసికొట్టింది. రాజీవ్‌గాంధీ కూడా తన తప్పిదాలను పత్రికల మీదకు నెట్టివేసి, వాటిని శిక్షించాలని ప్రయత్నించారు. ఆయన కూడా అందులో విఫలమైనారు. ఆయన తల్లికి జరిగినట్టే ఆయన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దేశంలో ప్రముఖ పత్రికా సంపాదకులు, ఆఖరికి యజమానలు వారి వారి స్పర్థలను, వైరుథ్యాలను కూడా పక్కన పెట్టి ప్లకార్డులు పట్టుకుని జనపథ్‌ రోడ్డులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇలాంటి సంఘీభావం అత్యవసర పరిస్థితి కాలంలో ఎప్పుడూ కనిపించలేదు. రాజీవ్‌ వెనక్కి తగ్గారు. మీడియా గొంతు నొక్కే ఉద్దేశంతో ఆ రెండు ప్రభుత్వాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు చివరికి మీడియా స్వేచ్ఛను బలోపేతం చేస్తూ ముగిశాయి. ఇలాంటి ప్రయత్నం పునరావృతమవుతుందా? అలాగే ఇలాంటి ప్రయత్నం మూడోసారి చేసి విజయం సాధించగలిగినంత బలంగా ప్రభుత్వం ఉందా? 

బీజేపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలన చివరి దశకు చేరుకోవడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే అవి ఇంతకు ముందు చెప్పిన ఆ రెండు ప్రభుత్వాలు ఉనికి కోసం ఎదుర్కొన్న సవాళ్ల వంటివి కావు. 1975, 1988 కాలంతో పోల్చి చూస్తే ఇప్పుడు భారతీయ మీడియా ఎంతో బలంగా ఉంది. ఎంతో పెద్దది, శక్తిమంతమైనది, వైవిధ్యభరితమైనది. అలా Vó గతంలోని ఆ రెండు సందర్భాలను బట్టి చూస్తే ప్రస్తుత మీడియాకు రెండు బలమైన ప్రతికూలాంశాలు కూడా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న ఆ సామాజిక ఒప్పందం ఇప్పుడు గందరగోళంలో పడింది. ఈ సంగతి నేను గతంలో చాలాసార్లు చెప్పాను కూడా(https://theprint.in/opinion/fake-news-order-we the-indian-media-have-ignored-warning-bells/46741/).. మరొకటి– ప్రస్తుత మీడియా గతంలో కంటే ఎక్కువగా చీలిపోయి ఉంది. మీడియా ఒక మర్యాద పూర్వక ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి దాని తాత్వికతలలో, సిద్ధాంతాలలో, అభిప్రాయాలలో భేదాలు ఉన్నాయి. అయితే ఇవాళ వేదికల ప్రాతిపదికగా కూడా మీడియా చీలిపోయింది. ఈ చీలికలు ఇంకా పెరిగితే మరింత తీవ్రమైన దెబ్బ తినక తప్పదు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు నిబంధనావళి కలిగి ఉన్నాయి కానీ, డిజిటల్‌ మీడియాకు అలాంటి నిబంధనలు లేవంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని సారాంశం గమనించండి! విస్తారంగా ఉన్న మీడియాను చీలికలు పేలికలు చేయడమే దీని వెనుక ఉన్న లక్ష్యం. ఇందులోని సాధ్యాసాధ్యాలు కూడా చర్చనీయాంశమే.

అయితే పత్రికలు, ప్రసార మాధ్యమాలు, డిజిటల్‌ మీడియా ఈ మూడు కూడా నడుపుతున్న పెద్ద మీడియా సంస్థలు దీనితో తమకేమీ ప్రమాదం ఉండదని ఆలోచిస్తాయి. ఎందుకంటే, దాని నుంచి రక్షించే తమవైన వ్యవస్థలు ఉన్నాయని వారి నమ్మకం. అంటే అచ్చమైన డిజిటల్‌ మీడియా సంస్థలు వాటి బాధలు అవి పడాలి. చాలా కాలం నుంచి నడుస్తున్న మీడియా సంస్థలకు కూడా ఈ చర్య నచ్చుతుంది. ఎందుకంటే, అచ్చమైన డిజిటల్‌ మీడియా పాత మీడియా సంస్థలని అవినీతి నిలయాలనీ, అసమర్థమైనవనీ విమర్శిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంటర్నెట్‌ను అదుపు చేయడం ఎవరి వల్లా కాదనీ, ఏ ప్రభుత్వం కూడా అదుపు చేయలేదనీ కొత్త డిజిటల్‌ మీడియా అధిపతుల నమ్మకం. అది నిజం కాదు. ఇంటర్నెట్‌ అనేది సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థ ఏమీ కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యమం, ఆఖరికి ఎంతో లోతైన ఉదారవాద వ్యవస్థలు కూడా ఇంటర్నెట్‌ను అదుపు చేయడానికే మొగ్గుతున్నాయి. నిజంగా అదే జరిగితే, ఒంటిరిగా పోరాడడం నీ వల్ల కాదు. కాబట్టి అప్పుడు మళ్లీ సంప్రదాయ మీడియా మద్దతు అవసరమవుతుంది. అందుచేత దానిని తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. తీర్పులు ఇవ్వడం సరికాదు. 

కథువా (జమ్మూకశ్మీర్‌), ఉన్నవ్‌ (యూపీ) వంటి అన్యాయపు కేసులు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. ఈ రెండు చోట్ల కూడా పాలక వ్యవస్థ అహంకారపూరిత ధోరణి కారణంగా న్యాయం దిగ్బంధనమైంది. లైంగిక అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మీద కేసు కూడా నమోదు కాలేదు. కానీ మీడియా నిర్వహించిన కృషి వల్ల ఈ అన్యాయం మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు సాగుతోంది. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే మనమంతా కలసి పోరాడవలసిందే. లేదంటే చీలికలు పేలికలైపోయి కునారిల్లిపోవడానికి సిద్ధంగా ఉండడమే. నీ విరోధులు స్వేచ్ఛను కాపాడగలిగినప్పుడే నీ స్వేచ్ఛను నీవు కాపాడుకోగలుగుతావు. స్వేచ్ఛ చీలికలు పేలికలై పోకూడదు.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top