ఎన్నాళ్లీ నిరర్థక విన్యాసాలు?

K Ramachandra Murthy Article On Chandrababu Naidu Mind Game - Sakshi

త్రికాలమ్‌ 

వాస్తవాన్ని అవాస్తవంగానూ, అవాస్తవాన్ని వాస్తవంగానూ చిత్రించి నమ్మిం చడం రాజకీయాలలో ప్రధానక్రీడగా కొంతకాలంగా నడుస్తోంది. పౌరుల మన సులలోనే ఈ ఆట రాజకీయనేతలు ఆడతారు. వారు ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా ఆడతారనే దానిపైనే వారి రాజకీయ ఫలాలు ఆధారపడి ఉంటాయి. చాలా సంవత్సరాలుగా గమనించడం వల్ల ఒక రాజకీయనేత పట్ల ప్రజలలో ఒక స్థూలమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని మార్చడానికి రాజకీయనాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తాడు. అవి ఎంత ప్రభావవంతంగా ఉంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉంటాయి. వీటినే ‘మైండ్‌గేమ్స్‌’ అంటారు. ఈ క్రీడలో భాగంగా కొన్ని దృశ్యాలనూ, సన్నివేశాలనూ, వాతావరణాన్నీ పనికట్టుకొని సృష్టిస్తారు. ఒకే అభిప్రాయాన్ని అన్ని స్థాయిలలోనూ పదేపదే ప్రచారం చేస్తారు. దీన్నే ‘గ్లోబల్‌ ప్రచారం’ అంటున్నారు. నిజానికి ఇది ‘గోబెల్స్‌ ప్రచారం’. 1933 నుంచి 1945 వరకూ హిట్లర్‌ మంత్రిమండలిలో ప్రచార వ్యవహారాల మంత్రిగా పని చేసిన జోసెఫ్‌ గోబెల్స్‌ పేరు మీద వాడుకలోకి వచ్చిన మాట.

ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర బాబునాయుడు అందెవేసిన చేయి. 1995లో ముఖ్యమంత్రి పదవి హస్తగతం చేసుకున్నప్పుడూ, మరుసటి సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడూ, 2014 ఎన్నికలలో గెలుపొందినప్పుడూ ‘మైండ్‌ గేమ్స్‌’ చంద్రబాబుకు విశేషంగా దోహదం చేశాయి. ఈ క్రీడలో మీడియా సహ కారం అత్యంత కీలకం. సహచరుల తోడ్పాటూ అవసరం. నేతలపైనా, పార్టీల పైనా ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతం, సామాజిక వర్గం, వృత్తి, ప్రవృత్తి, ఆర్థికస్థాయి, సామీప్యత, మరికొన్ని ఇతర కారణాల ఆధా రంగా  అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ అభిప్రాయాలు అశాశ్వతం. స్వీయా నుభవం ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 2014లో కొత్త రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకుడికి అనుభవం ఉంటే బాగుంటుందని భావించి చంద్రబాబుకు ఓటు వేసినవారిలో చాలామంది కడచిన నాలుగున్నర సంత్సరాల అనుభవం కారణంగా తమ నిర్ణయం సరైనది కాదని గ్రహించి ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘మైండ్‌ గేమ్స్‌’ దిశలో మార్పు చేసే నేర్పు టీడీపీ అధినేతకు దండిగా ఉంది. విస్తారమైన తన అనుభవంతో (ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సహకారంతో అద్భుతాలు చేస్తానని నమ్మించారు. అవకాశం వచ్చినప్ప టికీ అన్ని రంగాలలోనూ విఫలమైనారు. అవినీతి మాత్రం విశృంఖలమై అన్ని రంగాలకూ విస్తరించింది. 

కథనంలో, దృశ్యంలో మార్పు
మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కథనం, దృశ్యం మార్చవలసిన అగత్యం ఏర్ప డింది. ప్రజలకోసం పోరాడతాననీ, అవసరమైతే ప్రధాని మోదీపైన తిరుగు బాటు చేస్తాననీ, ఆంధ్రుల ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తాననీ చంద్ర బాబు నమ్మబలుకుతున్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేం దుకు ఉద్దేశించింది ఈ వ్యూహం. ఈ దిశగా పోరాటానికి అవసరమైన ప్రాతిపది కను నిర్మించడానికి వీలుగానే ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత మోదీ తన వెంట పడబోతున్నట్టూ, కేంద్ర సంస్థల చేత దాడులు చేయించబోతున్నట్టూ వరుసగా ప్రకటనలు చేశారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తనకు రక్షణ వలయంగా నిలబడాలని అభ్యర్థించారు. దీనికి సమాంతరంగా ఒకానొక నటుడి చేత ‘ఆపరేషన్‌ గరుడ’ అనే టీవీ నాటకానికి తెరలేపారు. ఏది జరిగినా ఈ ఆప రేషన్‌లో భాగమేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళలో పార్టీని నడిపించడానికి ఆర్థిక సహాయం చేసిన వ్యాపార రాజకీయ నాయకులలో సుజనాచౌదరి, సీఎం రమేష్, నారా యణ ప్రముఖులు. వీరికి రాజకీయాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి, వ్యాపారా వకాశాలూ కల్పించి వారి వ్యాపారాలలో  చంద్రబాబు భాగస్వామ్యం స్వీకరించా  రన్నది బహిరంగ రహస్యం. వీరే కాకుండా టీడీపీ అధినేత సంకేతాలకు అను గుణంగా నిధులు సమకూర్చేవారూ, ఖర్చు చేసేవారూ అనేకమంది ఉంటారు. వారికి టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏదోరకంగా లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ దేశంలోని దాదాపు అన్ని పార్టీలలోనూ అటుఇటుగా ఉంటుంది. టీడీపీలో ఇది దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై బలంగా వేళ్ళూను కున్నది. 

కేంద్రం ఆధ్వర్యంలో నడిచే దర్యాప్తు సంస్థలు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు నమ్మడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చెప్పుచేతలలోనే అవి నడుస్తాయని అత్యధికుల అభిప్రాయం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను(ఐటీ) శాఖ, కేంద్ర నిఘా సంస్థ, ఇతర కేంద్ర సంస్థలు ఏవైనా ఒకానొక సంస్థలోనో, వ్యక్తి నివా సంలోనో సోదాలు జరిపినప్పుడు  చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అనుకోకుండా దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని దుయ్యపట్టడం రివాజు. రాజకీయ ప్రయోజనాలూ, అభిప్రాయాలూ, విధేయతలూ  ఇటువంటి సంద ర్భాలలో అనుసరించే వైఖరిని శాసిస్తాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అస్తమయం తర్వాత ఓదార్పుయాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి వైదొలిగి సొంతపార్టీ పెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డిపైన సీబీఐ సుదీర్ఘంగా దాడులు చేసి కేసులు పెట్టినప్పుడు సంబరపడినవారు ఇప్పుడు రేవంత్‌రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్‌ ఇళ్ళలోనూ, కార్యాలయా లలోనూ సోదాలు చేస్తే ఆంధ్రులపైన దాడి చేస్తున్నారంటూ, రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటున్నారు. అవినీతి ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుసు కనుక దాడులు జరుగుతాయని ముందే ఊహించి దానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించారు. ఇటువంటి పరిణామాలు రాకుండా నివారించేందుకే సుజనాచౌదరిని కేంద్రంలో మంత్రిగా నియమించి, సీఎం రమేష్‌ని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ)సభ్యుడిని చేశారు.

టీడీపీ ఎన్‌డీఏ నుంచి వైదొలగడమే కాకుండా గుజరాత్‌లోనూ, కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌కు వందల కోట్ల నిధులు టీడీపీ అధినేత పంపించారని మోదీకి సమాచారం అందిందనీ, అంతలేసి నిధులు ఎట్లా సమకూరుతున్నాయో తెలుసుకోవాలని ఆయన కుతూహలంగా ఉన్నారనీ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారసంస్థలలో ఐటీ అధికారులు సోదా చేయడం సర్వసామాన్య మనీ, ఇందుకు చంద్రబాబూ, లోకేశ్‌బాబూ భుజాలు తడుముకోవడం ఎందు కని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆ సంస్థలు వ్యవహరిం చినట్లయితే ఇప్పుడు జరుగుతున్న సోదాలు ఎప్పుడో జరగవలసింది. ఎన్‌డీ ఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడే అమరావతిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జరిగింది. ఇసుకమాఫియా స్వైరవిహారం చేసింది. పోలవరం, పట్టిసీమ, ఇతర సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి సాగింది. ఎన్‌డీఏ నుంచి తప్పుకున్న కార ణంగా, ఉక్కు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలని వారం రోజులు దీక్ష చేసిన కారణంగా ఐటీ శాఖను ప్రధాని ప్రయోగించారన్నట్టు ధ్వనించే విధంగా ఇప్పుడు మీడి యాలో రాస్తున్నారు. అప్పుడు సోనియాగాంధీని ధిక్కరించిన కారణంగా సీబీ ఐని ప్రయోగించారని ఇదే మీడియా రాయలేదు.

హాస్యాస్పదమైన వ్యాఖ్యలు 
కొన్ని హాస్యాస్పదమైన ప్రకటనలకు కూడా మీడియా  ప్రచారం ఇస్తోంది. అభి వృద్ధిలో గుజరాత్‌ను తలదన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడ ముందుకు పోతుందోనన్న భయంతో, ఈర్ష్యతో, చంద్రబాబుకి తనకంటే ఎక్కువ కీర్తి వస్తున్నదనే దుగ్ధతో మోదీ కుట్రపూరితంగా ఐటీ అధికారులతో  చేయిస్తున్నారంటూ ఆరోపిస్తు న్నారు. అక్షరాస్యతలో, తలసరి ఆదాయంలో, ఇతర అభివృద్ధి సూచికలలో బిహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోటీ పడుతూనే అన్నింటిలోనూ నంబర్‌ ఒన్‌ అంటూ ప్రచారం చేసుకునే వైఖరికి ఇది కొనసాగింపు. కానీ ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. వారికీ తెలివితేటలు ఉంటాయనీ, ఇంగితజ్ఞానం, కనీస పరిజ్ఞానం ఉంటాయనీ, ధర్మాధర్మ విచక్షణ వారి అంతరాత్మకు ప్రబోధం చేస్తుందనీ గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగున్నరేళ్ళుగా ప్రాజెక్టుల పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో, అంచనాలు ఎంత విచ్చలవిడిగా సవరిస్తున్నారో, కాంట్రాక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌పైన ఎట్లా ఎవరికి కట్టబెడు తున్నారో ప్రజలకు రేఖామాత్రంగానైనా తెలియకపోదు. పాత కాంట్రాక్టర్లపైన 60 సి నిబంధనను ప్రయోగించి వేటు వేయడం, మిగిలిన పనుల వ్యయ అంచనాలు పెంచివేసి రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అన్ని కాంట్రాక్టులూ రమేష్‌కే దోచిపెడుతున్నారంటూ వరదరాజులురెడ్డి వంటి టీడీపీ నాయకులే బహిరంగంగా ఫిర్యాదు చేసే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది.

మొత్తం రూ. 3,658 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు ఇచ్చినట్టు చెబుతున్నారు. హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులలోనే అంచనాలు విపరీతంగా పెంచి నామినేషన్‌ పద్ధతిపైన రూ. 1,156కోట్ల విలువైన పనులు రమేష్‌కు అప్పగించారు. చిత్తూరు జిల్లాలో 1980–90 మ«ధ్య కాలంలో సారా వ్యాపారం చేసిన రమేష్‌ చంద్రబాబుకి ఎట్లా దగ్గరైనారో, తిరుపతి దగ్గర 300 ఎకరాల గుడిమాన్యం తక్కువ ధరకు ఎట్లా ఇప్పించారో, ఆ భూమిని తాకట్టు పెట్టించి బ్యాంకు రుణంతో రిత్విక్‌ కంపెనీ ఎట్లా పెట్టించారో చాలామందికి తెలుసు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులకు రాయలసీమలో రమేష్, దక్షిణ కోస్తాంధ్రలో నారాయణ, తెలంగాణలో సుజనాచౌదరి ఏ విధంగా ఆర్థిక సహా యం చేశారో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. కాంట్రాక్టు తీసుకోవడం, సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వడం, సబ్‌కాంట్రాక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేయడం, వాటిని నగదు రూపంలో డ్రా చేయడం నిరవధికంగా జరిగినట్టు ఐటీ శాఖ అధికారులు అలహాబాద్‌ బ్యాంక్‌ లావాదేవీల ద్వారా గమనించినట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. బ్యాంకులో అప్పులు తీసుకొని, నిధులు దారి మళ్ళించి, అప్పులు ఎగగొట్టిన వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేశారు. ముఖ్యమంత్రి మెహర్బానీ కారణంగా నామి నేషన్‌ పద్ధతిపైన వేలకోట్ల రూపాయల విలువ కలిగిన పనులు సంపాదిం చుకున్న వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు చేశారు. వారు వ్యాపారరాజకీయులు.

ప్రజలు నవ్వుకోరా?
ఇటువంటి తనిఖీలు జరిగినప్పుడు వ్యాపారరాజకీయులను వెనకేసుకొస్తే  ప్రజలు మెచ్చుతారా? ఐటీ సోదాలను ఆంధ్రులపైన దాడిగా అభివర్ణించడం ఆంధ్రులకు గౌరవప్రదమా? ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలూ, పెట్టుబడులూ రాకుండా చేసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ మంత్రి పదవిలో ఉన్నవారు ఆరోపించడం శోభాయమానంగా ఉంటుందా? తప్పు చేయకపోతే భయపడటం ఎందుకని ప్రజలు ఆలోచించరా? నిజానికి ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేసి అన్నీ సక్రమంగానే ఉన్నాయని కితాబు ఇస్తే సదరు రాజకీయవ్యాపారి ప్రతిష్ఠ పెరగదా? సోదాలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించకముందే ‘కక్ష రాజకీయాలు’ అంటూ ధ్వజమెత్తడం సమంజసమేనా? రేవంత్‌రెడ్డి ఇంటి లోనూ, ఆయన బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరిగినప్పుడు చంద్రబాబు స్పందించడం ఎందుకు? ‘అఫెన్స్‌ ఈజ్‌ ది బెస్ట్‌ వే ఆఫ్‌ డిఫెన్స్‌ (ఆత్మరక్షణకోసం ముందే ఎదురుదాడి చేయడం ఉత్తమం)’ అంటారు. ఇదే పద్ధతి చంద్రబాబు అవలంబించారు. కానీ ఎవరికి కొమ్ముకాస్తున్నారో, వారి గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏమిటో గమనించడం లేదు. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారనీ, ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే తెలివితేటలు పల్లెల్లో నివసించే రైతులకు కూడా ఉంటాయని మరచిపోకూడదు.

ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని నిర్ణయాలు పారదర్శకంగా జరగాలని ప్రగతికాముకులూ, ప్రజాస్వామ్యప్రియులూ కోరుకుంటారు. సాగునీటి ప్రాజె క్టులకూ, రోడ్ల నిర్మాణానికీ, ఇతర ప్రభుత్వ పనులకూ కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతి ధర్మంగా, న్యాయంగా ఉండాలి. ప్రాజెక్టుల వ్యయం అంచనాలను సవరించే విషయం సైతం అందరికీ సమంజసంగా కనిపించాలి. ఈ రెండు అంశాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏదైనా రాజ్యాంగబద్ధమైన సంస్థ పరిశీలించి ఆమోదించిన తర్వాతనే అమలు జరగాలి. వ్యాపారులే రాజకీయ నాయకులు కావడం, వ్యాపారరాజకీయ నాయకులో, కాంట్రాక్టర్లో ముఖ్యమంత్రులకు బినా మీలు కావడం, వారే ఎన్నికలలో ఖర్చులకు నిధులు సమకూర్చడం అనే విష వలయాన్ని ఛేదించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది.


కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top