ఒక ఒయాసిస్సు

Gollapudi Maruthi Rao Jeevan Kalam On Collector Kandasamy - Sakshi

జీవన కాలమ్‌  

తెల్లారిలేస్తే క్రిమినల్‌ కేసులతో పత్రికల్లో దర్శనమిస్తూ, రేప్‌లు, భూక బ్జాలతో పబ్బంగడుపుకునే నాయకులూ, వారి అడుగులకు మడుగులొ త్తుతూ వారితో పాటు జైళ్లకు వెళ్లే అధికారుల కథలు చదివి చదివి నిస్త్రాణతో ఈడిగిలపడుతున్న ప్రజానీకానికి ఇంకా మంచితనానికీ, మంచిపాలనకీ వేళ మించిపోలేదని గుర్తు చేసి వెన్నుతట్టే కొందరు ఐయ్యేయస్‌ల కథలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూంటాయి. సమాజగతిలో అందరూ మహాత్ములే ఉండరు. మన తరానికి ఒక్కడే మహాత్ముడు. కాని వారి దక్షత, సేవాభావం అందరూ సూర్యరశ్మిలాగ జాతిని జాగృతం చేసి– ఆరోగ్యకరమైన పరిణా మానికి ఇంకా వేళ మించిపోలేదన్న ‘ఆశ’ని బతికిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కథ.

తిరువణ్ణామళై జిల్లాలో ఆరణి అనే ఊరు దగ్గర 1000 మంది జనాభా ఉన్న కాణికిళుప్పాల్‌ అనే పల్లెటూరు. అక్కడ ఓ పేద కుటుంబం. ఇల్లాలు మధ్యాహ్న భోజన పథకంలో వంట మనిషికి సహాయకురాలిగా పనిచేస్తుంది. తండ్రి రోజు కూలీ. వాళ్లకి ముగ్గురు పిల్లలు. పెద్ద పిల్ల ఆనంది. 19 ఏళ్లు. తర్వాత కుర్రాడు. చెల్లెలు  మరీ చిన్నది.  ఉన్నట్టుండి ప్రసవానికి సంబంధించిన రుగ్మతతో తల్లి కన్నుమూసింది. తండ్రి మూత్రపిండాల వ్యాధితో మరణించాడు. వీరుకాక ఆ ఇంట్లో మరో ముదుసలి. ఆమే ఈ పిల్లలకి పెద్ద దిక్కు. ఇప్పుడు చదువుల సంగతి దేవుడెరుగు. బతకడానికి ఆస్కారం లేదు. ఈ పిల్ల వారం వారం ప్రజా సమస్యలు వాకబు చేసే తిరువణ్ణామళై కె.ఎస్‌. కందస్వామి దర్బారుకి వెళ్లింది. ప్రజా సమస్యలను కేవలం వినడమేకాక– చేతనయిన ఉపకారం చేస్తాడని ఈ అధికారికి ఆ జిల్లాలో పేరుంది. ఆయన సూటూ బూటూ వేసుకుని సభ తీర్చే ఆధికారికాదు. ‘‘బేర్‌ ఫుట్‌ బ్యురోక్రాట్‌ (స్తూలంగా ‘నేలబారు మనిషి’)అని పేరుంది. ఆయనకి తన గోడు చెప్పుకుంది. అక్కడికి వచ్చే ఎందరో ఆర్తులలో ఆ అమ్మాయీ ఒకరు. ఈ కలెక్టరు తమ గోడుని గుర్తుంచుకుంటారా? ఏదైనా ఉపకారం జరుగుతుందా? ఆ పిల్లకి మరో మార్గాంతరం లేదు. కలెక్టరు ఆమె చెప్పిన వివరాలు రాసుకున్నారు.

ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న కనీసపు వయస్సుని సడలించ మని– ఈ 19 ఏళ్ల పిల్ల గురించి ప్రభు త్వానికి రాసి సమ్మతిని తెప్పించాడు. ఉద్యోగం చేస్తూనే ఆమె దూరవిద్యా పథకం ద్వారా పై చదువు చదువుకోడానికి  ఏర్పాట్లు చేశాడు. ఈలోగా ఆ ఇంటి ముసలమ్మకూడా వెళ్లిపోయింది. ఇప్పుడా ముగ్గురు పిల్లలకీ దిక్కు, లేదు. 

ఒక రోజు ఆనందికి కలెక్టరుగారు స్వయంగా ఫోన్‌ చేశారు– డవాలా బంట్రోతుల వెనుక మాయమయే కలెక్టర్లున్న నేటికాలంలో ఓ అమ్మా యికి స్వయంగా కలెక్టరు ఫోన్‌ చెయ్యడమే విడ్డూరం. విషయం ఏమిటి? తాను ఆ మధ్యాహ్నం వారింటికి భోజనానికి వస్తున్నట్టు. ఆనంది కంగారు పడిపోయింది. ఈవార్త తెలిసిన గ్రామీణులు ఆ యింటి దగ్గర పోగయారు. కలెక్టరుగారు తన సిబ్బందితో వచ్చారు. భోజనానికి మాత్రమే రాలేదు. తానే స్వయంగా నడుంబిగించి– వంకాయ పులుసు, బంగాళ దుంప కూర, రసం, అప్పళం సిద్ధం చేశారు. వారి పంక్తిన కూచుని భోజనం చేశారు.

భోజనం అయాక చాపమీద కూర్చుని– తన అసిస్టెంటు చేతిలో కాగితం తీసుకుని ఆ పిల్లని చదవమన్నాడు. ఆ ఉత్తరం ప్రభుత్వం ఇచ్చిన తాఖీదు. ఆ వూళ్లో వాళ్ల అమ్మ నౌఖరుగా పని చేసిన మధ్యాహ్న భోజన పథకం ప్రోగ్రాంకి ఆమెని అధికారిగా నియమించారు. ఉత్తరం చదువుతూనే ఆ పిల్ల భోరుమంది. అంతేకాదు. కుర్రాడి హైస్కూలు చదువుకీ, ఆఖరి పిల్ల ఎలి మెంటరీ చదువుకీ ఏర్పాట్లు చేశారు. ఆమె నౌఖ రీకి వెళ్లడానికి  ఓ సైకిలుని బహూకరించారు. ఈ చర్య వల్ల జీవితం మీదా – అంతకంటే  సమా జంలో తన నిస్సహాయతకి దన్నుగా నిలిచిన పాలక వ్యవస్థ మీదా – ఓ 19 ఏళ్ల పిల్లకి ఎంత విశ్వాసం, కృతజ్ఞత  నిలదొక్కుకుంటుంది! ఆ చిన్న గ్రామం, అవినీతి ఊబిలో కూరుకుపోతున్న ఈ దేశానికి ఎంత ఆశని చిగురింపజేస్తుంది! కుటుంబం కష్టాలను ఆదుకున్న ఓ అధికారి దక్షత యంత్రాంగం  మీద ఎంత విశ్వాసాన్ని  పెంచుతుంది?

మంచితనం వైరస్‌. అధికారుల ఆరోగ్యకరమైన స్పందన ఈ వ్యవస్థలో సివిల్‌ సర్వీసుల లక్ష్యం బ్రిటిష్‌వారి పాలన ముగిశాక, వారి ఆఖరి వారసత్వంగా మనం మిగుల్చుకున్న ఒకే ఒక సర్వీసు సివిల్‌ సర్వీసు. ఎందుకని? ‘సేవ’ని బాధ్యతగా, వృత్తిగా, ఆదర్శంగా నిర్వహింపజేసిన వ్యవ స్థ అది. ఒకనాటి బ్రౌన్, మెకంజీ, ఆర్దర్‌ కాటన్‌ వంటి విదేశీ అధికారులు ఈ సర్వీసుని తమ కృషితో చిరస్మరణీయం చేశారు. తర్వాత తరాలవారు చాలా మంది– నాయకుల అడుగులకు మడుగులొత్తి గబ్బుపట్టించారు. ఈ కందస్వామి వంటివారు ఆనాటి తరానికి వారసులు.


- గొల్లపూడి మారుతీరావు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top