కష్టకాలంలోనూ ఎగురుతున్న గుర్రాలు

Unicorns Of India: Decoding Indias 100 Unicorns Report 2022 - Sakshi

విశ్లేషణ

కనీసం వందకోట్ల డాలర్ల విలువను సాధించగలిగిన స్టార్టప్‌ సంస్థలను యూనికార్న్‌లు అంటున్నారు. 2022 నాటికి భారత్‌ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవి ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ యూనికార్న్‌లను కలిగిన దేశం మనదే. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను వీటి అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ వ్యాప్తి గురించి అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి.

ఉక్రెయిన్‌లో సైనిక సంఘర్షణ, పెరుగుతున్న అంతర్జాతీయ వడ్డీరేట్లు అనే ద్వంద్వ తాకిడి నుంచి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థ మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ, ఒక రంగం మాత్రం శరవేగంగా పెరుగుతోంది. బాహ్య పరిణామాలకు ఈ రంగం ఏమాత్రం ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. ఆ రంగం ఏదో కాదు, యూనికార్న్‌లు అని పేరొందిన భారీ స్టార్టప్‌ సంస్థలు. ఈ సంవత్సరం భారత్‌ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. 2011లో దేశంలో తొలి స్టార్టప్‌ వెంచర్‌ యూనికార్న్‌గా మారి దశాబ్దం గడిచింది. ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత యూనికార్న్‌ సంస్థలు అధికంగా ఉన్న మూడో దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. ఉమ్మడిగా చూస్తే ఈ వంద స్టార్టప్‌ సంస్థలు 90 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి మొత్తం విలువ ఇప్పుడు 333 బిలియన్‌ డాలర్ల వద్ద నిలిచింది.

ఒక బిలియన్‌ డాలర్ల విలువను మార్కెట్లో సాధించిన స్టార్టప్‌ కంపెనీని యూనికార్న్‌ అని పిలుస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి వెంచర్లు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి పూర్వకాలపు పౌరాణిక ఒంటికొమ్ము రెక్కల గుర్రాల్లాగా వీటిని వర్ణించేవారు. కానీ ఇప్పుడు, అమెరికా 487 యూనికార్న్‌ సంస్థలనూ, చైనా 301 సంస్థలనూ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యూనికార్న్‌ అనే పదం డెకాకార్న్‌ వరకు విస్తరిస్తోంది. అంటే కనీసం 10 బిలియన్‌ డాలర్ల విలువ గల సంస్థలుగా ఇవి ఎదుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫ్లిప్‌కార్ట్, నైకా, బైజూస్, స్విగ్గీ వంటి కొన్ని స్టార్టప్‌ సంస్థలు 10 బిలియన్‌ డాలర్ల నిధులు సేకరించిన వెంచర్లుగా నమోదయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2020 సంవత్సరం నుంచే యూనికార్న్‌ వెంచర్లు బాగా పెరుగుతూండటమే. మరో మాటలో చెప్పాలంటే, మహమ్మారి తర్వాతే ఇవి విస్తరిస్తున్నాయి. ఆ సంవత్సరం దేశంలో 11 యూనికార్న్‌ సంస్థలు ఆవిర్బవించాయి. 2021లో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 44. ఈ ఏడాది గత ఆరునెలల కాలంలో 16 ఏర్పడటం విశేషం. ‘ఇంక్‌42’ సంస్థ ప్రకారం, 2025 నాటికి దేశంలో 250 యూనికార్న్‌లు ఏర్పడతాయని అంచనా. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల యూనికార్న్‌లలో ఫండింగ్‌ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ, 2022లో కూడా ఇన్నోవేషన్, స్టార్టప్‌ల ఎకో–సిస్టమ్‌ ఇప్పటికీ వికాస దశలోనే సాగుతోంది. ఫండింగ్‌కి సంబంధించి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ అనేక స్టార్టప్‌లు ఈ సంవత్సరం కూడా యూనికార్న్‌ క్లబ్‌లో చేరనున్నాయి.

మహమ్మారి కాలంలో ఆఫీసుకు నేరుగా వెళ్లి పనిచేసే పద్ధతి నుంచి, ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ప్రపంచం మారిపోయింది. ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతి... ఇంటర్నెట్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లవైపు సృజనాత్మక ఆవిష్కరణలను మళ్లించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లడంలో అవరోధాలు ఏర్పడటంతో ప్రజాజీవితంలో ఇంటర్నెట్‌ మరింత పెద్ద పాత్ర వహించే స్థాయికి పరిణమించింది. కాబట్టి రిటైల్‌ కొనుగోళ్లు చేయడం, ఆర్థిక లావాదేవీలను సాగించడం, బిజినెస్‌ను నిర్వహించడంతో పాటు విద్య సైతం ఆన్‌లైన్‌ యాక్టివిటీగా మారిపోయింది. పేటీఎం, మొబివిక్‌ వంటి ఫిన్‌టెక్‌ కంపెనీల ద్వారా... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ–కామర్స్‌ కంపెనీల ద్వారా డిజిటల్‌ చెల్లింపులు విస్తృతరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే బిగ్‌ బాస్కెట్‌ వంటి తాజా స్టార్టప్‌లు దేశంలోని 2వ, 3వ శ్రేణి నగరాల్లో వేగంగా విస్తరించాయి.

యూనికార్న్‌ ప్రపంచం విస్తరణకు మరొక కారణం సులభమైన ఫండింగ్‌. దేశంలో డిజిటల్‌ ఎకో సిస్టమ్‌ విస్తరణకు అపారమైన అవకాశం ఉంటుందని మదుపుదారులు గ్రహిస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్‌ వ్యాప్తి ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువ స్థాయిలో, అంటే 41 శాతంగానే కొనసాగుతోంది. అంటే ఈ రంగంలో పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క. అయితే ఆన్‌లైన్‌ స్పేస్‌లో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది. వాట్సాప్‌ లాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్న వారు సైతం ఫిజికల్‌ రిటైల్‌ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారని తాజా డేటా చెబుతోంది. దేశంలోని 44 కోట్లమంది వాట్సాప్‌ యూజర్లలో 15 శాతంమంది మాత్రమే ఆన్‌లైన్‌లో కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే అయిదు లేదా పది సంవత్సరాల కాలంలో వెంచర్‌ కేపిటల్‌ ఫండ్స్‌ దీర్ఘకాలిక అంచనాల ప్రాతిపదికపై మదుపు పెట్టడానికి సిద్ధపడటం ఖాయం అని తేలుతోంది.

గత సంవత్సరం నుంచి చైనాలో టెక్‌ కంపెనీలపై రెగ్యులేటరీ నిబంధనలను పెంచుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో వెంచర్‌ కేపిటలిస్టులు మన దేశంలోని పరిణామాలపై తాజాగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద చూస్తే, లాభదాయకమైన ఐడియాలపైనే మదుపుదారులు డబ్బు పెడతారన్నది నిజం. గత కొన్ని సంవత్సరాల్లో ప్రారంభమైన అనేక స్టార్టప్‌ సంస్థలు ఫిన్‌టెక్, ఈ–కామర్స్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ కేటగిరీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది.

కొన్ని సమస్యలను ఎంపిక చేయడం కష్టమే అవుతుంది గానీ, నైకా సంస్థ ఆన్‌లెన్‌ మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల విషయంలో గ్యాప్‌ ఉన్నట్లు కనుగొన్నది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్‌లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మీషో సంస్థ కనుగొంది. దేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లను (33) కలిగి ఉన్న ఫిన్‌ టెక్‌ సంస్థలు రిటైల్‌ వినియోగదారులతోపాటు వ్యాపార సంస్థల డిజిటల్‌ చెల్లింపుల అవసరాలను కూడా పూరించడంలో అధిక కృషి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ బిజినెస్‌లలో ఉన్న ఖాళీలను పూరించడంలో సాయపడేందుకు ‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌’ స్టార్టప్‌లు ముందుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్‌ లేదా ఎడ్‌టెక్‌ వెంచర్లుగా పేరొందిన సంస్థలు బైజూస్‌ వంటి డెకాకార్న్‌ల వికాసానికి దారితీశాయి. మహమ్మారి కాలంలో ఆరోగ్య సంరక్షణ మరో ప్రాధాన్య రంగంగా ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల ఇన్నోవస్సెర్, ఫార్మియాసీ, క్యూర్‌ఫిట్, ప్రిస్టిన్‌ కేర్‌ వంటి శైశవదశలోని యూనికార్న్‌ల ఆవిర్భావానికి తావిచ్చాయి.

యూనికార్న్‌లు ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయనడంలో సందేహమే లేదు. ప్రత్యేకించి ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను యూనికార్న్‌ల అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ అభివృద్ధి గురించి మరీ అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. కొన్ని యూనికార్న్‌లు హైరింగ్‌ రంగంలో అడుగుపెట్టాయి. అయితే మొత్తం ఉపాధిరంగంలో తమదైన పాత్ర పోషించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఇలాంటి వెంచర్లకు నిధులు లభ్యం కావడం లేదన్నది వాస్తవం.

అదే సమయంలో, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, డెకాకార్న్‌ల వంటి వెంచర్లను దీర్ఘకాలిక దృష్టితోనే అంచనా వేయాలి. కాలం గడిచేకొద్దీ ఈ తరహా వెంచర్లు దేశాన్ని మరింత వేగంగా డిజిటల్‌ యుగంలోకి తీసుకెళతాయి. అంతే కాకుండా అంతిమంగా అసమానతలను తగ్గించడం వైపు దేశాన్ని నడిపిస్తాయి. అంతిమంగా, యూనికార్న్‌లను ఒంటరి ద్వీపాల్లాగా చూడకూడదు. దేశ వాణిజ్య వాతావరణంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే ఉత్ప్రేరకాలుగా ఇవి పనిచేస్తాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు వేటికవి విడివిడిగా ఉంటాయి కానీ సాంప్రదాయికమైన ఇటుకలు, ఫిరంగి తయారీ పరిశ్రమల్లో సైతం ఇవి సృజనాత్మకతను పెంచుతున్నాయి. ‘బిగ్‌ టెక్‌’ కంపెనీ విదేశాల్లోనూ స్టార్టప్‌ల నుంచే ఆవిర్భవించింది. ప్రపంచమంతటా ఇప్పుడు స్టార్టప్‌ల రాజ్యం నడుస్తోంది.
 


సుష్మా రామచంద్రన్‌
వ్యాసకర్త ఫైనాన్షియల్‌ జర్నలిస్టు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top