మధ్యతరగతిపై ‘మైనారిటీ’ ప్రేమ!

Modi Government Plays Games With Middle Class Families - Sakshi

జాతిహితం 

భారతీయ పాలకవర్గాలు సంపన్నులనుంచి అధిక పన్నులు రాబట్టి పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తుంటారన్నది సాధారణ అభిప్రాయం. ప్రధాని మోదీ కూడా ఆ కోవకు చెందినవారే అని చాలామంది భావిస్తూండవచ్చు కానీ 2014 నుంచి 2019 దాకా మధ్యతరగతి ముక్కుపిండి వసూలు చేసిన పన్ను రాబడుల నుంచే పేదవర్గాలకు దాదాపు రూ. 11 లక్షల కోట్ల నగదును మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందని గణాంకాల అంచనా. ఇలా తాయిలాలు అందించడం ద్వారా మోదీ పేదల ఓట్లను కొల్లగొట్టారు. మధ్యతరగతినుంచి పన్నుల రూపంలో గుంజుతున్నప్పటికీ, వారిని హిందూత్వ భ్రమల్లో ముంచెత్తి తమవైపుకు తిప్పుకున్నారు. ముస్లింలకు ఏ మేలూ చేయకున్నా లౌకికవాద పార్టీలు వారితో మొన్నటివరకూ ఆటాడుకున్నట్లుగానే, మధ్యతరగతితో మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఆటాడుకుంటోంది.

నరేంద్రమోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పొందుపర్చిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, సంవత్సరానికి 2 కోట్ల రూపాయలకు మించి సంపాదన కలిగిన సంపన్నులపై పన్నురేట్లను మరింత పెంచడమే. సంవత్సరానికి 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయమున్న అతి ధనవంతులపై పన్ను మరింతగా పెంచారు. అంటే అత్యధిక పన్నురేటు ఇప్పుడు 42.3 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన పన్ను రేట్లను చూస్తుంటే ’సంపన్నులను పీల్చి పిండేయండి’ అనే ఇందిరా గాంధీ పాలనా శైలికి సరైన ఉదాహరణగా కనబడుతుంది. నాలాంటి విశ్లేషకులలో చాలామందికి ఇదే అభిప్రాయం కలగవచ్చు కానీ కాషాయ రాజకీయాలలో పూర్తిగా మునిగితేలుతున్న వారి దృష్టి మరొక రకంగా ఉండవచ్చు. 1977లో అత్యవసర పరిస్థితి ముగిసిన అనంతరం రాజ్యాంగంలో పొందుపరిచిన సోషలిజం సూత్రాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పూర్తిగా కట్టుబడిందనటానికి తాజా బడ్జెట్‌ చక్కటి రుజువుగా నిలుస్తోందని వీరు ప్రశంసల వర్షం కురిపించవచ్చు. అయితే భారతదేశ చరిత్రలోనే అత్యంత మితవాద ప్రభుత్వ పాలనకు నరేంద్రమోదీ రెండో దఫా నాయకత్వం వహిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు.

అయితే ఈ రెండు అభిప్రాయాలూ తప్పే. ఎందుకంటే మోదీ ప్రభుత్వం పీల్చిపిప్పి చేస్తున్నది నిజానికి సంపన్నవర్గాలను కాదు. మొదటినుంచి తన పట్ల అత్యంత విశ్వాసం ప్రదర్శిస్తున్న, తనకు బలమైన ఓటుబ్యాంకుగా నిలబడుతూ వస్తున్న భారతీయ మధ్యతరగతి ప్రజల మూలుగులను మోదీ ప్రభుత్వం పీల్చివేస్తోంది. ఇప్పుడు మనం వేయవలసిన ప్రశ్న ఏమిటంటే, అపరిమిత విశ్వాసాన్ని ఈ తరగతి ప్రజలు తనపై చూపుతున్న కారణంగానే వారిపట్ల ప్రభుత్వం ఇలాంటి చిన్నచూపును ప్రదర్శిస్తోందా? మరోవైపున గడచిన అయిదు సంవత్సరాలలో, జాతీయ సంపదను పేదలకు పంచిపెట్టడంలో, బదిలీ చేయడంలో మోదీ ప్రభుత్వం బహుశా అసాధారణమైన, అద్భుతమైన పాత్రను పోషిస్తూ వచ్చింది. గృహ నిర్మాణం, టాయిలెట్లు, వంటగ్యాస్, ముద్రా రుణాలు వగైరా జనరంజక పథకాలకోసం కేంద్ర ప్రభుత్వం ఈ అయిదేళ్లలో 9 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలను నిరుపేదలకు పంపిణీ చేసిందనడంలో సందేహమే లేదు. పేదలకు జాతీయ సంపదను పంపిణీ చేయడంలో కేంద్రం ఎంత విజయం సాధించిందంటే రెండో దఫా ఎన్నికల్లో మోదీ అసాధారణ మెజారిటీతో, విజయగర్వంతో అధికారంలోకి వచ్చారు. అయితే పేదలకు పంచిపెట్టిన ఇంత భారీ డబ్బు ఎక్కడినుంచి వచ్చినట్లు?

సాధారణంగానే ఇదంతా సంపన్నవర్గాల నుంచి పన్నుల రూపంలో కేంద్రప్రభుత్వం వసూలు చేసిందే అని మనందరికీ సహజంగానే అనిపించవచ్చు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. ఒకవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోతున్నా, కేంద్రప్రభుత్వం వినియోగదారులకు దాని ప్రయోజనాన్ని అందించడానికి బదులుగా చమురుపై పన్నులను పదేపదే పెంచుతూ పోయి లాభాన్ని మొత్తంగా తన జేబులో వేసుకుంది. చమురు అమ్మకాల ద్వారా సాధించిన భారీ లాభంలో ఎక్కువ శాతం వాహనదారులైన మధ్యతరగతి ప్రజలనుంచే వచ్చిందన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ఇలా ముగించవచ్చు. జాతీయ సంపదను అసాధారణంగా పంపిణీ చేయడంలో పేదలు లబ్ధి పొంది ఉండవచ్చు కానీ ఇదంతా దేశంలో మధ్యతరగతికి చెందిన అన్ని సెక్షన్లనూ పిండగా వచ్చిందే అని చెప్పాలి. పేదలకు పంచి పెట్టిన ఈ 11 లక్షల కోట్ల రూపాయల డబ్బులో కొంచెం కూడా సంపన్నులనుంచి రాలేదు. మధ్యతరగతిని పిండి వసూలు చేసిన ఈ డబ్బు పంపకం తోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం పేదల ఓట్లను భారీస్థాయిలో కొనగలిగింది. 

పెద్దపెద్ద నగరాల నుంచి నగరీకరణ చెందిన రాష్ట్రాల వరకు.. మధ్యతరగతి ప్రజలు కూడా భారీ స్థాయిలో ఈసారి బీజేపీకే ఓటు వేశారని అర్థమవుతుంది. దేశంలో అతివేగంగా పట్టణీకరణకు గురైన రాష్ట్రం హరియాణా. భారత్‌లోని అత్యంత సంపన్నులు ఈ రాష్ట్రంలోని నగరాల్లో ఉండగా అత్యంత నిరుపేదలు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. 2014 ఎన్నికల వరకు బీజేపీ ఈ రాష్ట్రంలో కనీస మాత్రం ఓట్లను మాత్రమే పొందగలిగింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దాని ఓటు ఇక్కడ 58 శాతానికి అమాంతంగా పెరిగింది. మోదీ పాలనా తీరుకు ఇదొక ముఖ్యమైన రాజకీయ ఉదాహరణ. ఆయన ప్రధానంగా మధ్యతరగతి ప్రజలనుంచి పన్నులను రాబట్టి వాటిని దిగువ తరగతికి పంచిపెట్టారు. అయినప్పటికీ ఈ రెండు వర్గాల ప్రజలూ సమాన స్థాయిలో మోదీకి ఓట్లు గుద్దేశారు. 2014 కంటే 2019 నాటికి మధ్యతరగతి మోదీకి అత్యంత విశ్వసనీయమైన ఓటు బ్యాంకుగా ఆవిర్భవించింది. దాని ఫలితాన్ని వారు చాలా సంతోషంగా చెల్లిస్తున్నారు కూడా. 

ఇప్పుడు తాజా బడ్జెట్‌కేసి చూద్దాం. ఇప్పుడు సైతం సంపన్నులనుంచి తాము పన్నులను రాబడుతున్నట్లు సూచనా మాత్రంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సంపన్నవర్గాలు దీనిపట్ల ఏమాత్రం ఆందోళన చెందుతున్నట్లు లేదు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సాధించిన 6,351 మంది వ్యక్తులు పన్నులు చెల్లించారు. వీరి సగటు ఆదాయం రూ.13 కోట్లు.  కానీ ప్రభుత్వానికి వీరివల్ల వచ్చిన అదనపు రాబడి ఎంతో తెలుసా? కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఒక సంవత్సరం టి20 క్రికెట్‌ పోటీల నిర్వహణలో ఆర్జిస్తున్న రాబడి కంటే ఇదేమంత ఎక్కువ కాదు. సంపన్నుల నుంచి ప్రభుత్వం అధిక పన్నులను రాబడుతున్నట్లు పేదలు భావిస్తూ సంతోషం పొందుతున్నట్లు కనిపించవచ్చు కానీ మరోవైపున సంపన్న వర్గాలు తమపై పన్ను విధింపులను ఏమాత్రం లెక్క చేయకుండానే ఎలెక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేయడంలో పోటీపడుతున్నారు.

తమ ఆనందం కోసం, చౌకబారు వినోదాల కోసం పేదలు సులువుగా మోసపోతారు. కానీ, వాస్తవానికి అపహాస్యం పాలయ్యేది మధ్యతరగతివారే. ఎందుకంటే, 2014–19 మధ్య కాలంలో పేదలకు అందే సంక్షేమాలకు సహకారం అందించింది వారు మాత్రమే. అటువంటివారికి పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్నులు విధించడం ద్వారా ఆర్థికమంత్రి మంచి బహుమానమే ఇచ్చారు. ఇక వీరు ముడి చమురు ధరలు తగ్గడం కోసం ఊపిరి బిగపట్టి ఎదురు చూడాల్సిందే. వీటితోపాటు ధనవంతులను కాకుండా మధ్యతరగతివారిని బాదే మరిన్ని విధానాలు కూడా ఉన్నాయి. మోదీ హయాంలో ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభం పన్నును ప్రవేశపెట్టారు. డివిడెండ్ల పంపిణీ పన్ను పెరిగింది. ఏడాదికి పది లక్షల రూపాయలకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి డివిడెండ్లపై అదనపు పన్ను విధించారు. రూ.50లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారి ఆదాయాలపై సర్‌ చార్జ్‌ విధించారు. మధ్యతరగతికి ఉన్న సబ్సిడీలను తగ్గించడంతోపాటు వంట గ్యాస్‌ వంటి వాటిపై ఉన్న సబ్బిడీలను తొలగించారు. ఇటువంటి నాన్‌ మెరిట్‌ సబ్సిడీలను తొలగించడాన్ని మనం స్వాగతించాల్సిందే. కానీ, పన్నులు కడుతున్నదెవరనేది గుర్తించాలి.

మధ్యతరగతిని ఈవిధంగా పెంచుకుంటూ పోవడం ద్వారా మోదీ, బీజేపీ వారి వివేచనతో సరిగ్గా ఆడుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాల ద్వారా కాకుండా వారి మనోభావాలను సంతృప్తిపరచడం ద్వారా అది తన విధేయతను ప్రదర్శిస్తోంది. అందుకే మరింత బలంగా భారతీయతను హిందుత్వగా నిర్వచిస్తోంది. దీనికి ముస్లిం వ్యతిరేకత తోడవుతోంది. వారిలో చాలామంది ఇప్పటికీ మూకదాడుల పట్ల అభ్యంతరాలు చూపుతున్నా, ముస్లింలు మంత్రివర్గంలో, ప్రభుత్వ ఉన్నత పదవుల్లో, పార్లమెంటులో గణనీయంగా తగ్గిపోవడంపట్ల సంతోషంగానే ఉన్నారు. తమ బడ్జెట్‌ ఉపన్యాసాల్లో బీజేపీ ఆర్థిక మంత్రులు ఎన్నిసార్లు మధ్యతరగతిని ప్రస్తావించారో చెబుతూ నా సహోద్యోగి, రాజకీయ వ్యవహారాల సంపాదకుడు డీకే సింగ్‌ ఆశ్చర్యకరమైన అంశాలను బయటపెట్టారు. సాధారణంగా, అవి సగటున ఐదుసార్లు. అయితే, పీయూష్‌ గోయెల్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా 13సార్లుకు పెరిగింది. సరే, అది ఎన్నికల సందర్భం అనుకోండి. ప్రస్తుతం నిర్మాలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ఆ సంఖ్య మూడుకు పడిపోయింది. ఫిబ్రవరిలో చేసిన తన ఉపన్యాసంలో పీయూష్‌ గోయెల్‌ మధ్యతరగతివారికి ఇచ్చిన హామీలన్నింటినీ ఆమె మర్చిపోయారు. ప్రామాణిక మినహాయింపు పెంచడం, మూలం వద్ద పన్ను మినహాయింపు, పన్ను శ్లాబ్‌ల్లో రాయితీలు అన్నిటినీ నిర్మల విస్మరించారు. పేదలు కృతజ్ఞతతో ఓటు వేసినప్పుడు మధ్యతరగతివారు తమపై అపారమైన ప్రేమాభినాలతో ఓటువేస్తున్నప్పటికీ వారి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరమేముంది?

దశాబ్దాలుగా భారత దేశంలో ముస్లిం మైనారిటీ వర్గంతో మన లౌకికవాద పార్టీలు ఈవిధంగానే ఆటాడుకున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్‌ పట్ల భయంతో ముస్లింలు తమకు ఓటు వేస్తారని వారికి తెలుసు. అందుకే ముస్లింలకు ఏదైనా చేయాల్సిన అవసరం వారికి కనిపించలేదు. ప్రతిఫలంగా వారి ఓట్లన్నీ పడిపోతాయి. అటువంటి బలవత్తర కారణంతోనే ఇప్పుడు మెజార్టీ మధ్యతరగతి అంతా తమకు ఓటు వేస్తోందని బీజేపీకి అర్థమైపోయింది. మనం ఇప్పుడు వారిని ‘మోదీ ముస్లింలు’ అని పిలవడానికి కారణం అదే.

వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top