బెడిసి కొట్టిన రాజకీయ క్రీడ

Guest Column By YSRCP leader UmmaReddy Venkateshwarlu Over telangana Politics - Sakshi

సందర్భం
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో విలక్షత కన్పించింది ఒక్క తెలంగాణలోనే. తక్కిన 4 రాష్ట్రాలలో ఓటర్లు మార్పును ఆశించారు, ఆహ్వానించారు. తెలంగాణ ఓటరు మాత్రం తమకు ఆ అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రజా కూటమి పేరుతో సిద్ధాంతరాహిత్యంతో ఒక్కటై పోటీ చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం, టీజెఎస్, సీపీఐలకు ఎదురైంది ఓటమి అనేకంటే ఘోరపరాభవం అనడం సముచితం. బలం లేకున్నా.. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయి బీజేపీ తన పరువు తానే తీసుకొంది. కుల పార్టీలతో కలిసి ‘బహుజన లెఫ్ట్‌ పార్టీ’గా సీపీఎం జనం ముందుకెళ్లినా లభించింది సున్నాయే!  

సంక్షేమాన్ని నమ్ముకున్న టీఆర్‌ఎస్‌ : 
కేసీఆర్‌ పాలనలో ఎన్నదగినది ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేయడం. బడ్జెట్‌ నిధుల్లో 39% మేర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మొక్కుబడిగా కాకుండా నిజాయితీగా, చిత్తశుద్ధితో తమ జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు కృషి చేయడాన్ని వేరొకరు కాకుండా ఆయా వర్గాలు గ్రహించగలిగాయి. విశిష్ట పథకాలుగా కేసీఆర్‌ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ, పండుగలకు పేదలకు అభివృద్ధి కానుకల పంపిణీ, పేదలకు డబుల్‌ బెడ్‌రూవ్‌ు ఇళ్ల నిర్మాణం మొదలైన పథకాలు సామాన్యులను ప్రభావితం చేశాయి.

అభివృద్ధి కార్యక్రమాల్లో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ మొదలైనవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అన్నింటికన్నా మిన్నగా రైతు భీమా, వ్యవసాయ పెట్టుబడి రాయితీలు, సాగునీటి పథకాలు, హామీ మేరకు వ్యవసాయ రుణమాఫీ లాంటివి రైతాంగంలో ఎనలేని భరోసా కల్గించగలిగాయి. పైగా, గొర్రెల పంపిణీ, పాల పశువుల పంపిణీ, చేప పిల్లల పంపిణీ లాంటివి సామాన్యుని మనో ధైర్యాన్ని పెంచాయి. కనుకనే ఎవరెన్ని విధాలుగా ప్రచారం చేసినా, వాటిని చెవికెక్కించుకోకుండా ప్రజలు తమ కృతజ్ఞతను ఓట్ల రూపంలో చాటుకున్నారు.  

ప్రజా కూటమి విఫలం 
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌పార్టీ తొలి రోజు నుండి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న మాట నిజమే. అయితే, 2014లో ఎదురైన ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు తగాదాలు, ఆధిపత్య ధోరణులు తగ్గలేదు. దానికితోడు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత, ఎక్కువ పెత్తనం అప్పజెప్పడం చాలామందికి మింగుడు పడలేదు. పీసీసీ అధ్య క్షుడ్ని, రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడ్ని తప్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తులపరంగా అధికార పార్టీని విమర్శించడంలో కాంగ్రెస్‌ నేతలు ముందున్నప్పటికీ, ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించలేకపోయారు.మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ తన సహజలక్షణాలను విడిచిపెట్టలేదు. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలపడలేదు. ఇక, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీతో జతకట్టడం ఆ పార్టీకి ఆత్మహత్యాసదృశమైంది.

నిర్మాణం గానీ, నాయకులు గానీ లేని కోదండరావ్‌ పార్టీని కలుపుకోవడం కాంగ్రెస్‌ చేసిన మరో తప్పిదం. సీపీఐను కలుపుకోవడం వల్ల ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి కొంతమేర లాభం చేకూరింది. మొత్తం మీద ‘ప్రజాకూటమి’ ఏర్పాటు అన్నది సహజ రాజకీయ ప్రక్రియగా జరగలేదు. తెలంగాణ ఉద్యమం ఆసాంతం నడిచింది ఆత్మగౌరవ నినాదాంతోనే. అటువంటిది ప్రజా కూటమి గెలిస్తే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తిరిగి పెత్తనం సాగించ గలడన్న భయాందోళనలు తెలంగాణ ప్రజల్లో ప్రస్ఫుటంగా కన్పించాయి. చంద్రబాబు పదేళ్ల పాలనలో ‘పల్లెకన్నీరు’ పెట్టింది. రైతాంగం, చేనేతలు, కులవత్తులవారి ఆత్మహత్యలు, ఆకలి చావులతో తెలంగాణ పల్లెల్లో మత్యు ఘోష విన్పించింది. ఫలితంగానే, టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఘన విజయాన్ని చేకూర్చి ప్రజాకూటమిని మట్టి కరిపించారు.
  
కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ 

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ అనుభవాన్ని దష్టిలో పెట్టుకొని.. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా వెళ్దామని కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రతిపాదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొంటే.. దండిగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుతాయన్న ఆశ కొందరిలో బలంగా ఉంది. డబ్బుతో కొన్ని సీట్లయినా గెలవచ్చునని కొందరు కాంగ్రెస్‌ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ‘టీ’ అంటే తినడం; ‘డీ’ అంటే దోచుకో వడం; ‘పీ’ అంటే పంచుకోవడంగా టీడీపీ తయారైందని, చంద్రబాబు రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యం అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం తమ కార్యకర్తలకు పాఠాలు బోధించింది.

‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అన్నట్లు ఏ పార్టీనైతే నాలుగున్నరేళ్లుగా విమర్శిస్తూ వస్తున్నారో.. ఆ పార్టీతో జాతీయస్థాయిలో, తెలంగాణలో చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పొత్తును సమర్థించుకోవడానికి చూపగల హేతుబద్ధమైన కారణం ఏదీ రాష్ట్ర కాంగ్రెస్‌ వద్ద లేదు. మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష, జ్ఞానభేరి మొదలైన కార్యక్రమాలను ప్రజాధనంతో నిర్వహిస్తూ.. ఆ వేదికల నుండి తను ఎందుకు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నారు. తమ కలయికకు నైతికత ఆపాదించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు.

రాష్ట్ర విభజన సహేతుకంగా చేయని ‘పాపి’ కాంగ్రెస్‌ పార్టీ అని తిట్టిన చంద్రబాబునాయుడు ఆ ‘పాపి’ తోనే చేతులు కలపడాన్ని ఆంధ్ర ప్రజానీకం హర్షిస్తుందా? ఆశ్చర్యం ఏమిటంటే, తెలంగాణలో తెలుగుదేశం ఓటమికి కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడమే కారణమని సొంత మీడియాలో కథనాలు రాయించుకొని పరువు నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం తాపత్రయ పడుతున్నది. మరోపక్క తెలుగుదేశం వల్ల ఓటమి ఎదురైందని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ లోలో పల మధనపడుతున్నది కానీ, బాహాటంగా చెప్పడానికి ధైర్యం చేయలేకపోతోంది.   

కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏను, ప్రధాని మోదీని గద్దె దించడం ప్రజాస్వామ్య అనివార్యతగా తెలుగుదేశం ప్రచారం చేస్తున్నది. అవినీతికి పాల్పడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ దేశానికి ప్రమాదకారిగా చంద్రబాబునాయుడు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల అంశంగా అవినీతిని, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కావడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సివస్తే.. ఆ రెంటి విషయంలో మోదీ ప్రభుత్వం కంటే చంద్రబాబు సర్కార్‌ అందనంత ఎత్తులో ఉంది. ఈ లెక్కన చంద్రబాబు సర్కార్‌ను ఓడించడం ప్రజాస్వామ్యరీత్యానే కాదు.. రాజ్యాంగరీత్యా, ప్రజా ప్రయోజనాలరీత్యా అనివార్యం! తెలంగాణ ఎన్నికలో చంద్రబాబు సాగించిన రాజకీయ క్రీడ బెడిసికొట్టింది. ఇక మిగిలిందల్లా.. ఏపీ ఎన్నికలే.  

వ్యాసకర్త
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

శాసన మండలి ప్రతిపక్ష నాయకులు,
కేంద్ర మాజీ మంత్రి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top