అర్థవంతమైన చర్చతోనే అసలైన రాజధాని

IYR Krishna Rao Writes Guest Column On AP Capital Issue - Sakshi

విశ్లేషణ

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వెళ్లే వరద కన్నా పై నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడం సహజం. ఈనాడు అదే జరిగి రాజధానిలో పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి. స్థల అనుకూలతను పరిగణలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు ఈ నిర్ణయం మోసపూరితంగా తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు. ఆంగ్లో సాకసన్‌ దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది.  

ఈమధ్య కృష్ణానదిలో వచ్చిన వరదల తర్వాత రాజధాని ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం సరి అయినదా కాదా అనే అంశంపై చర్చ మొదలైంది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకన్నా పెద్ద వరద రాదనే నమ్మకం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భూ స్వభావాన్ని పట్టి  ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య వచ్చిన వరదలలో అధికంగా 9 లక్షల క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర వదిలారు. 2009లో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవహించింది. ఇక మొన్నటి దాకా టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు, ప్రస్తు్తతం బీజేపీ  నాయకుడు అయిన టీజీ వెంకటేష్‌ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెంకటేష్‌ రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడు. సాధారణంగా రాయలసీమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతుంటారు. 

రాజధాని స్థల ఎంపికను గురించి నా పుస్తకం ‘ఎవరి రాజధాని అమరావతి‘ లో విపులంగా చర్చించా. అందులో ఒక అంశాన్ని ఉటంకిస్తున్నాను. ‘ముందుగా అనుకూలతను  అధ్యయనం చేయకుండానే సర్వే చేయకుండానే రాజధాని స్థలాన్ని నిర్ధారణ చేసిన ఏకైక ప్రాంతంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది‘. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్‌  కమిటీ ఒక మహా నగర నిర్మాణ ప్రయత్నం ఆత్మహత్యా సదృశం అవుతుందని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెపుతూ రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరైన మార్గమని సూచించింది. ఈ సిఫార్సులను పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు ఆరంభించింది. 

ఆనాటి  పురపాలక శాఖామాత్యులు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల కమిటీ ఎటువంటి సిఫార్సులు ఇవ్వలేదు. ఈ రకంగా స్థల అనుకూలతను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. ఆనాటి పాకిస్తాన్‌ అధ్యక్షులు అయూబ్‌ ఖాన్‌ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. స్థల నిర్ధారణ సమయంలో ఆ ప్రాంతం భూకంపాల ప్రభావిత ప్రాంతంగా గుర్తించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి ఇస్లామాబాద్‌ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజధాని ఎంపికకు కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగి వివిధ ప్రాంతాల మధ్య రాజీ మార్గంగా ఏకాభిప్రాయంతో ఆనాడు రాజధానిని కర్నూలులో, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చర్చ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం లేకుండా వ్యూహాత్మకంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తీసుకొని ముందు అనుకున్న విధంగా కృష్ణా నది తీర ప్రాంతంలో బాబు గారు రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. అందుకనే 52మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు రాజధాని ఎంపికలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు అని గట్టిగా భావించారు కాబట్టే అటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇదేరకమైన భావన ఉత్తరకోస్తా ప్రాంతాల్లో కూడా లేకపోలేదు. 

రాజధానులు వాటి నిర్మాణం గురించి కూలంకషంగా అధ్యయనం చేసి వాదిం రాస్‌మన్‌ ‘క్యాపిటల్‌ సిటీస్‌ వెరైటీస్‌ అండ్‌ పేట్రన్స్‌ ఆఫ్‌ డెవలప్మెంట్‌ అండ్‌ రీ లొకేషన్‌ ‘అనే పుస్తకం రాశారు. దానిలో ఆయన రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో తమకు ఉనికి ఉందని వారు భావిస్తున్నారా? రాజధాని నుంచి వచ్చే ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు లభిస్తున్నాయా? అనేవి ముఖ్యమైన అంశాలని ఈ నిష్పాక్షికత అందరినీ కలుపుకుపోవడం అన్నదే ప్రభుత్వానికి న్యాయసమ్మతం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. పైఅంశాలలో వేటినీ అమరావతి స్థల సమీకరణలో పాటించలేదనేది తేటతెల్లమవుతుంది. 

విజయవంతంగా నిర్వహించబడుతున్న రాజధానుల విషయంలో స్థల ఎంపిక విషయంలో ఎటువంటి  ప్రక్రియను అనుసరించారో పరిశీలిద్దాం. ఆంగ్లో సాకసన్‌ దేశాలైన ఆస్ట్రే లియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. ఈ దేశాలలో ఏర్పడిన రాజధానులు కేవలం పరిపాలన రాజధానులుగానే ఉన్నాయి. ఆ దేశాలలో ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. రాజధానులుగా ఈ పట్టణాలు విజయవంతంగా నడవటానికి కారణం వీటి ఏర్పాటు వివిధ వర్గాలు ప్రాంతాల మధ్య సర్దుబాటు ఫలితంగా ఏర్పడటమే. ఇటువంటి విశాల విధానాన్ని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు అనుసరించలేదు. అటువంటప్పుడు ఈ అంశాన్ని పునఃపరిశీలించి అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

చారిత్రకంగా జరిగిపోయింది కాబట్టి ఈ అంశాన్ని తిరగతోడడం సరికాదు అనేవాళ్ళు వినిపించే వాదనలు వేరే ఉన్నాయి. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, నిర్ణయంలో మార్పు వల్ల వాళ్లకు నష్టం జరుగుతుందని ఒక వాదన. ప్రభుత్వ ధనాన్ని చాలా ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు ఈ అంశాన్ని పునః పరిశీలించటం సరికాకపోవచ్చని రెండవ వాదన. ఈ రెండు వాదనలు ఇక్కడ పరిశీలిద్దాం. భూ సమీకరణ  కేవలం స్వచ్ఛందంగానే ఇవ్వలేదని చాలా వరకు ప్రభుత్వం బలవంతం చేయడం ద్వారా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా, మభ్యపెట్టడం ద్వారా భూ సమీకరణ పూర్తి చేసిందని ఆ రోజుల్లోనే ఈ అంశాన్ని పరిశీలించిన కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. 

ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి రిజిస్టర్‌ అయినది ఎంత, రైతుల చేతిలోనే ఉన్న భూమి ఎంత, ప్రభుత్వ అవసరాలకు కానీ, వివిధ సంస్థలకుగాని కేటాయించిన భూములు ఎంత, పనులు మొదలు పెట్టిన భూములు ఎంత అనే వివరాలు వెల్లడిస్తే ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజధాని స్థల ఎంపికకు ముందు పెద్ద ఎత్తున ఇన్సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కనుక ఆ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి. 

ఇక రెండో అంశం పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు ఇక్కడ ఇప్పటికే వెచ్చించడం జరిగింది కాబట్టి ఈ సమయంలో రాజధాని తరలింపు చర్చ అర్థరహితం అనేది కొందరి వాదన. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో నమూనాల పరిశీలన, నిర్ధారణ లోనే పుణ్యకాలం అంతా వెచ్చించింది. పెద్ద స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే జరిగాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వం పూర్తి  స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత స్థాయి లో ప్రభుత్వ నిధులు ఇప్పటికే వినియోగం అయినాయి. దానికి అను గుణంగా పూర్తయిన భవనాలు ఎన్ని? ఈ సమాచారం ఆధారంగా ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరిపే అవకాశం ఉంటుంది. 

చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆనాడు రాజధానికి స్థల సేకరణ సమయంలో ఈ అర్థవంతమైన చర్చ పూర్తిగా లోపిం చింది. అటువంటి చర్చ జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే అవకాశం ఎంతైనా ఉంది. ఈనాడు రాజధానిని మార్చాలి అనే ప్రతిపాదన తుగ్లక్‌ ప్రతిపాదనగా వర్ణించే వారికి నా సమాధానం ఒక్కటే. తుగ్లక్‌  కొన్ని శతాబ్దాలుగా దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని మార్చటానికి ప్రయత్నించాడు. ఈనాడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏకపక్షంగా రాజధాని ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని. దీనిని తుగ్లక్‌ చర్యతో పోల్చటం భావ్యం కాదు. పోల్చాలి అనుకుంటే బ్రిటిష్‌ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన చర్యతో పోల్చవచ్చు. 


వ్యాసకర్త: ఐవైఆర్‌ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్‌ : iyrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top