బొప్పి కట్టిన తెలుగు పెద్దతలలు

Karnataka Elections Results Damaged KCR Chandrababu Strategies - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్‌ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ కృష్ణకాంత్‌ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు.
కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తల దూర్చారు. ఇద్దరి తలలూ బొప్పి కట్టాయి. పైకి నొప్పి లేనట్టు నటిస్తున్నా ఇద్దరూ ఎవరూ చూడకుండా అద్దం ముందు నిలబడి బొప్పి తడుముకుని బావురుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిగ్గానే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారికి పిలుపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు ఎక్కువగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో లేదా హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డారు. బెంగళూరులో స్థిరపడ్డ తెలుగువారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారు. చంద్రబాబు పిలుపును వాళ్లెవరూ లెక్క చెయ్యలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి బీజేపీకి ఓట్లు పడకుండా చేయాలన్న ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కర్ణాటకలో బీజేపీ సీట్లు 2013 కంటే ఈసారి గణనీ యంగా పెరిగాయి.

ఎవరి ప్రయోజనాలు వారివి!
చంద్రబాబునాయుడు తిరుపతి నుంచే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటక తెలుగు వారికి పిలుపు ఇస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఒక ప్రత్యేక విమానంలో మందీమార్బలంతో వెళ్లి మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్‌ (ఎస్‌) అధ్యక్షుడు దేవెగౌడను ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలసి మద్దతు ప్రకటించి వచ్చారు. ఆయన ఆలోచన అక్కడ కాంగ్రెస్‌ గెలవకూడదని! అయితే ఇటీవలే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు నడుపుతానని బయలుదేరిన చంద్రశేఖరరావు బీజేపీ, కాంగ్రెస్‌ రెండు జాతీయ పార్టీలను దుయ్యబడుతున్న కారణంగా కర్ణాటకలో బీజేపీని గెలిపించాలని బహిరంగంగా ప్రకటించలేకపోయారు.

అయితే ఆయన రహస్య ఎజెండా మాత్రం బీజేపీకి మేలు చేయడమే అని రాజకీయ పండితుల వాదన. అందుకు కారణం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణలో తన ప్రథమ శత్రువుగా ఉన్న కాంగ్రెస్‌లో కొత్త ఊపు వస్తుంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంటుంది, జేడీ(ఎస్‌) పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ అస్తిత్వంతోనే కొనసాగుతున్నందున ఎక్కువ స్థానాలు వచ్చేటట్టు చేస్తే అది బీజేపీకి లాభించి అధికారంలోకి రావడానికి పనికొస్తుందన్నది కేసీఆర్‌ రహస్య ఎజెండా. అయితే ఆయన పిలుపును అందుకోవాల్సిన తెలుగువారు హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగువారు. వాళ్లలో ఎక్కువ మంది పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రం, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడ్డవారు. బెంగళూరులో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతపు తెలుగువారు చంద్రబాబు పిలుపును లెక్క చేయనట్టే, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంత తెలుగువారు చంద్రశేఖరరావు పిలుపును పట్టించుకోలేదు. అక్కడ జేడీ (ఎస్‌) కన్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు లభించాయి.

పైగా కేసీఆర్‌ బహిరంగంగా మద్దతు తెలిపిన జేడీ(ఎస్‌)కు మొన్నటి ఎన్నికలలో 2013 ఎన్నికల కంటే తక్కువ స్థానాలు లభిం చాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే ఆయన అనుకున్నదొకటి, అయింది మరొకటి. జేడీ (ఎస్‌) తెలంగాణలో తన ప్రథమ శత్రువు కాంగ్రెస్‌ గూట్లో చేరిపోయింది. మింగలేక కక్కలేక అన్నట్టు తయారయింది ఆయన పరిస్థితి. దానికి తోడు బీజేపీ నుంచి తమ ఎంఎల్‌ఏలను రక్షించుకోవడం కోసం శిబిరం ఏర్పాటుకు కేరళ వెళ్లాల్సిన కాంగ్రెస్, జేడీ(ఎస్‌) శాసనసభ్యులు హైదరాబాద్‌ బయలుదేరి రావడం కూడా కేసీఆర్‌కు మింగుడుపడని విషయమే. సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యమా అని హైదరాబాద్‌ శిబిరం ఒక్కరోజుతో ముగిసిపోయింది కానీ, ఏ పదిహేను రోజులో కొనసాగి ఉంటే జేడీ (ఎస్‌) బహిరంగ మిత్రుడిగా తన ఇలాఖాలో ఉన్నారు కాబట్టి కాపాడే చర్యలు గట్టిగా చేయవలసి వచ్చేది. అట్లా చేస్తే తన రహస్యమిత్రులు అమిత్‌ షా, మోదీల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చేది.

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వ్యూహం వేరు
ఎన్డీఏను వీడి వచ్చాక తన మీద కేసులు పెడతారని చంద్రబాబునాయుడు చాలా భయపడుతున్నారు. అది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీజేపీ బలహీనపడాలనీ, కర్ణాటకలో ఓడిపోతే బీజేపీ ముఖ్యంగా షా, మోదీ ద్వయం దూకుడుకు కళ్లెం పడుతుందనీ, దానితో తన జోలికి రాకుండా ఉంటారనీ చంద్రబాబు ఆశించారు. కానీ ఆయన ఆశ నెరవేరలేదు. కర్ణాటకలో బీజేపీ అధిక స్థానాలు పొందిన ఏకైక పార్టీగా అవతరించింది. చంద్రబాబు ఆశల మీద కర్ణాటక ప్రజలు ఆ విధంగా నీళ్లు జల్లి, చంద్రశేఖరరావుకు కూడా నిరాశే మిగిల్చారు. కాంగ్రెస్‌ స్థానాలు తగ్గాయి కానీ, అక్కడ అధికారంలో భాగస్వామిగా ఉండబోతున్నది. కాంగ్రెస్‌ అధినేత్రి సోని యాగాంధీ అత్యంత వేగంగా పావులు కదిపి జేడీ (ఎస్‌)ను బీజేపీ వైపు పోకుండా నిలువరించగలిగారు. తగిన సంఖ్యలో ఎంఎల్‌ఏలు లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడంలో దిట్టలని పేరుగాంచిన అమిత్‌ షా, మోదీలకే చెక్‌ పెట్టిన సోనియా రాజకీయ చతురతను అందరూ పొగుడుతున్నారు.

చంద్రబాబు గవర్నర్‌ను విమర్శించడమా!?
మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబునాయుడు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. కర్ణాటక తాజా పరిస్థితి మీద ఆయన అక్కడి గవర్నర్‌ పాత్రను తీవ్రంగా విమర్శించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్‌ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ కృష్ణకాంత్‌ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. వజూ భాయ్‌ వాలా రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటే కృష్ణకాంత్, నరసింహన్‌ల చేత తాను చేయించింది ఏమిటి? రాజ్యాంగ పరిరక్షణా? రాజ కీయాల్లో అధికారమే పరమావధి అయినప్పుడు మర్యాద, హుందాతనం వంటివి లుప్తమయిపోతుంటాయి.

ఒకప్పుడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినందుకు దేవత అని ప్రస్తుతించిన చంద్రశేఖరరావు ఈ రోజు బెంగళూరులో జరగనున్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడానికి కారణం అక్కడికి సోనియా, రాహుల్‌ తదితర కాంగ్రెస్‌ పెద్దలు వస్తున్నందునే. జేడీ (ఎస్‌), కాంగ్రెస్‌ మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటులో తానూ పాల్గొంటే తెలంగాణలో కాంగ్రెస్‌ నైతిక స్థయిర్యం పెరుగుతుందనే దుగ్ధతో బాటు సోనియాగాంధీని ముఖాముఖి ఎదుర్కోలేక పోవడమూ, బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకూడదన్న వెరపూ కారణం కావచ్చు. అందుకే ఆయన మంగళవారం సాయంత్రమే బెంగళూరు వెళ్లి కుమారస్వామికి అభినందనలు తెలిపి వచ్చేశారు.

అవతలి వైపు సోనియాగాంధీని దెయ్యం అనీ, ఇటలీ దేశీయురాలనీ నానా తిట్లూ తిట్టిన చంద్రబాబునాయుడుకుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరు బయలుదేరారు. సోనియా గాంధీ సరసన కూర్చోడానికి, కాంగ్రెస్‌ నాయకత్వంలో కొత్త కూటమి గూట్లో చేరిపోవడానికి తెగ ఆరాట పడిపోతున్నారాయన. భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు కాంగ్రెస్‌ నుంచి బయలుదేరిన చంద్రబాబు చివరికి అదే కాంగ్రెస్‌ పంచన చేరక తప్పని పరిస్థితి.

తెలంగాణ కాంగ్రెస్‌లో మథనం
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కాడి కింద పారేసింది కానీ తెలంగాణలో 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశ పడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు మాత్రం కొత్త గుబులు పట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక ఫలితం పునరావృతం అయితే ఎట్లా అన్న సందేహం వాళ్లనువెంటాడుతున్నది.తెలంగాణలో కర్ణాటక మాదిరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు కాంగ్రెస్‌కు లభించకపోతే, జేడీ (ఎస్‌) లాగా కోదండరాం నాయకత్వంలోని టీజేఎస్‌కో, టీటీడీపీకో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందేమో అన్నది వాళ్ల ఆందోళన. బీజేపీని నిలువరించడానికి కర్ణాటక మోడల్‌ను 2019 దాకా కొనసాగిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెస్తానని చెపుతున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నం అటకెక్కినట్టే. కొత్త, పాత మిత్రులతో మరో యూపీఏ ఏర్పాటయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్‌ ఎన్‌డీఏలో చేరడమో, ఒంటరిగా మిగిలిపోవడమో జరుగుతుంది.

దేవులపల్లి అమర్‌, datelinehyderabad@gmail.com 
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top