ఎల్‌.కె. అద్వానీ.. రాయని డైరీ

Madhav Singaraju Rayani Diary About LK Advani - Sakshi

రాహుల్‌ గాంధీకి లైన్‌ కలపమని చెప్పి కొన్ని ఏళ్లు అయినట్లుగా ఉంది.
‘‘ఏమైంది, దొరకట్లేదా?’’ అన్నాను. ‘అయ్యో అద్వానీజీ.. మీకు ఇప్పటికే కనీసం కొన్నిసార్లు చెప్పి ఉంటాను. రాహుల్‌జీ కొన్నాళ్లుగా రఘురామ్‌ రాజన్, అభిజిత్‌ బెనర్జీలతో ఉంటున్నారట’ అన్నాడు నాకు కేటాయించబడిన యువ సహాయకుడు. తొంభై ఏళ్లు పైబడిన వ్యక్తికి తొంభై ఏళ్లు పైబడిన సహాయకుడు మాత్రమే ఉపకరించే సహాయకుడిలా ఉండగలడేమో!

అభిజత్‌ బెనర్జీ కోల్‌కతాలో ఉన్నట్లు విన్నాను. రాజన్‌ ఈ మధ్య భోపాల్‌ వెళ్లినట్లున్నాడు. రాహుల్‌ వేయనాడ్‌లో ఉండాలి. అక్కడ లేకపోతే ఢిల్లీలో ఉండాలి. ఈ ముగ్గురూ ఎక్కడ కలుసుకుంటున్నట్లు! లాక్‌డౌన్‌లో గాయపడిన ఎకానమీకి కట్టు కడతానని దూది, గాజుగుడ్డ, టించరు బాటిలు పట్టుకుని కొన్నాళ్లుగా తిరుగుతున్నాడు రాజన్‌. అభిజిత్‌కి ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ వచ్చింది కాబట్టి తనూ ఏదో ఒకటి పట్టుకుని తిరగాలి. 

వాళ్లిద్దర్నీ పట్టుకున్నట్లున్నాడు రాహుల్‌. లాక్‌డౌన్‌ అని మూత వేసుకుని కూర్చుంటే నెలాఖరు తర్వాత అకౌంట్‌లో తెరిచి చూసుకోడానికి ఏముంటుంది అని మోదీజీ అడగడానికి రాహుల్‌ వాళ్లిద్దరితో ఉంటున్నట్లుంది. అయినా ఉండటమేంటి! అదే అడిగాను నా యువ సహాయకుడిని. 
‘‘జూమ్‌ వీడియోలో ఉంటున్నారట అద్వానీజీ’’ అన్నాడు. మళ్లీ ఒకసారి రాహుల్‌ కోసం ప్రయత్నించమని చెప్పాను. ‘నాకు నిద్ర వచ్చేలోపు ప్రయత్నించు’’ అని కళ్లు మూసుకున్నాను. 

‘‘అద్వానీజీ.. లైన్‌లో రాహుల్‌జీ’’ అన్నాడు యువ సహాయకుడు!
నన్ను నిద్రపోనివ్వకూడదనుకుని నేను నిద్రపోయే వరకు వేచి ఉండి అప్పుడు లైన్‌లోకి వచ్చాడా ఏంటి! ఫోన్‌ తీసుకున్నాను. 
‘‘నమస్తే అద్వానీజీ’’ అన్నాడు. 

‘‘నమస్తే రాహుల్‌ బాబు. చక్కగా మాట్లాడుతున్నావు ఈ మధ్య. చక్కగా కూడా కనిపిస్తున్నావు. కుర్తా పైజమా మీదకు ఆ నల్లటి జాకెట్‌ ఉండటం లేదిప్పుడు. రిలీఫ్‌గా ఉంది  నిన్ను అలా చూస్తుంటే..’’ అన్నాను. 
రాహుల్‌ నవ్వాడు. ‘‘థ్యాంక్యూ అద్వానీజీ. ఎందుకు కాల్‌ చేయించారు’’ అన్నాడు.

‘‘ఏం లేదు. నేను, జోషి, ఉమ, కల్యాణ్‌.. జూమ్‌లో కలుసుకుంటున్నాం. నువ్వూ కలుస్తావేమోనని’’ అన్నాను. 
‘‘ఓ.. బాబ్రీ కూల్చివేత కేసు! ఆగస్టులోపు తేల్చేయమంది కదా కోర్టు. అయినా అద్వానీజీ.. స్థలం ఎవరిదన్నది తేలిపోయాక, కూల్చిందెవరన్నది మాత్రం తేలిపోకుండా ఉంటుందా?’’ అన్నాడు రాహుల్‌. 

‘‘మంచి మాట చెప్పావు రాహుల్‌ బాబు. జూమ్‌కి కనెక్ట్‌ అవుతావా.. నేను, నువ్వు, జోషి, ఉమ, కల్యాణ్‌ మాట్లాడుకుందాం’’ అన్నాను. 
‘‘అది మీ పర్సనల్‌ విషయం కదా అద్వానీజీ. నేనెందుకు స్క్రీన్‌ పైకి రావడం?’’ అన్నాడు. 
‘‘మా నలుగురిదీ ఒక పర్సనల్‌ విషయం. నాదొక్కటే ఒక పర్సనల్‌ విషయం రాహుల్‌ బాబూ. నీకు చేతులు జోడిస్తే ఫోన్‌లో నీకు కనిపించదు కదా. అందుకే నిన్నూ కలవమని అడుగుతున్నా..’’ అన్నాను.

‘‘అద్వానీజీ!! మీరు నాకు చేతులు జోడించడం ఏమిటి? పెద్దవాళ్లు మీరు’’ అన్నాడు ఆశ్చర్యం కలిసిన గొంతుతో.
‘‘ఆ మాట అనొద్దనే నీకు చేతులు జోడించాలనుకుంటున్నా రాహుల్‌ బాబూ. కరోనా వల్ల ప్రమాదం పెద్దవాళ్లకే గానీ, మిగతా వాళ్లకేమీ భయం లేదని ప్రచారం చెయ్యమని మోదీజీకి చెబుతున్నావు. పెద్దవాళ్లకు కదా ధైర్యం చెప్పాల్సింది’’ అన్నాను. 
‘‘ఓ.. సారీ అద్వానీజీ. ఎకానమీ బతికితే చాలనుకున్నాను. ఈ యాంగిల్‌ నాకు తట్టలేదు’’ అన్నాడు!!
-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top