కార్పొరేట్‌ దేవుడు

Guest Column By Gollapudi Maruthi Rao Over God - Sakshi

జీవన కాలమ్‌

మొన్న వినాయక చతుర్థికి స్పెయిన్‌లో కొందరు హిందువులు వినాయకుని పూజ చేసుకున్నారు. అంతేకాదు, చిన్న ఊరే గింపు జరపాలనుకున్నారు. ఇది కొత్త సంప్రదాయం. తమ ఊరేగింపు వెళ్లే దారిలో ఒక చర్చి ఉంది. కనుక, ముందుగానే చర్చికి తమ ఉద్దేశం వివరిస్తూ ఆ దారిన వెళ్లడానికి అనుమతి కోరారు. చర్చి అధి కారులు నవ్వి, ‘‘మీ వినాయకుడు ఈ దారిన వెళ్లడమే కాదు, చర్చిలోకి వచ్చి మా ఏసు ప్రభువును కలిసి వెళ్లవచ్చు–ఇద్దరు దేవుళ్లూ మనందరినీ ఆశీర్వదిస్తారు’’ అన్నారు. మొన్న అదే వినాయక చవితినాడు తమిళనాడు షెన్‌కోటై్టలో మసీదు ఉన్న తమ రోడ్డులో ఊరే
గింపు వెళ్లరాదని కొందరు ముస్లింలు, ముఖ్యంగా యువత హిందూ భక్తులను ఎదిరించారు. రెండు వర్గాల మధ్యా వాగ్వివాదాలు చెలరేగాయి. ఆవేశాలు పెరిగాయి.

ఒకరి మీద ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఖాళీ విస్కీ సీసాలతో కొట్టుకున్నారు. మత దౌర్జన్యకారులు పది కార్లను, మూడు ఆటోలను, రెండు దుకాణాలను, ఒక ఏటీఎంనీ ధ్వంసం చేశారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టరు వచ్చారు. రెండు వర్గాలూ దేవుడిని అటకెక్కించి, మతాన్ని నెత్తిన పెట్టుకుని బిగుసుకున్నాయి. కర్ఫ్యూ విధించారు. ఏ దేశంలోనూ నాకు తెలిసి ఇలా దేవుడు వీధికెక్కడు. మతం వ్యక్తిగత విశ్వాసానికి ప్రతీక. ఒక వర్గం సామూహికంగా తమ దేవుడిని ఆరాధించడం ఈ దేశ సంప్రదాయం. మతం ఎల్లలను చెరిపేసిన మహానుభావులెందరో ఈ దేశంలో, ఇప్పుడు ఉన్నారు. ఇదే వినాయక చతుర్థి రోజున ఓ మిత్రుడు నాకు వాట్సాప్‌ సందేశాన్ని పంపాడు.

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం అద్భుతంగా ‘వినా యక స్తుతి’ని జపించిన రికార్డింగు అది. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు కొలిచే వేంకటేశ్వర     స్వామి మీద అలంకరించే సాలిగ్రామ మాల, అను నిత్యం పూజలు జరిపే సువర్ణ పుష్పాలు ఇద్దరు ముస్లిం భక్తులు ఇచ్చినవని చెబుతారు. ఇంకో విచిత్రమైన ఇప్పటికీ సాగే సంప్రదాయం భద్రాచల దేవస్థానంలో ఉంది. ప్రతీ ముక్కోటి ఏకాదశికీ స్వామివారికి మొదటి అభిషేకం అక్కడి తహసీల్దారు చెయ్యాలి. ఆనాటి కంచర్ల గోపన్న తహసీల్దారు కనుక. అయితే రెండు సంవత్సరాలు ఒక ముస్లిం ఇక్కడ తహసీల్దారుగా ఉన్నాడు. ఆయనే అభిషేకం చేశాడు. ఒకసారి ఒక క్రైస్తవుడు తహసీ ల్దారుగా ఉన్నాడు. క్రైస్తవుడే అభిషేకం చేశాడు! ఇది అప్పటి తానీషా హుకుం.

ఈ సంప్రదాయాలు, విశ్వాసానికి మతం లేదని నిరూపించిన అపూర్వ మైన ఘట్టాలు. ఇక సాంస్కృతిక రంగంలో తమ వైదుష్యంతో మతం ఎల్లలను చెరిపేసిన ఎందరో మహాను   భావులు గుర్తుకొస్తారు. భారత రత్న బిస్మిల్లా ఖాన్, షేక్‌ చిన మౌలానా సాహిబ్‌ నుంచి నేటి జేసుదాసు వరకూ అదో వైభవం. చాలా సంవత్సరాల కిందట మద్రాసు వెంకటనారాయణ రోడ్డులోని వేంకటేశ్వర మందిరంలో జేసుదాసు స్వామిని దర్శనం చేసుకుని, కచేరీ చేస్తూ తోడి రాగంలో ‘‘అపరాధము లన్ని మరిచి’’ని ఆలపించడం అస్మదాదులకు గర్వ కారణం. నేను నా ‘ఆత్మకథ’లో రాసిన ఓ సంఘటనని ఇక్కడ ఉదహరించాలి. చిన్నతనంలో మా అమ్మ స్కూలుకి వెళ్లి రోజూ ఒక కాణీ పట్టుకుని వచ్చేదట. మా అమ్మమ్మ గమనించి కోప్పడి కూతురుతో స్కూలుకు వచ్చింది.

మా అమ్మ కోసం ఎదురుచూస్తున్న గెడ్డం ముసలాయన్ని అడిగింది ‘‘ఏం తాతా! మా అమ్మాయికి రోజూ డబ్బు లిస్తున్నావు, ఎందుకు?’’ అని. ఆ ముసలాయన ఒక ముస్లిం. కంటతడి పెట్టుకుని, ‘‘ఈ వయస్సున్న నా కూతురు పోయిందమ్మా. ఆ పాపని చూస్తే నా బిడ్డ గుర్తుకు వస్తుంది’’ అన్నాడట. కడుపు తీపికి మతం లేదు. పేగు సంబంధానికి దేవుడు అడ్డం పడడు. ఇవాళ పరిస్థితులు ఎందుకిలా పరిణమించాయి. నాకు తెలుసు. మన మనస్సుల్లో నిలవాల్సిన దేవుడు వీధిన పడ్డాడు. దేవుడు పెట్టుబడిగా రాజకీయ పార్టీలు వెలిశాయి. అంతవరకూ పరవాలేదు. పదవిలో ఉన్న తమ దేవుడి భక్తుల్ని చూసి చదువులేని, సంస్కారం చాలని వర్గాలు రెచ్చిపోతు న్నాయి. మైనారిటీలకు మతం పెట్టుబడి. వీధిలో తమ మతం జెండా ఎగురవేయడం పార్టీకీ, తమ వర్గం గొప్పతనానికి నిదర్శనమని వారి ఉబలాటం. ఇది గొప్ప అనర్థం. దేవుడిని మనస్సుకీ, పూజ గదికీ పరిమితం చేయగలిగిన నాడు, పొరుగు మతానికి ఎల్లలు చెరిపివేయగల పెద్ద మనస్సుని వ్యవస్థ ప్రోది చేయ గలిగిన నాడు షెన్‌కోట్లై కనీసం స్పెయిన్‌ ఉదాత్తతని పుంజుకోగలదు. దేవుడు కార్లని తగలపెట్టమని ప్రోత్సహించడు. పరాయి దేవుడిని పలకరించడానికి ఉవ్విళ్లూరుతుంటాడు. 

గొల్లపూడి మారుతీ రావు
వ్యాసకర్త

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top