కరోనా యుద్ధకాలంలో బడి నిర్వహణ | Sakshi
Sakshi News home page

కరోనా యుద్ధకాలంలో బడి నిర్వహణ

Published Tue, Jun 9 2020 1:15 AM

Juluri Gowri Shankar Article Schools Maintenance In CoronaVirus Situation - Sakshi

ఆకలిని తీర్చే అన్నంముద్ద ఎంత ముఖ్యమైనదో, సమా జాన్ని నడిపించే జ్ఞానం అంతే ముఖ్యమైనది. అందుకే బడి చాలా ముఖ్యమైనది. అందరికీ చదువుకొనే అర్హత లేదన్న దగ్గర్నుంచి మన విద్యా భ్యాసం మొదలైంది. ఈ బడి అందరిదీ కావటానికీ, ఆడ పిల్లలు బడిలోకి అడుగు పెట్టడానికీ ఎన్నెన్నో పోరా టాలు, ఎంతెంతో మానసిక అలజడులు, సంఘర్ష ణలూ జరిగాయి. బడిని మనం సంరక్షించుకున్న ప్పుడే, ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుం టుందన్న’ కొఠారి చెప్పిన మాట సంపూర్ణ ఆచరణ రూపం దాల్చుతుంది.

ఈ కరోనా కాలంలో బాలలను రక్షించుకుంటూ ముందుకుసాగే కరిక్యులంను తయారుచేసుకోవాలి. గ్లోబల్‌ స్టాండర్డ్స్‌తో పాటుగా కరోనా స్టాండర్డ్స్‌తో తరగతి గది రూపకల్పన జరగాలి. ఇంటి కంటే ఎక్కు వగా బడిలో ఉండే పిల్లలపై తల్లిదండ్రులకంటే అత్యంత శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత బడి నిర్వా హకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉంటుంది. కష్టకాలంలో ఆర్థిక వనరులు, వసతు లను ఏ మేరకు వినియోగించుకుని బడిని ఎట్లా నడి పించుకోవాలో ఏ స్కూలుకు ఆ స్కూలు స్థానిక ప్రణా ళికలను తయారుచేసుకోవాలి. మాస్కులు తయారు చేసుకోవటానికి ప్రభుత్వం చేనేత బట్టను అంద జేస్తుంది. పిల్లలకు కుట్టుమిషన్‌పై కొంత అవగాహన కల్పించి ఒకటి రెండు మిషన్లను ఇస్తే పిల్లలు క్రాఫ్ట్‌ పని కింద తమకు కావాల్సిన మాస్కులు తామే తయారు చేసుకోగలుగుతారు. ఎ

క్కడికక్కడ గ్రామ సచివాలయాల్లోనే శానిటైజర్స్‌ను తయారుచేసుకునే స్థితిరావాలి. మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందిం చడంలో భౌతికదూరం ఎలా పాటించాలో పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను తయారు చేస్తుంది. ఆట స్థలాల్లోకి వెళ్లటం, బస్సుల్లో ఎక్కేటప్పుడు, కూర్చునే టప్పుడు, స్కూలు ప్రాంగణంలో ఉండే విధానం, ఎదుటివారిని పలకరించుకునేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ ఎలా మెలగాలి, వూర్లో నడుచు కుంటూ పోయేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి వాళ్లు మంచినీళ్లు వెంటతెచ్చుకోవటం, తిన్న కంచాలను శుభ్రపరుచుకోవటం, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ చేతులు కడుక్కోవటం, చేతి రుమాళ్ల వాడకం, పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవటం లాంటి జాగ్రత్తలన్నీ విద్యార్థులకు ప్రత్యేకించి చెప్పాలి. మార్నింగ్‌ అసెంబ్లీ ఉంటుందా, ఉండదా? క్లాస్‌లో, స్కూల్‌లో పిల్లలు ఉండే విధానం, అంత ర్జాతీయంగా యునెస్కో సూచించిన సూచనలు దేశంలోని ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ సంస్థలు తెలియజేస్తాయి. ఒకటి నుంచి 10 తరగతుల వరకు పిల్లలకు ఉపాధ్యాయులు నేరుగానే బోధన చేయాలి. అది తప్పదని విద్యారంగ నిష్ణాతులు చెబుతున్నారు. దీనిపై మరింత లోతైన చర్చ జరగాలి. పిల్లల సంఖ్యను తగ్గించటానికి పనిదినాల్లో మార్పులు చేయడం, రోజు విడిచి రోజు స్కూలు నడపాలా, వద్దా? షిఫ్ట్‌ సిస్టమ్‌ ఉండాలా, వద్దా? తరగతిగది రూపురేఖలు ఎలా ఉండాలి? తదితర విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శక సూత్రాలు ప్రకటిస్తాయి. ఇక హాస్టల్స్‌ నిర్వహణ అతిముఖ్య మైంది. రాష్ట్రంలో 1,000కి పైగా వున్న గురుకులాల్లో విద్యాబోధనకు ప్రత్యేక ప్రణాళికలు తయారుచేసు కోవాలి. కరోనా నేపథ్యంలో వాటి విస్తీర్ణత పెంచ వలసి ఉంటుందా ఆలోచించాలి. హాస్టల్‌ గదులలో విద్యార్థుల సంఖ్యను శాస్త్రీయంగా నిర్ణయించాలి. 

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, గురుకులాలను నెలకొల్పింది. ఈ గురుకులాల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణలో 5 లక్షల పేద, బీద కుటుంబాల పిల్లలకు ఈ గురుకులాలు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి.  సంచారజాతుల పిల్లలు ఈ గురుకులాల్లో చేరి నాణ్యమైన విద్యను పొందుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆది వాసీ వర్గాలకు చెందిన ఈ గురుకులాలు అత్యాధునిక కార్పొరేట్‌ స్థాయి సంస్థలను మించిన స్కూళ్లగా నిలిచాయి. పదవతరగతి విద్యార్థుల అత్యధిక ర్యాంకులు, అత్యధికశాతం ఫలితాలు ఈ సంస్థలనుంచే వస్తున్నాయి. కరోనా కాలం సవాళ్లను ఈ గురుకులాలు తీసుకుని దిగ్విజయంగా విద్యాబండిని ముందుకు నడిపించే శక్తి వీటికి ఉంది.  

కరోనా కాలంలో బడినిర్వహణ అన్నది పెద్ద సవాల్‌. ఈ సవాల్‌ను స్వీకరిస్తూ రేపటి తరాన్ని తయారుచేయవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వాల పైన, బోధించే గురువులపైన, తల్లిదండ్రులపైన, పౌరసమాజాలపైన ఉంది. అవును, అప్పుడే తరగతి గదిలో దేశభవిష్యత్తు రూపకల్పన జరుగుతుంది.


జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త కవి, విమర్శకులు
మొబైల్‌ : 94401 69896 

Advertisement
Advertisement